మళ్లీ ఇరుక్కున్న వివాదాస్పద మహిళా ఐఏఎస్ అధికారి!
ఈ నేపథ్యంలో ఇటీవల భారీ ఎత్తున జరిగిన ఐఏఎస్ అధికారుల బదిలీల్లో శ్రీలక్ష్మికి ఎక్కడా చంద్రబాబు ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వలేదు. ఆమెను జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశాలు ఇచ్చింది.
By: Tupaki Desk | 1 Aug 2024 8:13 AM GMTఏపీ ఐఏఎస్ అధికారి వై. శ్రీలక్ష్మి గురించి తెలియనివారెవరూ లేరంటే అతిశయోక్తి కాదు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గనుల శాఖ కార్యదర్శి హోదాలో ఓబుళాపురంలో అక్రమ మైనింగ్ కు అనుమతులు ఇచ్చారని ఆమె అభియోగాలు ఎదుర్కొన్నారు. ఆ కేసులో కొన్నాళ్లు జైలుపాలు కూడా అయ్యారు.
అయితే 2019లో జగన్ ప్రభుత్వం వచ్చాక శ్రీలక్ష్మి దశ తిరిగింది. ఆమెకు ఏకంగా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా హోదా కల్పించారు. కీలకమైన పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలకు శ్రీలక్ష్మి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా వ్యవహరించారు. ఈ క్రమంలో అమరావతి రాజధాని విషయంలో పలు వివాదాస్పద నిర్ణయాలను తీసుకున్నారనే విమర్శలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలోనే ఇటీవల చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక శ్రీలక్ష్మి కలవడానికి వెళ్తే.. ఆమెతో మాట్లాడటానికి చంద్రబాబు ఇష్టపడలేదనే వార్తలు వచ్చాయి. కనీసం ఆమె ఇచ్చిన పూల బొకేను కూడా తీసుకోలేదని టాక్ నడిచింది. ఈ నేపథ్యంలో ఇటీవల భారీ ఎత్తున జరిగిన ఐఏఎస్ అధికారుల బదిలీల్లో శ్రీలక్ష్మికి ఎక్కడా చంద్రబాబు ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వలేదు. ఆమెను జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశాలు ఇచ్చింది.
కాగా ఇప్పుడు శ్రీలక్ష్మి మరో వివాదంలో కూరుకుపోయారు. కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో ఆమె తన తండ్రి యర్రా నాగేశ్వరరావు పేరుతో పార్కు నిర్మించారని వెల్లడైంది. తన తండ్రి పేరుతో పార్కు నిర్మించడంతో ఏ ఇబ్బంది లేకపోయినా ఇందుకోసం ప్రజాధనాన్ని వెచ్చించారనే విషయం బయటపడింది. దీంతో శ్రీలక్ష్మి వివాదంలో కూరుకుపోయారు.
ఈ ఏడాది జనవరి 24న మచిలీపట్నంలో తన తండ్రి పేరుతో శ్రీలక్ష్మి పార్కును ప్రారంభించారు. ఈ పార్కుకు మచిలీపట్నం నగరపాలక సంస్థ రూ.18 లక్షలు ఖర్చు చేయగా ఏపీ గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ విభాగం ఏకంగా రూ.2 కోట్లు వెచ్చించినట్లు సమాచారం. ఇలా మొత్తం మీద తన తండ్రి పేరుతో ఏర్పాటు చేసిన పార్కుకు శ్రీలక్ష్మి ఏకంగా రూ.2.18 కోట్ల ప్రజా«ధనాన్ని వెచ్చించారనే విమర్శలు రేగుతున్నాయి.
కాగా శ్రీలక్ష్మి తండ్రి ఒక సాధారణ రైల్వే ఉద్యోగి అని తెలుస్తోంది. రైల్వేలో ఇంజనీర్ గా పనిచేసి పదవీ విరమణ చేశారు. ప్రజాధనంతో ఏర్పాటు చేసిన పార్కులకు జాతీయ నాయకులు, స్వాతంత్య్ర సమరయోధుల పేర్లు, వివిధ రంగాల్లో లబ్ధిప్రతిష్టులైనవారి పేర్లు పెడుతుంటారు. అలాంటిది ప్రజాధనంతో రూ.2.18 కోట్లు పెట్టి ఏర్పాటు చేసిన పార్కుకు శ్రీలక్ష్మి తన తండ్రి పేరును పెట్టుకోవడం వివాదాస్పదమవుతోంది. అంతేకాకుండా పార్కులో తన తండ్రి విగ్రహాన్ని కూడా ఆమె ప్రతిష్టించడం హాట్ టాపిక్ గా మారింది. ఈ వ్యవహారంలో కూటమి ప్రభుత్వం ఆమెపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.