ఆ నిర్మాణాలు కూల్చం.. హైడ్రా కమిషనర్ కీలక వ్యాఖ్యలు
హైడ్రా కమిషనర్ రంగనాథ్ నేడు మీడియాతో మాట్లాడుతూ కీలక ప్రకటన చేశారు. కూల్చివేతలపై ఆయన క్లారిటీ ఇచ్చారు.
By: Tupaki Desk | 17 Dec 2024 11:30 AM GMTఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో వందలాది మందికి ఊరట లభించిందని చెప్పొచ్చు. హైడ్రా తీసుకున్న నిర్ణయంతో చాలా మందిలో నెలకొన్ని అనుమానాలు తొలగాయి.
హైడ్రా కమిషనర్ రంగనాథ్ నేడు మీడియాతో మాట్లాడుతూ కీలక ప్రకటన చేశారు. కూల్చివేతలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. హైడ్రా ఏర్పడక ముందు ఉన్న నిర్మాణాల జోలికి వెళ్లబోమని ఈ సందర్భంగా రంగనాథ్ స్పష్టం చేశారు. మంగళవారం కాముని చెరువు, మైసమ్మ చెరువులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడే మాట్లాడుతూ ఈ మేరకు క్లారిటీ ఇచ్చారు.
హైడ్రా ఏర్పాటుకాకముందు ఉన్న నిర్మాణాలను పట్టిచుకోబోమని, వాటి జోలికి వెళ్లమని రంగనాథ్ స్పష్టం చేశారు. జూలై తర్వాత కడుతున్న అక్రమ కట్టడాలనే కూల్చివేస్తామన్నారు. గతంలో అనుమతులు తీసుకొని ఇప్పుడు నిర్మిస్తున్న వాటి వైపు కూడా వెళ్లబోమని అన్నారు. కానీ.. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న వాటిని మాత్రం తప్పకుండా కూల్చివేస్తామని హెచ్చరించారు.
అలాగే.. కొత్తగా తీసుకున్న అనుమతులను సైతం హైడ్రా తనిఖీలు చేస్తుందని రంగనాథ్ వెల్లడించారు. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా చెరువుల పరిరక్షణకు అనుగుణంగా హైడ్రా పనిచేస్తుందని స్పష్టం చేశారు. హైడ్రా ఎప్పుడూ పేదవారి పక్షమేనని చెప్పారు. చిన్న వారి జోలికి ఎప్పుడూ పోమని, ఇప్పటివరకు కూడా పోలేదని వెల్లడించారు. తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని ప్రజలకు అప్పీల్ చేశారు.
హైదరాబాద్‌లో చెరువులు, నాలాలతో పాటు ప్రభుత్వ స్థలాలను కాపాడేందుకే హైడ్రా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. హైడ్రా ఏర్పాటు నుంచి అక్రమార్కుల గుండెల్లో బుల్డోజర్లు పరుగెత్తాయి. చెరువులు, నాలాలు ఆక్రమించి కట్టిన నిర్మాణాలను ఎక్కడికక్కడ కూల్చివేసిన సంగతి తెలిసిందే. హైడ్రా ఏర్పాటు నుంచి వందలాది నిర్మాణాలను కూల్చివేసింది. అయితే.. ఇప్పటివరకు కూడా పేదల జోలికి పోలేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టంచేశారు. రంగనాథ్ ప్రకటన కొంత మందికి ఊరటకలిగించనుంది. మరోవైపు.. హైడ్రాపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం వెనక్కి తగ్గిందా అన్న కామెంట్స్ సైతం వినిపిస్తున్నాయి. మొన్నటివరకు అక్రమ కట్టడాలను వదిలేది లేదని సీఎం రేవంత్, హైడ్రా స్పష్టం చేసింది. కానీ.. ఇప్పుడు పాత కట్టడాల జోలికి వెల్లబోమని చెప్పుకొచ్చారు. దాంతో వెనకడుగు వేసినట్లే అర్థం చేసుకోవచ్చన్న విమర్శలు వినిపిస్తున్నాయి.