Begin typing your search above and press return to search.

స్టేడియంలో ఐఏఎస్ జంట వాకింగ్.. ఉద్యోగం పోయింది

దీంతో.. వారి కారణంగా స్టేడియం సిబ్బంది క్రీడాకారుల్ని.. ట్రైనర్లను బయటకు పంపేసి ఖాళీ చేసేవారు

By:  Tupaki Desk   |   28 Sep 2023 5:04 AM GMT
స్టేడియంలో ఐఏఎస్ జంట వాకింగ్.. ఉద్యోగం పోయింది
X

‘అతి’ ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. ఈ విషయాన్ని చాలామంది పట్టించుకోరు. చేతిలో ఉన్న అధికారాన్ని చూసుకొని అహంకారంగా వ్యవహరించే తీరు కొందరిలో కనిపిస్తుంటుంది. ఇలాంటి వారి టైం బాగున్నంత కాలం వారి హవా బాగానే నడిచినా.. ఏదో ఒక రోజు లెక్క తేడా రావటం.. అందుకు వడ్డీతో సహా మూల్యం చెల్లించుకునే పరిస్థితి ఉంటుంది. ఆ మధ్యన స్టేడియంలో తమ పెంపుడు కుక్కను తీసుకొని వాకింగ్ కు వెళ్లే ఐఏఎస్ జంట వ్యవహరించే అతికి తాజాగా మరో భారీ షాక్ తగిలింది.

ఏడాది క్రితం లొల్లిగా మారిన ఈ ఉదంతానికి సంబంధించి ఐఏఎస్ జంటలోని మహిళా ఐఏఎస్ అధికారిణి రింకూ దుగ్గాను బలవంతంగా ఉద్యోగం నుంచి సాగనంపిన వైనం చోటుచేసుకుంది. ఆమెను జాబ్ కు రిజైన్ చేయాలని అధికారులు కోరటంతో.. ఆమెకు జాబ్ కు రిజైన్ చేయక తప్పలేదు. స్టేడియంలో వాకింగ్ చేయటంతోనే ఇంత పెద్ద కష్టమనుకుంటే తప్పులో కాలేసినట్లే. వాకింగ్ పేరుతో వారు చేసిన అతి.. వారు ప్రదర్శించిన అధికార దర్పం.. చాలామందికి షాకిచ్చేలా మారుతుందని చెప్పక తప్పదు.

ఢిల్లీలోని త్యాగరాజ్ స్టేడియం సాయంత్రం వేళలో క్రీడాకారులు.. ట్రైనర్లతో బిజీగా ఉంటుంది. అయితే.. ఢిల్లీలో పని చేసే ఐఏఎస్ జంట తమ పెంపుడు కుక్కతో వాకింగ్ కోసం స్టేడియంను వాడుతుంటారు. తమకున్న అధికారాన్ని .. దర్పాన్ని సొంత ప్రయోజనాల కోసం ఇష్టారాజ్యంగా వాడేయటం మొదలు పెట్టారు. తమ కుక్కతో తాము వాకింగ్ చేసే వేళలో.. స్టేడియంలో ఎవరూ ఉండొద్దన్న ఫర్మానా జారీ చేశారు.

దీంతో.. వారి కారణంగా స్టేడియం సిబ్బంది క్రీడాకారుల్ని.. ట్రైనర్లను బయటకు పంపేసి ఖాళీ చేసేవారు. నిర్మానుష్యంగా మారిన స్టేడియంలో పెంపుడు కుక్కను తీసుకొని తాపీగా నడుస్తూ వాకింగ్ చేసేవారు. వీరి వాకింగ్ ఏమో కానీ.. క్రీడాకారుల ప్రాక్టీస్ కు పెద్ద ఆటంకంగా ఉండేది. వీరి అతి చేష్టల గురించి మీడియాలో రావటంతో.. వారి తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. స్పందించిన ఉన్నతాధికారులు వారిపై చర్యలు చేపట్టి.. భార్యభర్తలు ఇద్దరిని వేర్వేరు ప్రాంతాలకు బదిలీ చేశారు. అక్కడితో తక్షణ శిక్ష వేసిన అధికారులు ఏడాది అనంతరం.. వారిపై జరిపిన అంతర్గత విచారణతో వారిపై మరిన్ని చర్యలకు ఉపక్రమించారు.

ఐఏఎస్ జంటలో 1994 బ్యాచ్ అధికారిణి రింకూ దుగ్గాను పదవీ విరమణ చేయాలంటూ ఉన్నతాధికారులు ఆమెను ఆదేశించినట్లుగా చెబుతున్నారు. ప్రభుత్వ అధికారుల ప్రాథమిక నిబంధనలు.. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ పెన్షన్ నిబంధనల కింద ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రజా ప్రయోజనాల్ని పరిగణలోకి తీసుకొని ఏ ఉద్యోగినైనా ప్రభుత్వం ముందస్తు పదవీ విరమణ చేయించే హక్కు ఉంటుంది. ప్రస్తుతం రింకూ అరుణాచల్ ప్రదేశ్ లోని సంచార జాతుల వ్యవహారాల విభాగం ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్నారు. తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఆమె జాబ్ కు రిజైన్ చేయాల్సి ఉంటుంది. ఇక.. ఆమె భర్త సంజీవ్ ప్రస్తుతం లద్దాఖ్ లో విధులు నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని స్టేడియంలో కుక్కతో వాకింగ్ అతి వారి జీవితాల్ని ఎంతలా మార్చిందో. అధికారం చేతిలో ఉన్నప్పుడు అవసరమైన వారికి సాయంగా ఉండేందుకు వినియోగించాలే తప్పించి.. అనవసరంగా వ్యక్తిగత అవసరాలకు వాడితే ఇలానే ఉంటుంది.