Begin typing your search above and press return to search.

హైడ్రా ఎన్ వోసీ ఇచ్చాక మాత్రమే నిర్మాణాలు!

పెద్ద ఎత్తున ఒత్తిళ్లు వస్తున్నా పట్టించుకోని ఆయన.. హైడ్రాను మరింత పవర్ ఫుల్ గా మార్చే ప్రయత్నం చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   11 Sep 2024 4:52 AM GMT
హైడ్రా ఎన్ వోసీ ఇచ్చాక మాత్రమే నిర్మాణాలు!
X

రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇప్పుడు హైడ్రా మీద చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డి పాలనతో తనదైన మార్క్ వేయాలన్న తపన ఆయన మాటల్లో తరచూ కనిపిస్తూ ఉంటుంది. అందుకు తగ్గట్లే.. ఆయన హయాంలో తీసుకొచ్చిన హైడ్రా.. ఆయనకు సరికొత్త ఇమేజ్ ను తెచ్చిపెట్టిందని చెప్పాలి. పెద్ద ఎత్తున ఒత్తిళ్లు వస్తున్నా పట్టించుకోని ఆయన.. హైడ్రాను మరింత పవర్ ఫుల్ గా మార్చే ప్రయత్నం చేస్తున్నారు.

ఇందులో భాగంగా తాజాగా కొత్త అధికారాల్ని కట్టబెట్టినట్లుగా చెప్పాలి. ఇక.. నుంచి హైడ్రా నుంచి ఎన్ వోసీ ఉంటేనే నిర్మాణ అనుమతులు జారీ చేయాలని చెబుతున్నారు. చెరువులు.. నాలాలకు సమీపంలో నిర్మించే నివాస.. వాణిజ్య సముదాయాలకు హైడ్రా ఎన్ వోసీ తప్పనిసరిగా చేయనున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెబుతున్నారు.

హైడ్రా ఓకే చెప్పిన తర్వాత మిగిలిన విభాగాల వారు ఇంటి నిర్మాణాలకు పర్మిషన్లు ఇస్తే.. తప్పుడు పనులకు అవకావం ఉండదంటున్నారు. ఒకవేళ అక్రమంగా నిర్మాణాన్ని చేపడితే..ఆయా ఇళ్లకు ఇంటినెంబరు.. నల్లా కనెక్షన్ తో పాటు విద్యుత్ మీటర్లు కూడా ఇవ్వరని చెబుతున్నారు. ఈ విధానాన్ని అమలు చేస్తే.. హైదరాబాద్ మహానగరంలో ఇళ్లు కొనే వారికి భరోసా కలుగుతుందని.. హైడ్రా భయాందోళనల నుంచి కూడా బయటపడొచ్చని చెబుతున్నారు. అయితే.. గతంలోనూ రెరాను తీసుకొచ్చిన సమయంలో ఇలాంటి హడావుడే చేశారని.. ఇప్పుడేమైందన్న వాదన లేకపోలేదు.

తాజా పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు కేవైసీ ఎలానో.. ఇళ్లను కొనుగోలు చేసే వారు ‘కేవైఎల్’ (నో యువర్ లొకాలిటీ) సేవలు అందిస్తారని చెబుతున్నారు. కేవైఎల్ ఓకే చేసుకున్న తర్వాత ఇంటి కొనుగోలుపై నిర్ణయం తీసుకోవాలన్నారు. ప్రస్తుతం ఉన్న గందరగోళానికి విరుగుడుగా.. హైడ్రా ఎన్ వోసీ ఒక చక్కటి మార్గంగా చెబుతున్నారు. అదే జరిగితే.. ఇళ్ల కొనుగోలు దారుల్లో నమ్మకం కలగటంతోపాటు.. మార్కెట్ మీద కూడా విశ్వాసం పెరుగుతుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. మరి.. దీనిపై అధికారిక ప్రకటన ఎప్పుడు విడుదల చేస్తారో చూడాలి.