Begin typing your search above and press return to search.

కేటీఆర్ ఫామ్ హౌస్ కూల్చివేతపై హైడ్రా కమిషనర్ కీలక వ్యాఖ్యలు!

గత కొన్ని రోజులుగా తెలంగాణలో హైడ్రా వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   29 Aug 2024 12:02 PM GMT
కేటీఆర్ ఫామ్ హౌస్ కూల్చివేతపై హైడ్రా కమిషనర్ కీలక వ్యాఖ్యలు!
X

గత కొన్ని రోజులుగా తెలంగాణలో హైడ్రా వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా మాదాపూర్ లో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత అనంతరం హైడ్రా వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. హైడ్రాకు చిన్నా పెద్దా అనే తారతమ్యాలు లేవనే విషయం ఆ ఘటనతో స్పష్టమైందనే కామెంట్లు వినిపించాయి.

దీంతో... రాజకీయంగాను ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. హైడ్రాతో రాజకీయ కక్ష సాధింపులు అనే కామెంట్లు పలువురి నుంచి వినిపిస్తున్నాయని అంటున్నారు. మరోవైపు.. హైడ్రా పెర్ఫార్మెన్స్ రాజకీయాలకు, పార్టీలకూ పూర్తిగా అతీతం అని సీఎం రేవంత్ చెబుతున్నారు. ఈ సమయంలో కేటీఆర్ ఫామ్ హౌస్ మేటర్ తెరపైకి వచ్చింది!

అవును... తెలంగాణలో హైడ్రా వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అవుతున్న వేళ.. కేటీఆర్ లీజుకు తీసుకున్నట్లు చెబుతున్న జన్వడ ఫామ్ హౌస్ పై చర్చ మొదలైంది. ఆ ఫామ్ హౌస్ కు అనుమతులు లేవని.. దీంతో దానిపై కూడా హైడ్రా ఉక్కుపాదం మోపనుందంటూ ప్రచారం ఊపందుకుంది ఈ సమయంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు.

ఇందులో భాగంగా... జన్వాడ ఫామ్ హౌస్ ట్రిపుల్ వన్ (111) జీవో పరిధిలో ఉందని.. అది తమ పరిధిలోకి రాదని.. అందువల్ల ఆ వ్యవహారంలోకి తాము ఎంటరవ్వబోమని రంగనాథ్ వెళ్లడించారు. 111 జీవో పరిధిలో వేల సంఖ్యలో నిర్మాణాలు ఉన్నాయని.. ఈ ఒక్కదాని కోసం తాము ప్రత్యేకంగా ఎందుకు వెళ్తామని ఆయన స్పందించారు.

అయితే... ఆ ఫామ్ హౌస్ ఎఫ్.టీ.ఎల్. పరిధిలోకి వస్తే మాత్రం కచ్చితంగా చేసేవాళ్లమని అన్నారు. అయితే... 111 జీవోలో అధికారులు ఆక్రమణలు తొలగించాల్సి వస్తే.. ఆ సమయంలో హైడ్రా సహాయం కోరితే.. కచ్చితంగా హైడ్రా పెర్ఫార్మెన్స్ ఉంటుందని రంగనాథ్ తెలిపారు. అంతేతప్ప ఒకరిని రాజకీయంగా టార్గెట్ చేసే పని అయితే హైడ్రా చేయదని స్పష్టం చేశారు!

కాగా... రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం జన్వాడ గ్రామంలోని ఫామ్ హౌస్ వద్ద రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సంయుక్తంగా సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా ఆరుగురు సభ్యుల బృందం.. నక్ష, డీజీపీఎస్ యంత్రాలతో సర్వే చేసింది. ఈ ఫామ్ హౌస్ పక్క నుంచి ఫిరంగి నాలా ప్రవహిస్తోందని.. నాలాలోనే ఫామ్ హౌస్ ప్రహారీ గొడ, గేటు నిర్మించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో... అధికారులు సర్వే నిర్వహించడం చర్చనీయాంశం అయ్యింది.