Begin typing your search above and press return to search.

హైడ్రా దూకుడు... రిసార్ట్, కన్వెన్షన్ హాల్ నేలమట్టం!

చెరువును ఆక్రమించి కట్టారంటూ ప్రకృతి రిసార్ట్, కన్వెన్షన్ హాల్ ను హైడ్రా నేలమట్టం చేసింది.

By:  Tupaki Desk   |   14 Feb 2025 5:41 AM GMT
హైడ్రా దూకుడు... రిసార్ట్, కన్వెన్షన్ హాల్ నేలమట్టం!
X

గత కొన్ని రోజులుగా కాస్త సైలంట్ గా ఉన్నట్లు కనిపించిన హైడ్రా.. తాజాగా మరోసారి పెద్ద ఎత్తున విరుచుకుపడింది! ఇందులో భాగంగా... చెరువును ఆక్రమించి కట్టిన ప్రకృతి రిసార్ట్స్, కన్వెన్షన్ హాలును హైడ్రా నేలమట్టం చేసింది. మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా తూంకుంట మున్సిపాలిటీలోని దేవరయాంజల్ విలేజ్ లోని కోమటికుంటలో ఈ కూల్చివేతలు చేపట్టింది.

అవును... చెరువును ఆక్రమించి కట్టారంటూ ప్రకృతి రిసార్ట్, కన్వెన్షన్ హాల్ ను హైడ్రా నేలమట్టం చేసింది. ప్రధాన రహదారి పక్కనున్న చెరువూ ఎఫ్.టీ.ఎల్. పరిధిలోని భారీ భవనాలు, విడిది కేంద్రాలు, ఫంక్షన్ హాల్, ఇతర నిర్మాణాలను హైడ్రా పూర్తిగా తొలగించింది. ఈ సందర్భంగా స్పందించిన హైడ్రా కమిషనర్ కీలక విషయాలు వెల్లడించారు.

ఇందులో భాగంగా... ఈ ప్రకృతి రిసార్ట్స్ నిర్మాణాలన్నీ చెరువులో ఉన్నట్లు నీటిపారుదల శాఖ, రెవెన్యూ, మున్సిపల్ అధికారుల సర్వేలో స్పష్టమైందని రంగనాథ్ వెల్లడించారు. ఇదే సమయంలో భవనాలకూ అనుమతులు లేవని తెలిపారు. వాస్తవానికి.. సర్వే అనంతరం యజమానులకు నోటీసులు ఇవ్వగా.. వారు హైకోర్టును ఆశ్రయించారని రంగనాథ్ తెలిపారు.

ఈ సమయంలో అటు యజమానులు, ఇటు హైడ్రా వాదనలు విన్న న్యాయస్థానం.. అక్రమ కట్టడాలను కూల్చివేయాలని తీర్పు చెప్పింది. అయితే.. వీటిని తామే తొలగించుకుంటామని యజమానులు నెల సమయం అడిగారు. అయితే.. నెల దాటినా అవి అలానే ఉండటంతో తామే కూల్చేశామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరించారు.

మరోపక్క అనుమతులు లేని ప్రకటనల హోర్డింగులపైనా హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. దీంతో.. పలు ఏజెన్సీల ప్రతినిధులు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను కలిశారు. ఈ సమయంలో.. తమకు ఓ 10 రోజుల సమయం ఇస్తే స్వయంగా తొలగించుకుంటామని కోరారు. అయితే అందుకు రంగనాథ్ అంగీకరించలేదు.

ఈ సందర్భంగా ఇప్పటికే మీకు చాలా సమయం ఇచ్చామని.. అయినప్పటికీ మీరు చర్యలు తీసుకోకపోవడంతోనే కూల్చుతున్నామని వివరించారు. ఈ నేపథ్యంలోనే.. కొత్వాల్ గూడ, నార్సింగ్, శంషాబాద్, గొల్లపల్లి రోడ్డు, తొండుపల్లి, తెల్లాపూర్ మొదలైన ప్రాంతల్లో గత వారం రోజుల్లో సుమారు 53 ప్రకటనల బోర్డులను తొలగించినట్లు రంగనాథ్ తెలిపారు.