ఐఏఎస్ అమ్రపాలి ఇంట్లోనే చెత్త ఎత్తట్లేదట
తనకు నచ్చినట్లుగా ఉండేందుకుఏ మాత్రం వెనుకాడని ఆమె.. ఎవరో ఏదో అంటారని తన తీరును మార్చుకోవాలని అస్సలు అనుకోరు.
By: Tupaki Desk | 9 Aug 2024 4:42 AM GMTఏ మాటకు ఆ మాట చెప్పాలి.. ఐఏఎస్ అధికారిణి అమ్రపాలి నీతికి.. నిజాయితీకి నిలువెత్తు రూపం. ఆమె తీరును పలువురు తప్పు పట్టొచ్చు. కానీ.. ఉన్నది ఉన్నట్లుగా చెప్పేందుకు ఏ మాత్రం వెనుకాడని ఆమె మాటల్ని అర్థం చేసుకోవటం కాస్త కష్టమే. తనకు నచ్చినట్లుగా ఉండేందుకుఏ మాత్రం వెనుకాడని ఆమె.. ఎవరో ఏదో అంటారని తన తీరును మార్చుకోవాలని అస్సలు అనుకోరు. అలా అనుకోవటం తప్పే అవుతుంది.
ప్రజల మధ్య నిత్యం తిరుగుతూ ఉండే ఆమె గురించి తప్పుగా ఎవరూ మాట్లాడరు. కారణం.. తన తోటి సిబ్బంది విషయంలో అమితమైన శ్రద్ధను చూపుతుందని చెబుతారు. ముక్కుసూటితనం.. కమిట్ మెంట్ తో పని చేయటం లాంటి ఆమెను గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ గా నియమించటం తెలిసిందే. హైదరాబాద్ లో నివసించే వారంతా కూడా.. ఏదో ఒక సందర్భంలో చెత్త ఎత్తుకెళ్లే వారి మీద ఫిర్యాదులు చేస్తుంటారు. తమ ఇంట్లోను చెత్తను సరిగా తీసుకెళ్లట్లేదన్న విషయాన్ని తరచూ ప్రస్తావిస్తుంటారు.
తాజాగా ఒక రివ్యూ సమావేశంలో మాట్లాడుతూ.. అమ్రపాలి ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. ఐఏఎస్ అధికారి.. జీహెచ్ఎంసీకి బాస్ అయినప్పటికి అప్పుడప్పుడు తన ఇంట్లోని చెత్తను కూడా తీసుకెళ్లరని పేర్కొన్నారు. ఇలాంటి వాటిని స్ట్రీమ్ లైన్ చేసేందుకు తగిన చర్యలు తప్పవని పేర్కొన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో నిర్వహిస్తున్న జీపీఐఎస్ సర్వే మీద అనుమానాలు.. సందేహాలు అక్కర్లేదని ఆమె స్పష్టం చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఆమె మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ప్రతి వీధి.. కాలనీలకు సంబంధించిన సమాచారాన్ని డిజిటలైజ్ చేయటం ద్వారా.. సమాచారం మరింత పక్కాగా ఉంటుందని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ సేకరించే సమాచారం వేరే వారికి ఇచ్చేది లేదన్నారు. తాను కుందన్ బాగ్ లోని ఐఏఎస్ క్వార్టర్స్ లో ఉంటానని.. ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తే.. డెలివరీ వాళ్లు తమ ఇంటిని గుర్తించటం లేదన్న ఆమె.. ‘‘ఆయా సంస్థలు ఉపయోగించే డిజిటల్ మ్యాపుల్లో కచ్ఛితత్వం లేకపోవటమే కారణం. ఇలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి మూడు సెంటీమీటర్ల స్థలాన్ని ఒక పిక్సెల్ గా రికార్డు చేసేలా డ్రోన్ టెక్నాలజీని వాడుతున్నాం’’ అని పేర్కొన్నారు. ఇలా చేయటం ద్వారా.. తేలికగా ఏదైనా ప్రాంతాన్ని గుర్తించటం వీలవుతుందన్నారు.