Begin typing your search above and press return to search.

పదిహేనేళ్ళలో జైషా మెరుపు షాట్లు... కట్ చేస్తే ఐసీసీ పీఠం !

ఆయన దేశంలో అత్యంత బలమైన రాజకీయ నేత, కేంద్రంలో నంబర్ టూ అయిన హోంమంత్రి అమిత్ షా తనయుడు.

By:  Tupaki Desk   |   30 Aug 2024 2:30 AM GMT
పదిహేనేళ్ళలో జైషా మెరుపు షాట్లు... కట్ చేస్తే ఐసీసీ పీఠం !
X

ఆయన దేశంలో అత్యంత బలమైన రాజకీయ నేత, కేంద్రంలో నంబర్ టూ అయిన హోంమంత్రి అమిత్ షా తనయుడు. పేరు జైషా. వయసు ముప్పయి అయిదు. క్రికెటర్ అవుదామనుకున్న కలలు కన్న ఒకనాటి కుర్రాడు ఇపుడు అంతర్జాతీయ క్రికెట్ సంఘం ఐసీసీకి అధ్యక్షుడు అయ్యాడు. ఇదంతా జస్ట్ పదిహేనేళ్లలో సాగిపోయింది. పేరులోనే జయం ఉంది. అంతే ఆయనకు అన్నీ విజయాలే మరి.

జైషా ప్రస్థానం ఒక్కసారి గమనిస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆయన 2009లో గుజరాత్ క్రికెట్ సంఘం పాలకవర్గంలో ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా ఫస్ట్ టైం ఎంపిక అయ్యారు. ఆ సమయంలో గుజరాత్ లోని మోడీ ముఖ్యమంత్రిత్వం లో జైషా తండ్రి అమిత్ షా మంత్రిగా ఉన్నారు. అలా రాజకీయ అండ కూడా దక్కింది అనుకోవాలి.

అక్కడ నుంచి అమిత్ షా రాజకీయంగా ఎదుగుతూంటే జైషా కూడా అంతకు మిన్నగా క్రికెట్ ప్రపంచంలో ఎదుగుతూ వచ్చారు. ఆయన 2013లో గుజరాత్ క్రికెట్ సంఘం జాయింట్ సెక్రటరీ అయ్యారు. 2015 నాటికి అంటే కేంద్రంలో మోడీ అమిత్ షాల హవా ఉధృతంగా సాగుతున్న నేపథ్యంలో భారతీయ క్రికెట్ బోర్డు బీసీసీఐ లో మెంబర్ గా జైషా ఎంట్రీ ఇచ్చారు.

అంతే ఆ తరువాత వెనక్కి తిరిగి చూడలేదు. 2019లో బీసీసీఐ సెక్రటరీగా జై షా ఎన్నిక అయ్యారు. 2021లో ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ గా జైషా ఎన్నిక అవడంతో ఆయన ప్రభావం ఖండాంతరాలకు పాకింది. ఇక బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరభ్ గంగూలీ పదవీకాలం ముగిసిన తరువాత రోజర్ బిన్నీ నెగ్గినా ఆయన కంటే ఎక్కువగా జైషావే బీసీసీఐ ని అన్నింటా తానై నడిపించారు అనిపించుకున్నారు. అలా బీసీసీఐ మీద ఆయన పట్టు సాధించారు.

ఇలా క్రికెటర్ అవుదామనుకున్న జైషా ఇపుడు ఇంటర్నేషనల్ క్రికెట్ జట్లను శాసించే స్థాయికి ఎదగడం వెనక కచ్చితంగా అమిత్ షా రాజకీయ ప్రభావం ఉంది అనే అంటారు. దేశంలో క్రికెట్ రాజకీయాలు కలసిపోయి చాలా కాలం అయింది. బీసీసీఐ ప్రెసిడెంట్లుగా రాజకీయ నేతలు చాలా మంది పనిచేసి తమ సత్తా చాటారు. ఆ మీదట రాజకీయాల్లోనూ రాణించారు.

ఇక చూస్తే బీసీసీఐ అత్యంత పవర్ ఫుల్ సంస్థ. ఆర్ధికంగా కూడా వేల కోట్ల రూపాయలు ఉన్న సంస్థ. ఉద్ధండులు పనిచేసిన సంస్థ. కాంగ్రెస్ హయాంలో సురేష్ కల్మాడీ అనే మహారాష్ట్ర ఎంపీ ఒంటి చేత్తో ఈ బోర్డుని శాసించారు. ఆ తరువాత మరాఠా యోధుడు శరద్ పవార్ కూడా ఈ బోర్డుని ఏలారు. ఎన్ కేపీ సాల్వే, జగన్ మోహన్ దాల్మియా, అరుణ్ జైట్లీ వంటి ప్రముఖులు ఐసీసీకి నేతృత్వం వహించారు.

ఈ క్రమంలో జైషా ప్రస్థానాన్ని చూస్తే ఆయన అమిత్ షాతో పోటీగా ఒక్కో మెట్టూ ఎదుగుతూ దశాబ్దన్నర కాలంలోనే ఇసీసీకి చీఫ్ అయ్యారు అంటే అమిత్ షా తనయుడు అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. తండ్రి రాజకీయాల్లో తనయుడు క్రికెట్ రంగం ఏమిటి అనుకోవచ్చు.

అమిత్ షా ఇంకా రాజకీయంగా చాలా ఏళ్లు కొనసాగే సత్తా ఉన్న నేత. దాంతో జైషా ముందు క్రికెట్ బ్యాట్ పట్టారు, ఆ తరువాత ఆయన కూడా రాజకీయ బాట పడతారు అని ప్రచారం అయితే ఉంది. గుజరాత్ లో అమిత్ షాకు ఎదురు లేదు, అక్కడ నుంచే జైషా కూడా తన పొలిటికల్ ఇన్నింగ్స్ ప్రారంభించవచ్చేమో.

ప్రస్తుతానికి అయితే గుజరాత్ లో తమ కుటుంబానికి చెందిన పైపుల వ్యాపారం చేసుకుంటూ మరో వైపు క్రికెట్ రంగంలో జై షా రాణిస్తున్నారు. మోడీ తరువాత అమిత్ షా అన్న పేరు బీజేపీలో ఉంది. మోడీకి వారసుడు అమిత్ షా అయితే అమిత్ షా వారసుడు కూడా జైషా రూపంలో రెడీగా ఉన్నారు అన్న మాట. మొత్తానికి చూస్తే క్రికెట్ బ్యాట్ కూడా సరిగ్గా పట్టుకోవడం రాని జైషా ఇంతలా ఎదగడం అంటే రాజకీయ ప్రభావమే అన్నది విమర్శగా ఉందిట. ఐసీసీ పీఠానికే గురి పెడుతూ కొట్టిన జైషా మెరుపు షాట్లు చూస్తే ఆయనకు క్రికెట్ రాదని అనగలరా అన్న సెటైర్లు కూడా పడుతున్నాయట. సో దటీజ్ జై షా. అంతే.