హైదరాబాద్ - విజయవాడ హైవే... లేటెస్ట్ అప్ డేట్!
తాజాగా మున్నేరు వాగు శాంతించడంతో ఈ హైవేపై రాకపోకలు కంటిన్యూ అయ్యాయి!
By: Tupaki Desk | 29 July 2023 7:53 AM GMTతెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు దంచికొట్టిన విషయం తెలిసిందే. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలూ తడిచి ముద్దైపోయిన పరిస్థితి. ఇందులో భాగంగా హైదరాబాద్ మొత్తం చిగురుటాకులా వణికిపోగా.. ప్రాజెక్టులు నిండు కుండల్లా దర్శనమిస్తున్నాయి. ఈ సమయంలో హైవేలపైకి సైతం వరద నీరువచ్చేసింది.
ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు వరంగల్ రైల్వేస్టేషనే చెరువును తలపించినంత పనిచేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద ప్రస్తుతం మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. పరిస్థితి ఇలా ఉన్న సమయంలో... హైదరబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై వరద నీరు చేరడంతో తీవ్ర ఇబ్బంది ఎదురైంది.
వరదల కారణంగా కృష్టా జిల్లాలోని ఐతవరం వద్ద జాతీయ రహదారిపైకి నీరు రావడంతో రాకపోకలకు ఆటంకం ఏర్పడిన సంగతి తెలిసిందే. దీంతో దాదాపు 24 - 36 గంటలపాటు రాకపోకలు నిలిచిపోయాయి! వేలాది వాహనాలు రోడ్డుపైనే నిలిచిపోయాయి. ఈ క్రమంలో టీఎస్.ఆర్టీసీ కూడా విజయవాడ-హైదరాబాద్ మధ్య రెగ్యులర్ సర్వీసులను రద్దు చేసింది.
అయితే తాజాగా హైదరాబాద్ - విజయవాడ హైవేపై వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఈ జాతీయ రహదారిపై యథావిధిగా వాహనల రాకపోకలు కొనసాగుతున్నాయి. మున్నేరు వరద తగ్గడంతో అన్ని రకాల వాహనాలను పోలీసులు అనుమతించారు.
అంతకుముందు హైవేపై వరదనీటి ప్రవాహానికి అటు ఇటూ సుమారు 2-3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దీంతో... పోలీసులు, రెవెన్యూ అధికారులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని సహాయక బృందాలు రక్షించాయి!
కాగా... హైదరాబాద్-విజయవాడ మార్గంలో నందిగామ మండలం కీసర గ్రామం వద్ద 65వ నంబర్ జాతీయ రహదారిపై వరదనీరు ప్రవహించిన సంగతి తెలిసిందే. దీన్ని దృష్టిలో ఉంచుకుని విజయవాడ నగర పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఎలాంటి ప్రమాదాలు జరక్కుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఈ మార్గాన్ని మూసివేశారు.
హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వైపు వెళ్లే వాహనదారులు.. నార్కట్ పల్లి-మిర్యాలగూడ-దాచేపల్లి-పిడుగురాళ్ల-సత్తెనపల్లి-గుంటూరు-విజయవాడ-ఏలూరు-రాజమండ్రి మీదుగా వెళ్లాలని సూచించారు. సమాచారం కోసం విజయవాడ నగర పోలీస్ కంట్రోల్ రూమ్ 7328909090 నంబర్ కు సంప్రదించాలని సూచించారు. ఈ నేపథ్యంలో... తాజాగా మున్నేరు వాగు శాంతించడంతో ఈ హైవేపై రాకపోకలు కంటిన్యూ అయ్యాయి!