Begin typing your search above and press return to search.

40 రోజుల్లో అక్రమ కట్టడాలపై హైడ్రా దూకుడు లెక్క రిపోర్టు రిలీజ్

శనివారం తెల్లవారుజామున ప్రముఖ సినీ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను కూల్చేసిన వైనం పెను సంచలనంగా మారింది.

By:  Tupaki Desk   |   26 Aug 2024 4:37 AM GMT
40 రోజుల్లో అక్రమ కట్టడాలపై హైడ్రా దూకుడు లెక్క రిపోర్టు రిలీజ్
X

హైదరాబాద్ మహానగరంలోని చెరువుల్ని అక్రమించేసి.. ఎఫ్ టీఎల్.. బఫర్ జోన్ పరిధిలో కట్టేస్తున్న అక్రమ నిర్మాణాలపై హైడ్రా కన్నెర్ర చేయటం తెలిసిందే. 40 రోజుల వ్యవధిలో హైడ్రా వ్యవహరించిన తీరు.. అది చేపట్టిన చర్యలు పెను సంచనలంగా మారటమే కాదు.. ఇప్పుడు వార్తలు మొత్తం హైడ్రా చుట్టూనే తీరుగుతున్న పరిస్థితి. శనివారం తెల్లవారుజామున ప్రముఖ సినీ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను కూల్చేసిన వైనం పెను సంచలనంగా మారింది. దీంతో.. గడిచిన 40 రోజుల్లో హైడ్రా ఎన్నెన్ని ఆస్తుల్ని కూల్చేసింది. అందులో ప్రముఖులకు చెందిన ఆస్తులు ఎన్ని? వారెవరు? పక్షపాతంతో రేవంత్ సర్కారు వ్యవహరిస్తుందా? లాంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలో హైడ్రా ఒక నివేదిక సిద్ధం చేసింది. గడిచిన 40 రోజుల్లో తామేం చేశామన్న వివరాలతో పాటు.. ఏయే ఆస్తులపై చర్యలు తీసుకున్న వివరాల్ని ఓపెన్ గా వెల్లడించింది. ఇందులో పలు ఆసక్తికర అంశాలు ఉన్నాయి. మొత్తం 40 రోజుల్లో 18 చోట్ల చెరువులు.. పార్కు స్థలాల్లోని కట్టడాల్ని నేలమట్టం చేసిన హైడ్రా కారణంగా 43.94 ఎకరాల భూమి విస్తీర్ణం చెరువు ప్రాంతాల పరిధిలోకి వచ్చేసినట్లుగా పేర్కొన్నారు.

హైడ్రా కూల్చివేతలు చేపట్టిన వారిలో దాదాపు ప్రముఖులే ఉండటం గమనార్హం. వీరిలో సొంత పార్టీకి చెందిన నేతలు మొదలు విపక్షాలకు చెందిన వారు.. సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న వారితో పాటు.. ప్రముఖులు.. సెలబ్రిటీలతో పాటు.. ఎవరిని విడిచిపెట్టలేదన్నట్లుగా రిపోర్టులోని వివరాల్ని చూస్తే అర్థమవుతుంది.నివేదికలో పేర్కొన్న ప్రముఖుల పేర్లను చూస్తే..

- సినీ నటుడు నాగార్జున

- మజ్లిస్ ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్

- మజ్లిస్ ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్

- మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు సోదరుడు పల్లం ఆనంద్

- మంథని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫు పోటీ చేసిన సునీల్ రెడ్డి

- చింతల్ బీజేపీ నేత రత్నాకరం సాయిరాజు

- కావేరీ సీడ్స్ యజమాని భాస్కర్ రావు

- ప్రోకబడ్డీ జట్టు యజమాని శ్రీనివాస్ భార్య అనుపమ

40 రోజుల వ్యవధిలో హైడ్రా కూల్చివేత్తలు సాగిన ప్రాంతాల్ని చూస్తే.. బంజరాహిల్స్ లోటస్ పాండ్.. మన్సూరాబాద్.. బీఆర్ కే నగర్.. గాజుల రామారం.. అమీర్ పేట.. మాదాపూర.. గండిపేట తదితర ప్రాంతాలు ఉన్నాయి. ఇక.. నందగిరి హిల్స్ పార్కు ప్రహరీ గోడను కూల్చేశారు. అ సందర్భంగా అక్రమణల కూల్చివేతను అడ్డుకునే ప్రయత్నం చేసిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై కేసు నమోదు చేసినట్లుగా పేర్కొన్నారు.

కూల్చివేతలో కీలక పరిణామాల్ని చూస్తే..

జులై 14: ఫిలింనగర్ జేజేఆర్ నగర్ లో 5 ఎకరాల విస్తీర్ణంలో నాలా అక్రమించి వేసిన స్లాబ్ తొలగింపు

ఆగస్టు 8: గాజులరామారం చింతల్ చెరువులో 3.5 ఎకరాలను బీఆర్ఎస్ స్థానిక నేత రత్నాకరం సాయిరాజు అక్రమించి 54 రేకుల షెడ్డులు వేస్తే నేలమట్టం చేశారు.

ఆగస్టు9: జూబ్లీహిల్స్ నందగిరి హిల్స్ లో 0.18 ఎకరాల్లో వేసిన 16 షెడ్ల తొలగింపు. ఈ సందర్భంలోనే ఎమ్మెల్యే దానం జోక్యం చేసుకోవటం జరిగింది.

ఆగస్టు10: రాజేంద్రనగర్ బమ్ రుద్దీన్ దౌలా చెరువులో 12 ఎకరాల విస్తీర్ణంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత. బహదూర్ పురు మజ్లిస్ ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్ అక్రమించి జీప్లస్5 అంతస్తులు కట్టారు. ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ జీప్లస్ 2 అంతస్తుల భవనం కట్టారు. వీరితో పాటు మరికొన్ని నిర్మాణాల్ని కూల్చేశారు.

ఆగస్టు14: ప్రగతినగర్ ఎర్రకుంట చెరువులో 0.29 ఎకరాలు ఆక్రమించి కట్టిన మూడు ఐదు అంతస్తుల భవనాల్ని కూల్చేశారు.

ఆగస్టు18: ఖానాపూర్ లో 8.75 ఎకరాల మేర గండిపేటచెరువును కబ్జా చేసి.. కట్టిన 14 నిర్మాణాల కూల్చివేత. చిలుకూరులో ఉస్మాన్ సాగర్ లో 6.5 ఎకరాల్లో కట్టిన 10 నిర్మాణాల కూల్చివేత. గండిపేట చెరువును అక్రమించి నిర్మించిన ఓఆర్వో స్పోర్ట్స్ భవనం కాంగ్రెస్ నేత పల్లంరాజు సోదరుడిది. ఇదే రోజు కావేరీ సీడ్స్ యజమాని.. మంథని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి.. ప్రొకబడ్డీ జట్టు యజమాని శ్రీనివాస్ సతీమణికి చెందిన నిర్మాణాల్ని నేలమట్టం చేశారు.

ఆగస్టు24: మాదాపూర్ తమ్మిడికుంటలో 4.9 ఎకరాలు అక్రమించి సినీ నటుడు నాగార్జున నిర్మించిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత.