Begin typing your search above and press return to search.

ఆ కాలేజీలను కూడా వదలం.. హైడ్రా కమిషనర్ క్లారిటీ

దాంతో కబ్జాలన్నింటికీ చెక్ పెట్టేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రాను తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   29 Sep 2024 1:30 PM GMT
ఆ కాలేజీలను కూడా వదలం.. హైడ్రా కమిషనర్ క్లారిటీ
X

వరద నీరు వెళ్లకుండా చెరువులు, కుంటలు, నాలాలను ఆక్రమించి హైదరాబాద్‌, చుట్టుపక్కల వేలాది కట్టడాలు అక్రమంగా వెలిశాయి. దాంతో వర్షాకాలం వచ్చిందంటే వరదలు సిటీని ముంచెత్తుతున్నాయి. ఫలితంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వరదల్లో పడి కొట్టుకుపోతున్నారు. దాంతో కబ్జాలన్నింటికీ చెక్ పెట్టేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రాను తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

హైడ్రా వ్యవస్థ ఏర్పాటు నుంచి ఇప్పటివరకు వందలాది సంఖ్యలో అక్రమ కట్టడాలను కూల్చివేసింది. ఎకరాల కొద్దీ భూములను రికవరీ చేసింది. ముఖ్యంగా వీకెండ్ వచ్చిందంటే హైడ్రా మరింత దూకుడుగా ముందుకు వెళ్తోంది. ప్రతీవారం శని, ఆదివారాల్లో తన పనిని మరింత పెంచుతోంది. అయితే.. నిన్న ఈ రోజు హైడ్రా దూకుడుకు బ్రేక్ పడింది. దానికి కారణాలూ లేకపోలేదు.

ఇటీవల అమీన్‌పూర్‌లో హైడ్రాకు భయపడి ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. అయితే.. హైడ్రా ఆమె ఇంటికి మాత్రం ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చింది. ఈ క్రమంలో ప్రతిపక్షాలు ఈ అంశాన్ని బాగా ప్రచారం చేశాయి. అటు సోషల్ మీడియా వేదికగానూ నిలదీశాయి. దీంతో చాలా మందిలోనూ హైడ్రా పట్ల కాస్త వ్యతిరేకత భావన ఏర్పడింది. అలాగే.. కూకట్‌పల్లి పరిధిలో చేపట్టిన కూల్చివేతల క్రమంలో అక్కడి బాధితులు ఏడిచారు. అది కూడా బాగా వైరల్ అయింది. వాస్తవానికి కూలగొట్టిన షెడ్లు మాత్రమే బాధితులవి. అక్కడి స్థలాన్ని వేరే వ్యక్తి కబ్జా చేసి వీరికి రెంట్ నిమిత్తం ఇచ్చాడనేది తరువాత వచ్చిన క్లారిటీ.

మరోవైపు.. మూసీ నది ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం సిద్ధం కావడంతో అక్కడి కట్టడాలను కూల్చివేసేందుకు హైడ్రాకు ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలో అక్కడి బాధితుల నుంచి కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. అటు మహిళ ఆత్మహత్య.. ఇటు మూసీ బాధితుల నుంచి వ్యతిరేకత రావడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీడియా ముందుకు వచ్చారు. హైడ్రా లక్ష్యం.. జరిగిన అంశాలను వివరించారు.

ఈ క్రమంలో జన్వాడ ఫామ్ ‌హౌజ్ అంశాన్ని కూడా రంగనాథ్ ప్రస్తావించారు. జన్వాడ ఫామ్ హౌజ్ హైడ్రా పరిధిలోకి రాదని, అది జీవో 111 పరిధిలో ఉందని స్పష్టం చేశారు. తమ పరిధిలో ఉంటే తప్పకుండా కూల్చేవారమని చెప్పారు. ఇక.. ఒవైసీ మెడికల్ కాలేజీతోపాటు మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డిల కాలేజీల గురించి కూడా వివరించారు. ఇప్పటికే ఆ కాలేజీలకు నోటీసులు పంపించామని తెలిపారు. విద్యాసంవత్సరం ముగిసిన తరువాత తప్పకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. విద్యాసంవత్సరం ముగిశాక వాటిని కూడా కూలుస్తామని స్పష్టం చేశారు. పేదల ఇళ్లను కూల్చడం తమ లక్ష్యం కాదని, ఇంతవరకు తాము ఒక్క పేద ఇల్లు కూడా కూల్చలేదని స్పష్టం చేశారు. తాము కూల్చినవన్ని కూడా కబ్జాలో ఉన్నవేనని తెలిపారు. విల్లాలను నిర్మించిన వారంతా పెద్దలేనని.. హైడ్రాపై నెగెటివ్ ప్రచారంలోనూ వారి హస్తం ఉందని పేర్కొన్నారు.