Begin typing your search above and press return to search.

ఆ వివాదాస్పద ఐఏఎస్‌ అధికారికి జైలుశిక్ష!

జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీఎం కార్యాలయంలో కీలక పాత్ర పోషించిన ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఆ తర్వాత ఢిల్లీలోని ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ గానూ వ్యవహరించారు.

By:  Tupaki Desk   |   3 Oct 2024 8:08 AM GMT
ఆ వివాదాస్పద ఐఏఎస్‌ అధికారికి జైలుశిక్ష!
X

ఆం్రధప్రదేశ్‌ లో వైసీపీ ప్రభుత్వ హయాంలో కీలక పాత్ర పోషించిన అధికారుల్లో ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఒకరు. 2019లో వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రాగానే ఈయన ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక పాత్ర పోషించారు. నాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎల్వీ ప్రసాద్‌ ను బదిలీ చేస్తూ ఆయన కంటే ఎంతో జూనియర్‌ అయిన ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఉత్తర్వులు జారీ చేయడం తీవ్ర వివాదాస్పదమైంది.

జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీఎం కార్యాలయంలో కీలక పాత్ర పోషించిన ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఆ తర్వాత ఢిల్లీలోని ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ గానూ వ్యవహరించారు. అక్కడి నుంచి మళ్లీ ఆంధ్రప్రదేశ్‌ కు తిరిగొచ్చి ఏపీ పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు.

ఈ క్రమంలో పాఠశాల విద్యా శాఖలో ప్రవీణ్‌ ప్రకాశ్‌ తీసుకున్న నిర్ణయాలు, చర్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. క్షేత్ర స్థాయి పర్యటనల పేరుతో ఆయా ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లిన ఆయన జెడ్పీ స్కూళ్లు ప్రధానోపాధ్యాయులు, ప్రభుత్వ స్కూళ్ల టీచర్లపై మండిపడిన సందర్భాలున్నాయని అంటున్నారు.

చివరకు జిల్లా కలెక్టర్లకు కూడా ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఆదేశాలు జారీ చేసేవారని.. వారిపైనా అజమాయిషీ చెలాయించాలని చూసేవారనే ఆరోపణలున్నాయి.

ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రవీణ్‌ ప్రకాశ్‌ ను పక్కనపెట్టింది. ఆయనకు ఏ పదవీ అప్పగించలేదు. దీంతో ఆయన స్వచ్చంధ పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ప్రభుత్వం ఆయన వీఆర్‌ఎస్‌ ను ఆమోదించింది.

కాగా వైసీపీ ప్రభుత్వ హయాంలో కోర్టు ధిక్కరణ కేసుకు సంబంధించి నాటి పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ కు, అప్పటి ఇంటర్మీడియెట్‌ బోర్డు కార్యదర్శి శేషగిరి బాబుకు హైకోర్టు తాజాగా జైలుశిక్షతోపాటు జరిమానా విధించింది. తామిచ్చిన ఉత్తర్వులు అమలు చేయకపోవడం పట్ల కోర్టు వారిద్దరిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

కోర్టు ఉత్తర్వులు.. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని భావిస్తే వాటిపై అప్పీల్‌ చేసే వెసులుబాటు వారికి ఉందని హైకోర్టు తెలిపింది. అయితే తామిచ్చిన ఉత్తర్వులకు వక్రభాష్యం చెబుతూ వాటిని అమలు చేయకుండా ఉండడానికి వీల్లేదని వెల్లడించింది. ప్రస్తుత కేసులో కోర్టు ఉత్తర్వులు అమలు చేయని పాఠశాల విద్యాశాఖ అప్పటి ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్, ఇంటర్మీడియెట్‌ బోర్డు అప్పటి కార్యదర్శి శేషగిరిబాబుకు నెలరోజుల సాధారణ జైలుశిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధించింది.

అయితే, అప్పీల్‌ చేసుకునేందుకు వీలుగా సమయం ఇవ్వాలని ప్రవీణ్‌ ప్రకాశ్, శేషగిరిబాబు విన్నవించడంతో తీర్పు అమలును నాలుగు వారాల పాటు హైకోర్టు నిలిపివేసింది. తాము ఇచ్చిన ఉత్తర్వులపై అప్పీల్‌ కోర్టు ఎలాంటి స్టే ఇవ్వకపోతే ఈ నెల 21న హైకోర్టు రిజిస్ట్రార్‌ జ్యుడీషియల్‌ ముందు లొంగిపోవాలని వారిద్దరినీ కోర్టు ఆదేశించింది.

ఇంతకూ ప్రవీణ్‌ ప్రకాశ్, శేషగిరిబాబుపై ఉన్న వివాదం ఏమిటంటే.. ఇంటర్మీడియెట్‌ బోర్డులో అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌గా విజయలక్ష్మి పనిచేసేవారు. ఈ క్రమంలో ఆమె 2022 ఆగస్టు 31 రిటైర్‌ అయయ్యారు. అదే ఏడాది జనవరి 31న పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ఆర్థిక శాఖ జీవో 15ను జారీ చేసింది. ఈ జీవో ఆధారంగా తనను 62 ఏళ్లు వచ్చేవరకు ఉద్యోగంలో కొనసాగించాలని విజయలక్ష్మి ఇంటర్మీడియెట్‌ బోర్డు కార్యదర్శికి విజ్ఞప్తి చేశారు.

అయితే ఉన్నతాధికారులు తనకు అనుకూలంగా స్పందించకపోవడంతో విజయలక్ష్మి 2023లో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి.. విజయలక్ష్మికి 62 ఏళ్లు వచ్చేవరకు సర్వీసులో కొనసాగించాలని ఆదేశిస్తూ.. 2023 ఫిబ్రవరిలో ఉత్తర్వులు ఇచ్చారు. అయినా కోర్టు ఆదేశాలను అధికారులు అమలు చేయలేదు. దీంతో విజయలక్ష్మి కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. అప్పటి పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, ఇంటర్మీడియెట్‌ బోర్డు కార్యదర్శి శేషగిరిబాబును ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి.. కోర్టు ఉత్తర్వులను అమలు చేయనందుకు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రవీణ్‌ ప్రకాశ్, శేషగిరిబాబుకు జైలుశిక్ష, జరిమానా విధించారు.