టెక్నికల్ తప్పు జరిగింది.. నష్టపోతే పరిహారమన్న ఐసీఐసీఐ
తప్పు జరిగినప్పుడు ఓపెన్ గా ఒప్పుకునే ధైర్యం చాలామందికి.. చాలా సంస్థలకు ఉండదు.
By: Tupaki Desk | 27 April 2024 6:26 AM GMTతప్పు జరిగినప్పుడు ఓపెన్ గా ఒప్పుకునే ధైర్యం చాలామందికి.. చాలా సంస్థలకు ఉండదు. అందుకు భిన్నంగా బ్యాకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ మాత్రం అందుకు భిన్నంగా స్పందించింది. ఐసీఐసీఐ బ్యాంక్ కు చెందిన దాదాపు 17వేల క్రెడిట్ కార్డుల సమాచారం ఇతర ఖాతాకు పొరపాటున లింక్ అయిన అంశంపై స్పందించింది. ఈ సందర్భంగా సాంకేతికంగా తప్పు జరిగిందని తన తప్పును ఒప్పుకొని లెంపేసుకుంది. అంతేకాదు.. తమ తప్పు కారణంగా నష్టపోయిన వారికి డబ్బులు తిరిగి చెల్లిస్తామని స్పష్టం చేసింది.
తమ క్రెడిట్ కార్డుల సమాచారం పొరపాటుగా డిజిటల్ మాధ్యమాల్లో ఇతర ఖాతాలకు లింకు అయినట్లుగా గుర్తించింది. ఆ తప్పును వెంటనే సవరించింది.అయితే.. ఈ తప్పు కారణంగా ఎవరైనా నష్టపోయి ఉంటే వారికి పరిహారాన్ని చెల్లిస్తామని స్పష్టం చేసింది. అయితే.. ఇప్పటివరకు డేటా దుర్వినియోగం జరిగినట్లుగా తమకు ఎలాంటి సమాచారం అందలేదని స్పష్టం చేసింది.
ఇంతకూ జరిగిన తప్పేంటి? అన్న అంశంలోకి వెళితే.. కొత్త క్రెడిట్ కార్డు వివరాలు.. క్రెడిట్ కార్డు అప్లై చేయని వారికి సైతం డిస్ ప్లే అయ్యాయి. దీంతో.. ఆన్ లైన్ లో లాగిన్ కాగానే.. కొత్త క్రెడిట్ కార్డు వివరాలు కనిపించాయి. దీంతో పలువురు కస్టమర్లు అవాక్కు అయ్యే పరిస్థితి. తాము క్రెడిట్ కార్డుకు అప్లై చేసుకోకున్నా.. ఇలా ఎలా జారీ చేశారన్న సందేహం వ్యక్తమైంది.
అయితే.. ఇదంతా టెక్నికల్ మిస్టేక్ అన్న విషయాన్ని గుర్తించిన బ్యాంకు వాయు వేగంతో స్పందించింది. నష్టనివారణ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఎవరైనా నష్టపోయి ఉంటే పరిహారం అందిస్తామని చెప్పటం ద్వారా.. మస్యను మొగ్గలోనే తుంచేసినట్లుగా చెప్పాలి. ఏమైనా.. జరిగిన తప్పును ఒప్పుకోవటం ద్వారా ఐసీఐసీఐ తన స్థాయికి తగ్గట్లుగా రియాక్టు అయ్యిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.