Begin typing your search above and press return to search.

అమీన్ పూర్ లో హైడ్రామా.. లెక్క చేయని హైడ్రా

అమీన్ పూర్ కూల్చివేతలకు సంబంధించిన ఒక ఆసక్తికర అంశం ఆలస్యంగా బయటకు వచ్చింది.

By:  Tupaki Desk   |   4 Sep 2024 4:25 AM GMT
అమీన్ పూర్ లో హైడ్రామా.. లెక్క చేయని హైడ్రా
X

అమీన్ పూర్ కూల్చివేతలకు సంబంధించిన ఒక ఆసక్తికర అంశం ఆలస్యంగా బయటకు వచ్చింది. టార్గెట్ చేసిన లక్ష్యాన్ని పూర్తి చేసే వరకు వదిలిపెట్టని హైడ్రాకు ఇప్పటివరకు ఎదురుకాని సిత్రమైన సిట్యువేషన్ ఎదురైంది. అమీన్ పూర్ లో ప్రభుత్వ స్థలాన్ని కబ్జాకు పెట్టటం.. అందులోనే ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కొన్ని నిర్మాణాల్ని నిర్మించిన అంశం తమ వరకు రాగానే.. బుల్డోజర్ తో ఎంట్రీ ఇచ్చింది హైడ్రా. అయితే.. ఈ మధ్యనే కాంగ్రెస్ పార్టీలో చేరిన అమీన్ పూర్ మున్సిపల్ ఛైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా హైడ్రామా చోటు చేసుకుంది.

లారీని అడ్డు పెట్టి.. హైడ్రా, రెవెన్యూ అధికారుల్ని రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే.. ఇలాంటి వాటిని అస్సలు లెక్కే చేయనన్నట్లుగా.. భారీగా ఫోర్సుతో వెళ్లిపోయారు. దీంతో.. అమీన్ పూర్ మున్సిపల్ ఛైర్మన్ స్వయంగా రంగంలోకి దిగారు. రెవెన్యూ అధికారుల మీద సీరియస్ అవుతూ.. ప్రభుత్వ సర్వే నెంబరు 462ను అనుకొని ఉన్న పట్టా సర్వే నెంబరు 461లో 2018లో తాను అప్పటి భూ యజమానుల నుంచి 1.07 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లుగా పేర్కొన్నారు.

వారు చెప్పినట్లే ల్యాండ్ పొజిషన్ మేరకు తాను తన భూమిలో నిర్మాణాల్ని చేపట్టినట్లుగా పేర్కొన్నారు. తాను కొన్న పట్టా భూమి పక్కనే ప్రభుత్వ భూమి ఉండటంతో తన భూమిలో ఉన్న నిర్మాణాలు ప్రభుత్వ భూమిలో ఉన్నాయని పొరపడొచ్చన్న ఆయన.. తాను అమీన్ పూర్ మున్సిపల్ ఛైర్మన్ గా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న విషయాన్ని గర్తు చేశారు. తనకు ప్రభుత్వ భూమిని కొల్లగొట్టాల్సిన అవసరం లేదంటూ.. సరైన సర్వే రిపోర్టు లేకుండా పొంతన లేని సర్వేలతో తన భూమిలోని నిర్మాణాల్ని కూల్చివేయటం అన్యాయంగా పేర్కొన్నారు.

చుట్టూ ఉన్న యజమానులతో కలిసి సర్వే నిర్వహించి నిజానిజాల్నినిర్ధారించిన తర్వాత కూల్చివేతల్ని చేపట్టాలని ఎంతగా కోరినా హైడ్రా, రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదు. తమ పని తాము చేసుకుంటూ పోయారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అమీన్ పూర్ మున్సిపల్ ఛైర్మన్.. తన భూమిలో ప్రభుత్వ భూమి ఉన్నట్లు తేలితే తానే స్వయంగా అక్రమ నిర్మాణాల్ని తొలగించిన ప్రభుత్వానికి భూమిని అప్పగిస్తామని చెప్పారు. అయినప్పటికీ తగ్గని హైడ్రా.. తన పని తాను చేసుకుంటూ పోయింది. ఈ మొత్తం ఎపిసోడ్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీని గుర్తుకు తెచ్చేలా పరిణామాలు చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు. మొత్తంగా అధికార పార్టీలో ఈ మధ్యనే చేరిన అమీన్ పూర్ మున్సిపల్ ఛైర్మన్ కు హైడ్రా దిమ్మ తిరిగే షాకిచ్చిందని చెప్పాలి.