హైడ్రా రంగనాథ్ కు అదిరే పోస్టు కట్టబెట్టిన రేవంత్ సర్కార్?
రంగనాథ్ చేతికి ఈ కీలక బాధ్యతను అప్పగించటం ద్వారా మహానగరం పరిధిలోని చెరువుల దశ తిరిగినట్లేనని చెబుతున్నారు.
By: Tupaki Desk | 3 Sep 2024 4:20 AM GMTహైడ్రా కమిషనర్ గా అక్రమార్కులకు.. అక్రమ కట్టడాలను నిర్మించే వారికి సింహస్వప్నంగా నిలిచిన ఐపీఎస్ అధికారి రంగనాథ్ కు తాజాగా మరో కీలక పదవి దక్కనుంది. హైదరాబాద్ మహానగరంలో హెచ్ఎండీఏ పరిధిలోని చెరువుల పరిరక్షణకు ఏర్పాటు చేసిన లేక్స్ ప్రొటెక్షన్ కమిటీ ఛైర్మన్ గా ఆయన్నునియమించినట్లుగా సమాచారం. దీంతో.. హెచ్ఎండీఏ పరిధిలోని చెరువులు ఆయన సంరక్షణలోకి వెళ్లనున్నాయి. ఇప్పటివరకు చెరువుల సంరక్షణ కమిటీ ఛైర్మన్ గా హెచ్ఎండీఏ కమిషన్ కొనసాగుతున్నారు.
చెరువుల సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న ముఖ్యమంత్రి రేవంత్.. అందులో భాగంగా ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అధికారికంగా ఈ ప్రకటన ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. ప్రస్తుతం అవుటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్న చెరువులు.. కుంటలు.. జలవనరుల ఎఫ్ టీఎల్ లు.. బఫర్ జోన్లను అక్రమించి చేపట్టిన నిర్మాణాల్ని హైడ్రా కూల్చేస్తున్న సంగతి తెలిసిందే. హెచ్ఎండీఏలోని 7 జిల్లాల పరిధిలో చెరువుల పరిరక్షణను కూడా హైడ్రా కిందకు తేవటంతో అక్రమణలకు గురి కాకుండా కాపాడొచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
రంగనాథ్ చేతికి ఈ కీలక బాధ్యతను అప్పగించటం ద్వారా మహానగరం పరిధిలోని చెరువుల దశ తిరిగినట్లేనని చెబుతున్నారు. ఇప్పటివరకు చెరువుల్ని ఇష్టారాజ్యంగా కబళిస్తున్నా.. చూసీచూడనట్లుగా ఉన్న హెచ్ఎండీఏకు బదులుగా.. హైడ్రా ఛైర్మన్ కు ఈ బాధ్యతను అప్పగించటం ద్వారా.. చెరువుల దశ తిరిగినట్లేనని.. అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.