డిప్యూటేషన్ మీద వచ్చిన ఐఏఎస్ అధికారిణి అపర్ణ పై బాబు ఏమన్నారు?
యూపీ కేడర్ కు చెందిన ఐఏఎస్ అధికారిణి అపర్ణ.. డిప్యూటేషన్ మీద ఏపీకి వచ్చారు. ఇక్కడ ఆరోపణ ఏమంటే.. అపర్ణ భర్త డిజైన్ టెక్ కంపెనీలో పని చేస్తున్నారు.
By: Tupaki Desk | 25 Sep 2023 4:27 AM GMTస్కిల్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ విపక్షనేత చంద్రబాబును కస్టడీలోకి తీసుకున్న సీఐడీ అధికారులు రెండు రోజుల పాటు విచారణ జరిపిన సంగతి తెలిసిందే. విచారణ సందర్భంగా అధికారులు అడిగిన ప్రశ్నలు.. దానికి చంద్రబాబు ఇచ్చిన సమాధానాల వివరాలు కొన్ని మీడియా సంస్థల్లో ప్రచురితమయ్యాయి. విచారణ విషయంలో చంద్రబాబు సమాధానాలు స్పష్టంగా సూటిగా ఇచ్చినట్లుగా కొన్ని మీడియా సంస్థలు వివరాలతో సహా వెల్లడిస్తే.. మరికొన్ని మీడియా సంస్థలు మాత్రం అందుకు భిన్నమైన కథనాల్ని అందించాయి.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. చంద్రబాబు హయాంలో జరిగిన ఒక ఐఏఎస్ అధికారి అపర్ణ డిప్యుటేషన్ వ్యవహారం తాజా స్కిల్ స్కాం విచారణ సందర్భంగా ప్రస్తావనకు వచ్చింది. దీనిపై చంద్రబాబు వివరణ సుదీర్ఘంగా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. యూపీ కేడర్ కు చెందిన ఐఏఎస్ అధికారిణి అపర్ణ.. డిప్యూటేషన్ మీద ఏపీకి వచ్చారు. ఇక్కడ ఆరోపణ ఏమంటే.. అపర్ణ భర్త డిజైన్ టెక్ కంపెనీలో పని చేస్తున్నారు. ఈ విషయం మీదకు తెలుసా? అంటూ సీఐడీ అధికారులు చంద్రబాబుకు ప్రశ్నల వర్షం కురిపించారు.
దీనికి చంద్రబాబు కాసింత ఘాటుగా రియాక్టు అయినట్లుగా తెలుస్తోంది. "ప్రతి ఏడాది చాలామంది అధికారులు డిప్యూటేషన్ మీద వస్తుంటారు. వారంతా ఎవరికి ఎవరు బంధువులో.. ఎవరికి సన్నిహితులో ముఖ్యమంత్రికి ఎలా తెలుస్తుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆమె అప్లికేషన్ పెట్టుకుంటే.. సీఎస్ రూల్ ప్రకారం ఆమె వినతిని అంగీకరించారు.
కేంద్రం సైతం ఆమె డిప్యుటేషన్ ను ఓకే చేశారు. ఇదంతా అధికారుల స్థాయిలో జరిగిన నిర్ణయం. ఏపీలో ఆమె రిపోర్టు చేసిన తర్వాత స్కిల్ కార్పొరేషన్ కు ఆమె తగిన వ్యక్తి అని అధికారులు సిఫార్సు చేశారు. అందుకు నేను ఓకే చెప్పాను" అని వివరణ ఇచ్చినట్లుగా చెబుతున్నారు.
ఆమె భర్త డిజైన్ టెక్ లో పని చేస్తున్న విషయం ఆమె అధికారులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని.. ఏ అధికారీ తనకు ఆ విషయాన్ని తన వరకు తీసుకురాలేదని చెప్పారు. ఇది రోటీన్ గా జరిగిన నియామకమే అనుకొని తాను ఓకే చేశానే తప్పించి మరింకేమీ కాదని చంద్రబాబు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఐఏఎస్ అధికారి అపర్ణ డిప్యుటేషన్ ఎపిసోడ్ మొత్తం నిబంధనలకు అనుగుణంగానే జరిగినట్లుగా బాబు వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది.