IND vs NZ భారీ క్రికెట్ బెట్టింగ్ : రూ.5,000 కోట్లకు పైగా దందా!
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్‌పై క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారత్-న్యూజిలాండ్ జట్లు నేడు దుబాయ్ వేదికగా తలపడనున్నాయి.
By: Tupaki Desk | 9 March 2025 11:02 AM ISTప్రపంచంలోనే క్రికెట్ ఆరాధించే దేశం మనది.. క్రికెట్ ను ప్రాణంగా ప్రేమిస్తారు.. విరాట్ కోహ్లీ లాంటి ఆటగాళ్లు ఆడుతుంటే స్టేడియాలు కూడా నిండిపోతాయి. అంతటి ప్రజాదరణ ఉన్న క్రికెట్ లో నేడు భారత్ ఫైనల్ కు చేరుకోవడంతో దేశమంతా ఒకటే ఊపు నెలకొంది. క్రికెట్ ఫీవర్ నెలకొంది. ఎక్కడ చూసినా టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ పై గెలవాలని కోరుకుంటున్నారు. ఇంతటి హైప్ ఉన్న మ్యాచ్ పైన బెట్టింగులు జరగకుండా ఉంటాయా? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ ఫైనల్ మ్యాచ్ పై ఓ రేంజ్ లో బెట్టింగులు జరుగుతున్నాయి.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్‌పై క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారత్-న్యూజిలాండ్ జట్లు నేడు దుబాయ్ వేదికగా తలపడనున్నాయి. అయితే ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌పై దేశవ్యాప్తంగా భారీగా బెట్టింగ్‌లు జరుగుతున్నట్లు నిఘా సంస్థలు గుర్తించాయి. మొత్తం లావాదేవీల విలువ సుమారు రూ. 5 వేల కోట్లకు పైగా ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు.
-క్రికెట్ బెట్టింగ్ ముఠాలపై పోలీసుల కఠిన నజర్
ఇటీవల భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ సమయంలో, బెట్టింగ్‌లో పాల్గొన్న కొందరిని ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ దాడుల్లో ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓ ప్రత్యేక వెబ్‌సైట్ ద్వారా ‘మాస్టర్ ఐడీ’ సహాయంతో పెద్ద ఎత్తున బెట్టింగ్‌లను నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ప్రతి లావాదేవీపై 3% కమిషన్ వసూలు చేస్తున్నట్లు తెలిసింది. పోలీసుల అనుసంధానంలో బెట్టింగ్ ముఠాలు కొన్ని ప్రైవేట్ ఇళ్లను రూ. 35 వేల అద్దెకు తీసుకుని బెట్టింగ్ కేంద్రాలుగా మార్చినట్లు బయటపడింది. అలాగే, ఫోన్ల ద్వారా ఆఫ్‌లైన్‌లో కూడా పందేలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
-‘డి-కంపెనీ’ ముఠా కదలికలు.. దావుద్ ఇబ్రహీం నడుపుతున్నారా?
ఈ బెట్టింగ్ ముఠాలకు ముంబయి పేలుళ్ల సూత్రధారి దావుద్ ఇబ్రహీం నేతృత్వంలోని ‘డి-కంపెనీ’తో సంబంధాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దుబాయ్ కేంద్రంగా ఈ గ్యాంగ్ క్రికెట్ బెట్టింగ్‌ను నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఢిల్లీలో అరెస్టయిన బుకీల దగ్గర నుంచి రూ. 22 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు, కెనడాలో ఓ బెట్టింగ్ యాప్‌ను అభివృద్ధి చేసిన ఛోటా బన్సల్ అనే వ్యక్తి ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
- స్టేడియం నుంచి నేరుగా సమాచారం లీక్!
ఈ బెట్టింగ్ ముఠాలకు సంబంధించి మనీశ్ సాహానీ అనే వ్యక్తి ప్రధాన సూత్రధారిగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఢిల్లీలోని ఓ వ్యక్తి స్టేడియంలో మ్యాచ్‌లో జరుగుతున్న అప్‌డేట్‌లను బుకీలకు వెంటనే చేరవేస్తున్నాడు. ఈ సమాచారం ఆధారంగా బెట్టింగ్ రేట్లు మారిపోతున్నాయి.
క్రికెట్ అభిమానులను ఆకర్షించే ఇలాంటి పెద్ద మ్యాచ్‌లు బెట్టింగ్ ముఠాలకు ఆర్థిక వనరులుగా మారుతున్నాయి. పోలీసులు ఈ ముఠాలపై నిఘా మరింత కట్టుదిట్టం చేసినట్లు తెలుస్తోంది.