Begin typing your search above and press return to search.

గూగుల్ లో సెర్చ్ చేశాడు... అనంతరం అదృశ్యమైపోయాడు!

ఈ సమయంలో చదువు విషయంలో తల్లిదండ్రులు అతడిని మందలించారు. దీంతో ఇంటి నుంచి పారిపోవాలని ఆ కుర్రాడు నిర్ణయించుకున్నాడు.

By:  Tupaki Desk   |   8 Feb 2024 7:16 AM GMT
గూగుల్  లో సెర్చ్  చేశాడు... అనంతరం అదృశ్యమైపోయాడు!
X

ఇటీవల కాలంలో చదువుకోమని, చదువుపై దృష్టి పెట్టమని పిల్లలను మందలించడం కూడా తల్లితండ్రులు చేస్తున్న తప్పుగా, నేరంగా మారిపోతున్నట్లుంది. అన్ని సౌకర్యాలు కల్పించి, ఉన్నతమైన పాఠశాలల్లో చదివిస్తున్నా... చదువుపై తప్ప మిగిలిన అన్ని విషయాలపైనా శ్రద్ధ పెట్టేవారి సంఖ్య పెరిగిపోతుందని చాలా మంది చెబుతుంటారు. ఈ సమయంలో కాస్త చదువుపై కాన్సంట్రేషన్ చెయ్యమని చెప్పినందుకు... ఇంట్లోనుంచి పారిపోయాడు ఒక యువకుడు!

అవును... ప్రస్తుతం ప్లస్ 2 కి వచ్చావు, ఈ సమయంలో చాలా శ్రద్ధగా చదువుకోవాలి, కాస్త చదువుపై దృష్టి పెట్టు, పరీక్షలు దగ్గరకొస్తున్నాయి... అని తల్లితండ్రులు చెప్పడంతో ఒక విద్యార్థి అలిగాడు. ఈ సమయంలో ఇంట్లోనుంచి తప్పించుకోవడం ఎలాగా? అనంతరం పోలీసులకు దొరకుండా ఉండటం ఎలాగా? వంటి విషయాలపై గూగుల్, యూట్యూబ్ లలో సెర్చ్ చేసి మరీ తప్పించుకుని వెళ్లిపోయిన ఒక యువకుడి వ్యవహారం తాజాగా హైదరబాద్ లోని గచ్చిబౌలిలో వెలుగులోకి వచ్చింది.

వివరాళ్లోకి వెళ్తే... జూబ్లీహిల్స్‌, కమలాపురి కాలనీకి చెందిన విద్యార్థి (17) గచ్చిబౌలిలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో ప్లస్‌ టూ చదువుతున్నాడు. ఈ సమయంలో చదువు విషయంలో తల్లిదండ్రులు అతడిని మందలించారు. దీంతో ఇంటి నుంచి పారిపోవాలని ఆ కుర్రాడు నిర్ణయించుకున్నాడు. దీనికోసం... ఎలా తప్పించుకోవాలి, పోలీసులకు దొరక్కుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి విషయాలపై ఆన్ లైన్ లో సెర్చ్ చేశాడు.

అనంతరం ఒక క్లారిటీ వచ్చిందో ఏమో కానీ... జనవరి 17న ఇంట్లో నుంచి తన సోదరుడి ఎలక్ట్రికల్ టూవీలర్ తీసుకుని అమీర్ పేట్ బిగ్ బజార్ వద్దకు వెళ్లాడు. అనంతరం తన ఫోన్ ని ఆ టూవీలర్ డిక్కీలో పెట్టి బస్సులో షిర్డీ వెళ్లిపోయాడు. తర్వాత... షిర్డీ నుంచి నాసిక్‌, నాసిక్ నుంచి ముంబయికి వెళ్లాడు. అనంతరం ఈ నెల 22న తిరిగి నగరానికి వచ్చాడని తెలుస్తుంది. అనంతరం బిగ్ బజార్ వద్దకు వచ్చి తన బైక్ తీసుకుని సికింద్రాబాద్ స్టేషన్ కి వెళ్లాడు.

ఆ టూవీలర్ స్టేషన్ లో పెట్టి రాజ్‌ కోట్‌ ఎక్స్‌ ప్రెస్‌ ఎక్కి.. మరుసటి రోజు అహ్మదాబాద్‌ లో దిగాడు. అక్కడ మరో రైలు ఎక్కి జనవరి 24న ఉదయం ఢీల్లీ దిగాడు. ఈ పరిస్థితుల్లో తమ కుమారుడి అదృశ్యంపై తల్లిదండ్రులు జూబ్లీహిల్స్‌ పోలీసుకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించారని తెలుస్తుంది. ఈ సమయంలో ఇంట్లో కంప్యూటర్, బైక్ లో దాచిన ఫోన్ ని చెక్ చేయగా... గూగుల్ లో సెర్చ్ చేసిన విషయం వెలుగుచూసిందని తెలుస్తుంది.