Begin typing your search above and press return to search.

మరింత పదునెక్కనున్న హైడ్రా.. 3 జోన్లుగా ఏర్పాటు?

ఇదిలా ఉండగా ఇప్పటివరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధి వరకు.. మరింత స్పష్టంగా చెప్పాలంటే ఔటర్ రింగ్ రోడ్ వరకు దీని పరిధి ఉంది.

By:  Tupaki Desk   |   8 Sep 2024 4:41 AM GMT
మరింత పదునెక్కనున్న హైడ్రా.. 3 జోన్లుగా ఏర్పాటు?
X

హాట్ టాపిక్ గా మారిన హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ)ను మరింత బలోపేతం చేసేందుకు వీలుగా ప్రభుత్వం చర్యల్ని చేపట్టనుంది. విపత్తుల వేళ సహాయ సహకారాలతోపాటు.. ప్రభుత్వ ఆస్తుల్ని పరిరక్షించేందుకు వీలుగా ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థ.. ఆశించిన దాని కంటే ఎక్కువ ఆదరణ లభించింది. అంతేకాదు.. రేవంత్ ప్రభుత్వానికి కొత్త ఇమేజ్ ను తీసుకొచ్చింది.

చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా అక్రమ నిర్మాణాల్ని కూల్చేస్తున్న వైనం ఆసక్తికరంగా మారింది. పలువురు బిగ్ షాట్స్ కు సంబంధించిన ఆస్తుల్ని నేలమట్టం చేయటం.. దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిడి లేకపోగా.. ఫ్రీ హ్యాండ్ ఇచ్చేయటంతో హైడ్రా ఇమేజ్ అంతకంతకూ పెరుగుతున్న పరిస్థితి. అదే సమయంలో హైడ్రా పరిధిని విస్తరించాలని.. దాన్ని రాష్ట్రం మొత్తం తీసుకురావాలన్న డిమాండ్ తెర మీదకు వచ్చింది. ప్రభుత్వం సైతం ఆ దిశగా ఆలోచించటం షురూ చేసింది.

ఇదిలా ఉండగా ఇప్పటివరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధి వరకు.. మరింత స్పష్టంగా చెప్పాలంటే ఔటర్ రింగ్ రోడ్ వరకు దీని పరిధి ఉంది. అయితే.. దీనికి బదులుగా ఇప్పుడున్న పరిధిని పెంచేందుకు వీలుగా కసరత్తు మొదలైనట్లు చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధి నుంచి హెచ్ ఎండీఏ వరకు విస్తరించేందుకు వీలుగా దీన్ని విస్తరించాలని భావిస్తున్నారు. అంతేకాదు.. ఈ మొత్తం వ్యవస్థను మూడు జోన్లుగా విభజించి.. వాటి బాధ్యతల్ని ఎస్పీ స్థాయి అధికారులకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుచెబుతున్నారు.

ఇందులో భాగంగా హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ ను సెంట్రల్ జోన్ గా.. సైబరాబాద్ ను నార్త్ జోన్ గా.. రాచకొండను సౌత్ జోన్ గా విభజించి.. వీటికి జోనల్ అధికారుల్ని.. పూర్తి స్థాయి సిబ్బందిని నియమించేందుకు వీలుగా కసరత్తు చేస్తున్నారు. ప్రత్యేక జీవో ద్వారా ఏర్పాటైన హైడ్రాకు చట్టబద్ధతను కల్పించేందుకు వీలుగా న్యాయ శాఖ పని మొదలు పెట్టింది. ఈ మూడు జోన్లకు అధికారులుగా ఎస్పీ ర్యాంక్ అధికారుల్ని కేటాయిస్తారని.. వీరిని హైడ్రా చీఫ్ కమిషనర్ పర్యవేక్షిస్తారని చెబుతున్నారు.

హైడ్రా కోసం ప్రత్యేక పోలీసు వ్యవస్థను తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. సాధారణ పోలీసుల్ని ఈ వ్యవహారాలకు వినియోగిస్తే.. వారి రోజువారీ విధులకు ఆటంకం కలిగించేలా మారుతుందని.. అందుకే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించిన కసరత్తు ఒక కొలిక్కి వచ్చినట్లుగా చెబుతున్నారు. ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో హైడ్రాను చట్టంగా మార్చేస్తూ సభ ఆమోదముద్ర వేస్తారని చెబుతున్నారు. మొత్తంగా రానున్న రోజుల్లో హైడ్రాతో మరిన్ని సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుందని చెప్పక తప్పదు.