Begin typing your search above and press return to search.

హైడ్రా మరింత స్ట్రాంగ్.. ఆ ఆర్డినెన్స్‌కు గవర్నర్ గ్రీన్ సిగ్నల్

తాజాగా.. మూసీ నది వెంట ఉన్న కట్టడాలను తొలగించి.. మూసీ సుందరీకరణ పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

By:  Tupaki Desk   |   2 Oct 2024 6:24 AM GMT
హైడ్రా మరింత స్ట్రాంగ్.. ఆ ఆర్డినెన్స్‌కు గవర్నర్ గ్రీన్ సిగ్నల్
X

గ్రేటర్ హైదరాబాద్, చుట్టపక్కల పరిధినలోని కబ్జాకు గురైన చెరువులు, కుంటలను కాపాడేందుకు హైడ్రా ఏర్పాటైంది. రెండు నెలల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిందీ హైడ్రా. హైడ్రా వ్యవస్థ ఏర్పాటు నుంచి అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ వస్తోంది.

తాజాగా.. మూసీ నది వెంట ఉన్న కట్టడాలను తొలగించి.. మూసీ సుందరీకరణ పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో అక్కడి వారికి డబుల్ బెడ్ రూములను సైతం కేటాయించింది. అయితే.. కొందరు బాధితులు డబుల్ బెడ్ ఇళ్లలోకి వెళ్తుండగా.. మరికొందరేమో నిరసన బాట పట్టారు. దాంతో ఈ వివాదం కాస్త పొలిటికల్ అగ్గి రాజేసింది. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు మూసీ బాధితులకు అండగా నిలిచేందుకు ప్రయత్నం చేస్తున్నారు. వారిలో భరోసా నింపుతున్నారు.

కట్ చేస్తే.. హైడ్రా ఇప్పటివరకు ఎలాంటి చట్టబద్ధత లేదు. కానీ.. ఇటీవల రాష్ట్ర కేబినెట్ భేటీ అయింది. భేటీలో భాగంగా హైడ్రాకు పలు అధికారాలు ట్రాన్స్‌ఫర్ చేశారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల నుంచి అధికారాలను బదలాయించారు. స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అధికారాన్ని కట్టబెట్టారు. అయితే దానికి సంబంధించి చట్టబద్ధత రాలేదు. చట్టబద్ధత కోసం ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేసింది. గవర్నర్ వద్దకు బిల్లును పంపించింది.

అలాగే.. కొంత మంది అధికారులను రాజ్‌భవన్‌కు పంపించి మూసీ వల్ల దుష్పరిణామాలు.. భవిష్యత్తులో దానిని తీర్చే అంశాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దాంతో గవర్నర్ కూడా ఆ సమయంలో సుముఖత వ్యక్తం చేశారు. అయితే.. అప్పటి నుంచి పెండింగులో ఉన్న ఆర్డినెన్స్‌కు ఎట్టకేలకు క్లియరెన్స్ లభించింది. ఎట్టకేలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. జీహెచ్ఎంసీ చట్టం 1955లో 374బి సెక్షన్ చేరుస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది.

ఔటర్ రింగ్ రోడ్డు వరకు చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమణకు గురైతే వాటిని తొలగించేందుకు ప్రస్తుతం వేర్వేరు విభాగాల నుంచి నోటీసులు ఇవ్వాల్సి ఉంది. ఆ తర్వాతే హైడ్రా తన పనిని మొదలు పెట్టేది. కానీ.. ఈ ఆర్డినెన్స్‌ ద్వారా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, రెవెన్యూ, నీటిపారుదల శాఖలకు ఉన్న అధికారాలన్నీ హైడ్రాకు సంక్రమిస్తాయి. దీంతో స్వతంత్రంగా నోటీసులు జారీ చేసుకునే వెసులుబాటు లభించింది. ఓఆర్ఆర్ వరకు ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, నాలాలు పరిరక్షిస్తూ హైడ్రాకు సర్వాధికారాలు ఇచ్చేలా ఈ చట్టాన్ని రూపొందించారు. ఎట్టకేలకు ఆర్డినెన్స్‌కు గ్రీన్ సిగ్నల్ రావడంతో ఇక హైడ్రాకు చట్టబద్ధత వచ్చేసింది.