హైడ్రా కోసం చట్ట సవరణ.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!
చెరువులు, కుంటలు ఆక్రమించి నిర్మించిన కట్టడాలను కూల్చడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం హైడ్రా వ్యవస్థను రూపొందించింది.
By: Tupaki Desk | 12 Sep 2024 6:49 AM GMTచెరువులు, కుంటలు ఆక్రమించి నిర్మించిన కట్టడాలను కూల్చడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం హైడ్రా వ్యవస్థను రూపొందించింది. దీనికి సీనియర్ ఐపీఎస్ రంగనాథ్‌ను కమిషనర్‌గా నియమించింది. హైడ్రా ఏర్పాటు నుంచి కబ్జాదారులు వణికిపోతున్నారు. అలాగే.. హైడ్రా ఏర్పాటు మరుసటి రోజు నుంచే తన పనిని ప్రారంభించింది. ఎక్కడికక్కడ అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ వస్తోంది. పేద, ధనిక అనే తేడా లేకుండా అందరినీ ఒకేతీరుగా చూస్తే.. తన పని తాను చేసుకుపోతోంది. హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాలు, ఆటస్థలాలతో పాటు ప్రభుత్వ ఆస్తుల సంరక్షణే ధ్యేయంగా హైడ్రా పనిచేస్తోంది.
హైడ్రా ఇప్పటివరకు 74 రోజుల డిమాలిషన్ ఆపరేషన్‌లో భాగంగా 23 ప్రాంతాల్లోని 262 కట్టడాలను కూల్చివేసింది. పొలిటికల్ లీడర్లే కాకుండా.. సెలబ్రెటీలు, వ్యాపార వేత్తలు, కమర్షియల్ కాంప్లెక్స్‌లను నేలమట్టం చేసినట్లు కమిషనర్ రంగనాథ్ ప్రకటించారు. పలువురికి నోటీసులు జారీ చేసి స్వచ్ఛందంగా కూల్చివేయాలని ఆదేశాలిచ్చింది. గడువు లోపు కూల్చకుంటే ఆ తర్వాత తామే కూల్చేస్తామంటూ పేర్కొంది. ఈ కూల్చివేతలతో ఇప్పటివరకు 111.72 ఎకరాల చెరువుల భూమిని స్వాధీనం చేసుకున్నట్లు కమిషనర్ వెల్లడించారు.
అయితే.. హైడ్రా పనితీరుకు ప్రజల, పొలిటీషియన్ల నుంచి సానుకూల స్పందన వస్తోంది. మొన్నటికి మొన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సైతం హైడ్రా సేవలను కొనియాడారు. దాంతో తెలంగాణ ప్రభుత్వం కూడా హైడ్రా విషయంలో కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. ఇటీవలే హైడ్రా పరిధిని సైతం పెంచింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లో ఓఆర్‌ఆర్ వరకు హైడ్రా పరిధి పెంచింది. అలాగే.. పోలీస్ ఫోర్స్‌ను కూడా ఇచ్చింది. వీటితోపాటు మరికొన్ని అధికారాలు కట్టబెట్టేందుకు సిద్ధపడింది.
హైడ్రా వ్యవస్థను అన్నిజిల్లాల్లోనూ ఏర్పాటు చేయాలని ప్రజల నుంచి భారీగానే డిమాండ్ వినిపిస్తోంది. దాంతో ఇప్పటికే జిల్లాల్లోనూ ఏర్పాటు విషయంలో కలెక్టర్లు నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆక్రమణలను క్రమబద్ధీకరించేది లేదని ఆయన తేల్చిచెప్పారు.
ఈ క్రమంలో హైడ్రాకు మరిన్ని అధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ చట్టం తీసుకొచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తెలంగాణ భూ ఆక్రమణ చట్టం -1905కి సవరణ చేయాలని నిర్ణయించింది. రెవెన్యూ, ఇరిగేషన్, జీహెచ్ఎంసీ, బీ పాస్, వాల్టా, ఫైర్ సర్వీసెస్ శాఖలకు చట్టం ద్వారా ఉన్న కొన్ని అధికారాలను ఈ కొత్త ఆర్డినెన్స్ ద్వారా హైడ్రాకు అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.
ఇప్పటికే హైడ్రా పరిధిలో ఆస్తుల సంరక్షణ, విపత్తుల నిర్వహణ విభాగాలు ఇతర శాఖలకు సంబంధించిన అధికారాలు ఉన్నాయి. హైడ్రాకు మరిన్ని అధికారాలు ఇస్తేనే లక్ష్యం పూర్తిస్థాయిలో నెరవేరుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. రెవెన్యూ, ఇరిగేషన్ ఇతర శాఖల అధికారాలు బదలాయింపుతోపాటు హైడ్రా గవర్నింగ్ బాడీలో సీసీఎల్ఏ ఉండాలని, మిగిలిన చట్టాల్లోని నిబంధనల్లోనూ కొన్ని మార్పులు తేవాలని ఇటీవల సంప్రదించిన న్యాయవిభాగం సూచనలు చేసిందని సమాచారం. ఈ మేరకు సంబంధిత శాఖలతో చర్చించిన ప్రభుత్వం.. ఆ తరువాత తెలంగాణ భూ ఆక్రమణ చట్టం -1905కి సవరణ చేయాలని నిర్ణయానికి వచ్చిందట. మంత్రివర్గం ఆమోదంతో ఈ ఆర్డినెన్స్‌ను అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తోంది.