పల్లా విద్యాసంస్థలకు బఫర్ జోన్ ఎఫెక్ట్... ఎమ్మెల్యే చెప్పేదేమిటంటే...?
ఈ నేపథ్యంలో బీఆరెస్స్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన విద్యాసంస్థల టాపిక్ ఇప్పుడు తెరపైకి వచ్చింది.
By: Tupaki Desk | 25 Aug 2024 8:37 AM GMTహైదరాబాద్ లోని చెరువులను ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఎలాంటి క్షమాపణలు ఉండవన్నట్లుగా హైడ్రా దూసుకుపోతుంది.. అక్రమ నిర్మాణాలపై విరుచుకుపడుతుంది. ఈ నేపథ్యంలో బీఆరెస్స్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన విద్యాసంస్థల టాపిక్ ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఇవి బఫర్ జోన్ లో ఉన్నాయని అంటున్నారు.
అవును... ఇప్పుడు తెలంగాణలో, ప్రధానంగా హైదరాబాద్ లో ఎక్కడ చూసినా నిబంధనలకు వ్యతిరేకంగా కట్టిన భవనాలకు సంబంధించిన చర్చ జరుగుతున్న పరిస్థితి. ఎప్పుడు హైడ్రాకి సంబంధించిన బుల్డోజర్ లు తమ ఆ అక్రమ నిర్మాణాల గోడలు బద్దలు కొట్టుకుంటూ లోపలికి దూసుకువస్తాయో అనే పరిస్థితి నెలకొందని అంటున్నారు. ఈ సమయంలో బీఆరెస్స్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన విద్యాసంస్థల భవనాల అంశం తెరపైకి వచ్చింది.
మేడ్చల్ మల్కజిగిరి జిల్లా ఘట్ కేసర్ మండలం వెంకటాపూర్ గ్రామం మరిదిలోని నాదం చెరువు బఫర్ జోన్ లో భవనాలు నిర్మించారంటూ నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందులో రెండు విద్యాసంస్థల భవనాలను అక్రమంగా నిర్మించారని గుర్తించినట్లు ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా స్పందించిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్... నీటిపారుదల చట్టం 1357 ఎఫ్ యూ/ఎస్ పార్ట్ - 8 సెక్షన్ 49.1 (ఎ), సెక్షన్ 50.1 (ఎ), చెరెఉవుల పరిరక్షణ చట్టం వాల్టాను అనుసరించి నీటి వరనులు, వాటి అనుబంధ ప్రాంతాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని నిబంధనలు చెబుతున్నాయని వివరించారు. దీంతో... పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది.
అయితే.. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న రెండు విద్యాసంస్థల భవనాలు.. బీఆరెస్స్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన గాయత్రి ఎడ్యుకేషన్ ట్రస్ట్, అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ భవనాలు అని అంటున్నారు. వీటిపై పలు ఫిర్యాదులు అందినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పందించారు. తమ ఇనిస్టిట్యూషన్స్ నిర్మాణాలకు అన్ని అనుమతులూ ఉన్నాయని తెలిపారు.
తమ సంస్థలకు సంబంధించిన నిర్మాణాలకు అన్ని రకాల అనుమతులు ఉన్నాయని.. అయితే నాదం చేరువు బఫర్ జోన్ లో నిర్మాణాలు ఉన్నట్లు ఫిర్యాదులు రావడంతో తమను కనీసం సంప్రదించకుండా పొలీసులు ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేశారని అన్నారు. గత 25 ఏళ్లలో ఏనాడూ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టలేదని చెప్పుకొచ్చారు!