Begin typing your search above and press return to search.

హైదరాబాద్ ఇకపై ‘హైడ్రా’బాద్ అవుతుందేమో?

నిజాయతీపరుడైన అధికారిగా పేరున్న కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో హైడ్రా చేపడుతున్న కూల్చివేతలను సహజ వనరుల రక్షణ పట్ల ఆపేక్ష ఉన్నవారిని ఆకట్టుకుంటోంది.

By:  Tupaki Desk   |   26 Aug 2024 1:30 PM
హైదరాబాద్ ఇకపై ‘హైడ్రా’బాద్ అవుతుందేమో?
X

‘అదేదో హైడ్రా అట కద.. హైదరాబాద్ లో చెరువులను మింగేసి ఇళ్లు కట్టిన పెద్దపెద్దవాళ్ల భరతం పడుతోందట.. అలాంటి మన ఊరిలోనూ ఉంటే బాగు..’ తెలంగాణలోని ఓ సాధారణ గ్రామంలో చాయ్ బండి దగ్గర కొందరి ముచ్చట...

‘‘సారూ.. మా ఊరిలో ఒకప్పు 8 ఎకరాల్లో చెరువు ఉండేది.. కబ్జా చేసి వెంచర్లు వేశారు. దానిని వెదికి పెట్టండి’’.. తుమ్మలచెరువు జాడ కనిపించట్లేదని పహాడీషరీఫ్‌ పోలీసు స్టేషన్‌ లో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ గ్రామస్థుల ఫిర్యాదు.

ఇదీ ప్రస్తుతం హైదరాబాద్ లోనే కాదు తెలంగాణ వ్యాప్తంగా నడుస్తున్న చర్చ.. కమిషనర్ ఏవీ రంగనాథ్ సారథ్యంలో.. ఆక్రమణలపై దూకుడుగా వెళ్తున్న హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఎసెట్స్‌ మానిటరింగ్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ(హైడ్రా) బడాబాబుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. గత ఆదివారం కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు, కావేరీ సీడ్స్ యజమాని భాస్కర్ రావు, ప్రొ కబడ్డీ లీగ్ ఓనర్ శ్రీనివాస్ భార్య అనుపమ తదితరులు గండిపేట చెరువు ఫుల్ ట్యాంక్ లెవల్ లో ఎకరాలకు ఎకరాలు ఆక్రమించి కట్టిన ఫాంహౌస్ లను నేల మట్టం చేసింది. నిన్నటికి నిన్న సినీ నటుడు నాగార్జున కట్టిన ఎన్ కన్వెన్షన్ ను తెల్లారేసరికి కూల్చేసింది. మొత్తం మూడు నెలల్లో… రాజధానిలో చెరువులు, పార్కు స్థలాలు ఆక్రమించి 18 చోట్ల చేపట్టిన 166 నిర్మాణాలను పడగొట్టామని హైడ్రా ప్రభుత్వానికి నివేదించింది. చెరువుల పూర్తిస్థాయి నీటిమట్టం(ఎఫ్‌ టీఎల్‌), బఫర్‌ జోన్‌ లో నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా ఏర్పాటైనప్పటి నుంచి చేపట్టిన చర్యలపై సర్కారుకు నివేదిక సమర్పించింది.

స్వచ్ఛందంగా ఫిర్యాదులు..

హైడ్రా రంగంలోకి దిగాక హైదరాబాద్ వ్యాప్తంగా చెరువులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలపై ప్రజలు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల నేతల నుంచి స్వచ్ఛందంగా ఫిర్యాదులు అందుతుండడం గమనార్హం. అంతేకాదు.. ప్రజాప్రతినిధుల అక్రమ నిర్మాణాలకు సంబంధించి డ్రోన్‌ చిత్రాలను ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేస్తున్నారు. వాటిని సైతం కూల్చాలని హైడ్రాను డిమాండ్ చేస్తున్నారు. ఇందులో అన్ని రాజకీయ పార్టీల నాయకుల నివాసాలు ఉండడం చెప్పుకోదగ్గ అంశం.

మా ఊరికీ కావాలి ఓ హైడ్రా..

నిజాయతీపరుడైన అధికారిగా పేరున్న కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో హైడ్రా చేపడుతున్న కూల్చివేతలను సహజ వనరుల రక్షణ పట్ల ఆపేక్ష ఉన్నవారిని ఆకట్టుకుంటోంది. దీంతోపాటు తమ కళ్లెదుటే ఆక్రమణలకు గురైన చెరువులు, నీటి కుంటలను చూసి సాధారణ ప్రజలూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే తమ గ్రామానికీ హైడ్రా రావాలంటూ ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు కొందరు హైదరాబాద్ త్వరలో ‘హైడ్రా’బాద్ కానుదంటూ సందర్భోచితంగా స్పందించారు.

కొసమెరుపు: కొన్ని దశాబ్దాల కిందట డిగ్రీ చదివిన యువత ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చేవారు. ఎక్కడ ఉన్నావని ఎవరైనా అడిగితే హైడ్రాబాద్ అని చెప్పేవారు. వారు అప్పుడు వ్యవహారికంలో అలా అన్నప్పటికీ ఇప్పుడదే సార్థకమయ్యేలా ఉంది.