Begin typing your search above and press return to search.

హైడ్రా బుల్డోజర్లు ఇప్పుడు ఎక్కడికంటే?

ఈ ప్రాంతంలో ప్రముఖల అతిధి గ్రహాలు.. ఇతర అక్రమణలు భారీగా ఉన్నాయి.

By:  Tupaki Desk   |   31 Aug 2024 5:29 AM GMT
హైడ్రా బుల్డోజర్లు ఇప్పుడు ఎక్కడికంటే?
X

రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన హైడ్రా మరో సంచలనానికి తెర తీసిందా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. అక్రమ నిర్మాణాల మీద ఇప్పటివరకు మరే వ్యవస్థా విరుచుకుపడనంత భారీగా స్పందిస్తున్న తీరుతో అక్రమ నిర్మాణదారులు హడలిపోతున్నారు. ఈ వీకెండ్ లో హైడ్రా టార్గెట్ లో కాస్త మార్పు చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. తాజా లక్ష్యం జంట జలాశయాలుగా చెబుతున్నారు. హిమాయత్ సాగర్ జలాశయం ఎఫ్ టీఎల్.. బఫర్ జోన్ లో ఉన్న ప్రముఖుల అతిథిగ్రహాలు.. ఇతర అక్రమణల తొలగింపునకు రంగం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.

ఈ ప్రాంతంలో ప్రముఖల అతిధి గ్రహాలు.. ఇతర అక్రమణలు భారీగా ఉన్నాయి. వీటిపై ఫోకస్ చేసిన హైడ్రా.. తగినంత సమాచారాన్ని తెప్పించుకుంటోంది. రెండు రోజుల్లో దీనిపై క్లారిటీ వస్తుంటుందని.. ఆ తర్వాత కూల్చివేతలు ఉంటాయని సంస్థ చెబుతోంది. వారం రోజులుగా క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహిస్తున్న వాటర్ బోర్డు.. ఇరిగేషన్ శాఖ అధికారులు ఎఫ్ టీఎల్.. బఫర్ జోన్ నిర్దారణపై ఒక అంచనాకు వచ్చినట్లుగా చెబుతున్నారు. దీనికి సంబంధించిన తుది నివేదిక సోమవారం నాటికి సిద్ధమవుతుందని చెబుతున్నారు.

హిమాయత్ సాగర్ పరిధిలోని అక్రమ నిర్మాణాలుగా తేల్చిన వాటిలో ఒక ఎమ్మెల్యే.. రాజకీయ నేతలతో పాటు సినీ ప్రముఖుల నిర్మాణాలు ఉన్నట్లుగా సమాచారం. ఇప్పటికే గండిపేట ఎఫ్ టీఎల్.. బఫర్ జోన్ అక్రమణలను హైడ్రా ఈ నెల పదకొండున నేలమట్టం చేసిన సంగతి తెలిసిందే. ఇందులో మాజీ కేంద్రమంత్రి పల్లంరాజు కుటుంబానికి చెందిన నిర్మాణాలతో పాటు.. కొందరు వ్యాపారవేత్తలు.. రాజకీయ నేతల భవనాల్ని కూల్చేశారు. అయితే.. ఎఫ్ టీఎల్ నోటిఫై కాలేదన్న కారణంగా హిమాయత్ సాగర్ లో ఆక్రమణలను మాత్రం తొలగించలేదు. అయితే.. అధికార పార్టీకి చెందిన వారి నిర్మాణాలు ఉన్నాయని.. అందుకే తొలగించలేదన్న విమర్శలు వస్తున్నాయి.

వీటికి చెక్ పెట్టే పనిలో భాగంగా వేగవంతమైన సర్వేను నిర్వహించారు. ఇందులో పాత రికార్డులు.. ఇతర వివరాల్ని పరిశీలించి.. అక్రమణలుగా గుర్తించిన కొన్నింటిపై మొదట కొరడా ఝుళిపిస్తారని చెబుతున్నారు. ఇందులో అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యేకు చెందిన నిర్మాణం కూడా ఉందంటున్నారు. అక్రమ నిర్మాణలు ఎవరివైనా సరే వెనక్కి తగ్గొద్దని.. అందరి మీదా చర్యలు సమానంగా ఉండాలన్న విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా తదుపరి సంచలనం హిమాయత్ సాగర్ ఎఫ్ టీఎల్ పరిధిలో ఉంటుందన్న మాట బలంగా వినిపిస్తోంది.