జన్వాడ.. ఓవైసీ.. మల్లారెడ్డిలకు రిలీఫ్.. హైడ్రా కమిషనర్ తాజా క్లారిటీ!
హాట్ టాపిక్ గా మారిన హైడ్రా ఏం చేస్తుంది? ఎవరిని టార్గెట్ చేస్తోంది. ఎవరి ఆస్తులపైకి బుల్డోజర్ ను పంపుతుంది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
By: Tupaki Desk | 28 Aug 2024 4:24 AM GMTహాట్ టాపిక్ గా మారిన హైడ్రా ఏం చేస్తుంది? ఎవరిని టార్గెట్ చేస్తోంది. ఎవరి ఆస్తులపైకి బుల్డోజర్ ను పంపుతుంది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఈ నేపథ్యంలో ఎవరికి తోచిన విశ్లేషణను వారు చేస్తున్న పరిస్థితి. ఇలాంటి వేళ.. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూడు ఆస్తులిప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అందులో ఒకటి మాజీ మంత్రి కేటీఆర్ ఆధీనంలో ఉన్న జన్వాడ ఫామ్ హౌస్.. ఓవైసీలకు చెందిన విద్యాసంస్థ.. మల్లారెడ్డి వర్సిటీకి చెందిన భూముల విషయంలో హైడ్రా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది చర్చగా మారింది.
ఇందుకుతగ్గట్లే.. మంగళవారం హైడ్రా.. ఇరిగేషన్.. రెవెన్యూ అధికారులు ఆయా చోట్ల పర్యటించటంతో వాతావరణం వేడెక్కింది. ఏ క్షణంలో అయినా హైడ్రా బుల్డోజర్ రంగంలోకి దిగటం ఖాయమని.. ఏ తెల్లవారుజామునో కూల్చివేతలు షురూ కానున్నట్లుగా ప్రచారం జరిగింది. అయితే.. ఇదేమీ ఉండదన్న విషయంపై హైడ్రా కమిషనర్ క్లారిటీ ఇవ్వటం గమనార్హం. రాజకీయ చదరంగంలో హైడ్రా పావుగా మారదలుచుకోలేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేస్తున్నారు.
ఓవైసీ.. మల్లారెడ్డి అన్నది తాము చూడటం లేదని.. విద్యార్థుల ఫ్యూచర్ గురించి ఆలోచిస్తామన్న ఆయన.. చెరువులను ఆక్రమించి కళాశాల భవనాలు కట్టడం వాళ్ల పొరపాటు అయి ఉండొచ్చని.. ఎఫ్ టీఎల్ అన్నది ముఖ్యమే అయినప్పటికీ దాని కంటే విద్యార్థుల ఫ్యూచర్ మరింత ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.
ఓవైసీ.. మల్లారెడ్డి లాంటి వ్యక్తుల విద్యాసంస్థలకు టైం ఇస్తామని.. పార్టీలకు అతీతంగా చర్యలు ఉంటాయన్న ఆయన.. ధర్మసత్రమైనా ఎఫ్ టీఎల్ పరిధిలో ఉంటే కూల్చేస్తామన్నారు. ఈ సందర్భంగా మరో కీలక వ్యాఖ్య చేశారు. హైడ్రా నోటీసు ఇవ్వదని.. కూల్చటమే చేస్తుందన్నారు. నగరంలోని పలు చెరువులు.. పార్కుల ఆక్రమణలపై పలువురు బీజేపీ కార్పొరేటర్లు హైడ్రా కమిషనర్ ను కలిసి కంప్లైంట్ ఇచ్చిన సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే.. జన్వాడలోని కేటీఆర్ ఆధీనంలోని ఫామ్ హౌస్ మీద చర్యల మాటేమిటి? అన్నది ప్రశ్నగా మారింది.
దీనిపైనా క్లారిటీ ఇస్తున్నారు. తాజాగా జన్వాడ ఫామ్ హౌస్ ను ఇరిగేషన్ శాఖ అధికారులు పర్యటించటం.. అక్కడి వాస్తవ పరిస్థితుల్ని మదింపు చేసిన దరిమిలా.. చర్యల బుల్డోజర్ వెళ్లే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం.. ఫామ్ హౌస్ కాంపౌండ్ గేటు మినహా.. ఫామ్ హౌస్ ఎఫ్ టీఎల్ పరిధిలో లేకపోవటం.. ట్రిపుల్ వన్ జీవో పరిధిలోకి రావటమే కారణంగా చెబుతున్నారు. ప్రస్తుతం ఎఫ్ టీఎల్ ను ఆక్రమించుకున్న కట్టడాలు.. నిర్మాణాల మీదనే బుల్డోజర్ పంపాలని భావిస్తున్నారు. ట్రిఫుల్ వన్ జీవో పరిధిలోని నిర్మాణాల మీద హైడ్రా ఫోకస్ చేయట్లేదు. ఒకవేళ.. జన్వాడ ఫామ్ హౌస్ మీద చర్యల కత్తి ఝుళిపించినా.. మహా అయితే ప్రహరీగోడ తప్పించి.. ముందుకు వెళ్లే అవకాశం లేదంటున్నారు. మొత్తంగా జన్వాడ ఫామ్ హౌస్.. ఓవైసీ.. మల్లారెడ్డిల విద్యాసంస్థలు బుల్డోజర్ కూల్చివేతల నుంచి సేఫ్ అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.