హైదరాబాద్ లో ఆక్రమణదారుల గుండెలదిరే.. ఆదివారం హైడ్రా వారం
హైదరాబాద్ కు ఒకప్పుడు తాగు నీరందించిన జంట జలాశయాల్లో ఒకటైన గండిపేట
By: Tupaki Desk | 22 Sep 2024 12:21 PM GMTహైదరాబాద్ కు ఒకప్పుడు తాగు నీరందించిన జంట జలాశయాల్లో ఒకటైన గండిపేట (హిమాయత్ సాగర్) లో ఫుల్ ట్యాంక్ లెవల్ లో ఆక్రమణల నుంచి.. ప్రముఖ సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత వరకు.. సికింద్రాబాద్ మణెమ్మ కుంటలో కజ్జాల నుంచి కూకట్ పల్లి నల్ల చెరువులో ఆక్రమణల దాకా.. ఆదివారం అంటే హైడ్రా వారంగా మారుతోంది. ఆక్రమణదారుల గుండెలదరగొడుతోంది. ఈ ఆదివారం కూకట్ పల్లి నల్లచెరువులోని ఆక్రమణల పని పట్టింది.
వినాయక చవితితో విరామం..
హైడ్రా గత నెల వరకు దూకుడు చూపింది. ఏ రోజు ఎక్కడ బుల్డోజర్ దిగుతుందో అన్న భయంలో కబ్జాదారులు ఉండేవారు. అయితే, ఇంతలో వినాయక చవితి ఉత్సవాలు రావడంతో వెనక్కుతగ్గింది. మధ్యలో సుప్రీం కోర్టులో.. బుల్డోజర్ న్యాయంపై కేసు విచారణ ఉండడంతోనూ హైడ్రా నిదానించింది. గత వారం సుప్రీం కోర్టు తీర్పు వెలువడ్డాక స్పష్టత రావడంతో ఇప్పుడు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగింది.
ఉరుము లేని పిడుగులా..
హైదరాబాద్ లో ఆదివారం వస్తున్నదంటే హైడ్రా రంగంలోకి దిగుతుందని స్పష్టం అవుతోంది. ఇప్పటివరకూ చేపట్టిన ప్రధాన కూల్చివేతలన్నీ ఆదివారం నాటివే కావడం గమనార్హం. కూకట్ పల్లి నల్ల చెరువులో ఆక్రమణల విషయానికి వస్తే ఈ చెరువు మొత్తం విస్తీర్ణం 27 ఎకరాలు. ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టీఎల్), బఫర్ జోన్ లో ఏడు ఎకరాలు కబ్జాదారుల పరమైంది. బఫర్ జోన్ లోని 4 ఎకరాల్లో 50 పైగా పక్కా భవనాలు, అపార్టుమెంట్లు కట్టారు. ఎఫ్ టీఎల్ లోని మూడు ఎకరాల్లో 25 భవనాలు, 16 షెడ్లు ఉన్నాయి. అయితే, ప్రజలు నివాసం ఉంటున్న భవనాలను మినహాయించి 16 షెడ్లను హైడ్రా కూల్చివేసింది.
పొరుగు జిల్లాలోనూ..
హైదరాబాద్ ను ఆనుకుని ఉండే సంగారెడ్డి జిల్లా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వచ్చే అమీన్ పూర్ మున్సిపాలిటీపైనా హూడ్రా నజర్ పెట్టింది. పటేల్ గూడ గ్రామానికి చెందిన సర్వే నం.12లోని అక్రమ నిర్మాణాలను ఆదివారం నేలమట్టం చేసింది. వాస్తవానికి దీనిపై మూడు రోజుల కిందటే నోటీసులు జారీ చేసింది. ఇక్కడ ఏకంగా 14 విల్లాలను తొలగిస్తోంది. ఇళ్లలో నివాసం ఉంటున్నవారిని ఖాళీ చేయించారు. కిష్టారెడ్డిపేట గ్రామ పరిధి 164 సర్వే నంబరులోని మూడు అపార్ట్ మెంట్ల కూల్చివేత కొనసాగుతోంది.