పల్లంరాజు పగబట్టినట్లేనా ?!
హైదరాబాద్ లో చెరువులు, కుంటలను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను కూల్చేందుకు ఏర్పాటు చేసిన హైడ్రా పలు నిర్మాణాలను కూల్చివేసిన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 1 Sep 2024 2:15 PM GMTహైదరాబాద్ లో చెరువులు, కుంటలను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను కూల్చేందుకు ఏర్పాటు చేసిన హైడ్రా పలు నిర్మాణాలను కూల్చివేసిన విషయం తెలిసిందే. నాగార్జున ఎన్ కన్వెన్షన్ కన్నా ముందే సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్రమంత్రి పల్లంరాజు సోదరుడు ప్రసాద్ కు చెందిన ఏడు ఎకరాల స్థలంలో ఉన్న స్పోర్ట్స్ విలేజ్ ను హైడ్రా కూల్చివేసింది.
దీంతో ఈ వ్యవహారం నేరుగా కాంగ్రెస్ అధిష్టానం వరకు వెళ్లింది. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ లను అధిష్టానం ఢిల్లీకి పిలిపించి విచారించింది. కాంగ్రెస్ పార్టీకి లాయలిస్టుగా ఉన్న పల్లంరాజుకు సంబంధించిన వాళ్ల కట్టడాలు కూల్చడం కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడం పట్ల ఎక్స్ వేదికగా పల్లంరాజు ఆవేదన వ్యక్తం చేయడం ఈ సమస్య తీవ్రతకు అద్దంపడుతుంది.
కూల్చివేతల రోజు పల్లంరాజు ఫోన్ చేసినా రేవంత్ రెడ్డి అసలు ఫోన్ ఎత్తలేదని, ఆ తర్వాత ఫోన్ కూడా చేయలేదని తెలుస్తుంది. నిజంగా హైడ్రా హైదరాబాద్ లో ఏం చేస్తుంది ? అని కాంగ్రెస్ అధిష్టానం వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా ఒక సభలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాబోయే సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి అని చెప్పడం కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్నది.
భువనగిరి ఎంపీగా చామలను గెలిపిస్తే క్యాబినెట్ మంత్రి పదవి ఇస్తానని లోక్ సభ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చాడు. లోక్ సభ ఎన్నికలు ముగిసి మూడు నెలలు అవుతున్నా ఖాళీగా ఉన్న ఆరు మంత్రి పదవుల గురించి కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి చర్యలు లేవు. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి వ్యాఖ్యల ప్రకారం త్వరలోనే రేవంత్ ను తప్పిస్తారా ? అన్న చర్చ మొదలయింది.
ముఖ్యంగా రేవంత్ రెడ్డి వర్గంలో ఈ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. అధిష్టానం ఆదేశిస్తే దానిని ఫాలో కావాల్సిందే. గతంలో రోశయ్యను సీఎం స్థానం నుండి తప్పించిన దాఖలాలను రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. నిజంగా ఆ పరిణామాలు గనక ఉంటే అధిష్టానాన్ని పల్లంరాజు వంటి వారు ప్రభావితం చేసే అవకాశం ఉంది.
కూల్చివేతల తర్వాత చాలా రోజులకు పల్లంరాజు ట్వీట్ చేసిన విధానం చూస్తే పల్లంరాజు రేవంత్ ప్రభుత్వం మీద గుర్రుగా ఉన్నారనే అనిపిస్తుంది. రేవంత్ విషయం ఏ అవకాశం వచ్చినా పరిణామాలను ఆయనకు వ్యతిరేకంగా మలచడంలో ఈ తరహా నేతలు తప్పక ఉంటారన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు.