Begin typing your search above and press return to search.

కూల్చివేతలకు ముందు హైడ్రా సమాచారం ఇవ్వదా? క్లారిటీ ఇదే

హైడ్రా చర్యల కారణంగా స్థలయజమానికి జరిగే నష్టం ఒక ఎత్తు. తప్పు చేశారు కాబట్టి శిక్ష అనుభవిస్తున్నారని సరిపెట్టుకోవచ్చు.

By:  Tupaki Desk   |   23 Sep 2024 4:23 AM GMT
కూల్చివేతలకు ముందు హైడ్రా సమాచారం ఇవ్వదా? క్లారిటీ ఇదే
X

హైడ్రాతో విచిత్రమైన అనుభవాలు ఎదురవుతున్నాయి. హైడ్రా కారణంగా ఆస్తులు పోగొట్టుకున్న వారు తీవ్రమైన వ్యతిరేకతను వ్యక్తం చేస్తుంటే.. అందుకు భిన్నంగా చెరువులను చెరపట్టి.. దర్జాగా ఇళ్లు.. వాణిజ్య సముదాయాల్ని కట్టేసిన వారందరికి చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ మొత్తం ఎపిసోడ్ లో మరికొందరి పరిస్థితి ఇప్పుడు చర్చగా మారింది. కబ్జా చేసినోళ్లు.. లేదంటే నిబంధనలకు విరుద్ధంగా ఎఫ్ టీఎల్.. బఫర్ జోన్ లలో ఏర్పాటు చేసిన వ్యాపార.. వాణిజ్య సముదాయాలకు చెందిన లీజుదారుల పరిస్థితి హాట్ టాపిక్ గా మారింది.

హైడ్రా చర్యల కారణంగా స్థలయజమానికి జరిగే నష్టం ఒక ఎత్తు. తప్పు చేశారు కాబట్టి శిక్ష అనుభవిస్తున్నారని సరిపెట్టుకోవచ్చు. కానీ.. అద్దెకు తీసుకున్న పాపానికి కూల్చివేతల సందర్భంగా భారీ శిక్షపడటమే కాదు..జీవితంలో మళ్లీ కోలుకోవటానికి కూడా వీల్లేని రీతిలో నష్టపోవటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. కూల్చివేతల సందర్భంగా సదరు స్థలాన్ని అద్దెకు తీసుకున్న వారి వేడుకోళ్లు.. వేదనలు అందరిని కదిలిస్తున్నాయి. తమకు టైం ఇస్తే.. తమ వస్తువుల్ని తీసేస్తామని.. ఖాళీ చేస్తామని చెబుతున్నా.. కూల్చివేతలు ఆగకుండా ముందుకు వెళుతున్నాయి.

ఇలాంటి వీడియోలు చూసినప్పుడు మరీ ఇంత దారుణమా? అన్న భావన కలుగకమానదు. మరీ.. మానవత్వం అన్నది లేకుండా వ్యవహరించటం ఏమిటి? కాస్త ముందస్తు సమాచారం ఇచ్చేస్తే.. అందులోని సామాన్లు.. మెషిన్లు తీసే వీలుంటుంది కదా? అని ప్రశ్నిస్తున్నారు. ఆదివారం కుకట్ పల్లిలో నిర్వహించిన కూల్చివేతల్లో ఒక కిచెన్ తో పాటు.. ఫ్లెక్సీల ప్రింటింగ్ మెషిన్ యజమాని తీవ్రంగా నష్టపోయారు. ఫ్లెక్సీ ప్రింటింగ్ కు సంబంధించి ఒక అత్యాదునిక మెషిన్ ను రూ.కోటి పెట్టి తీసుకొచ్చి ఈ మధ్యనే ఏర్పాటు చేశారని.. హైడ్రా కూల్చివేతల్లో పూర్తిగా నష్టపోయినట్లుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక.. తన కొడుకు ఏర్పాటు చేసిన హోటల్ కు సంబంధించిన సామాన్లు బయటకు తీసుకెళ్లేందుకుసమయం ఇవ్వకుండా కూల్చేస్తున్నారంటూ ఒక మహిళ విలపించిన తీరు చాలామందిని అయ్యో అనేలా చేసింది.

లీజుతీసుకున్న పాపానికి అంత భారీ మూల్యం చెల్లించాల్సిన అవసరం ఉందా? హైడ్రాకున్న అధికారాలతో కూల్చివేతలు ఖాయమైనప్పుడు.. అమాయకులు నష్టపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కదా? అన్న మాట వినిపిస్తోంది. దీనిపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. కూల్చివేతలకు ఒక రోజు ముందే తాము సమాచారం ఇస్తున్నామని.. అయినా వారు ఖాళీచేయటం లేదంటున్నారు.

కుకట్ పల్లి ఎపిసోడ్ విషయానికి వస్తే.. శనివారమే సంబంధికులకు సమాచారం ఇచ్చామని.. వారు తమ సామాగ్రిని తొలగిస్తే సరిపోయేదంటున్నారు. తాము సమాచారం ఇచ్చినా ఖాళీ చేయకపోవటం లేదన్న అభిప్రాయాన్ని హైడ్రా అధికారులు వ్యక్తం చేస్తున్నారు. కూల్చివేతలకు రోజు ముందు సమాచారం ఇస్తే ఏం సరిపోతుందని.. కనీసం వారం ముందు ఇవ్వాలన్న మాటను చెబుతున్నారు. అదే జరిగితే.. కూల్చివేతలను ఏదోలా అడ్డుకుంటారని.. అది సాధ్యం కాదన్న అభిప్రాయాన్ని హైడ్రా అధికారి ఒకరు వ్యాఖ్యానించటం గమనార్హం.