సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ భవనం తొలగింపు.. ఐకానిక్ భవనం ఇక లేదు
ఇప్పుడు ఆ జాబితాలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిలిచింది. భారీ ఎత్తున మార్పులు చేయనున్న స్టేషన్ డెవలప్ మెంట్ లో భాగంగా స్టేషన్ భవనాన్ని తాజాగా కూల్చేశారు.
By: Tupaki Desk | 14 Feb 2025 4:36 AM GMTడెవలప్ మెంట్ తో వచ్చే ఇబ్బంది ఏమంటే.. ఏళ్లకు ఏళ్లుగా మనతో అనుబంధాన్ని పెంచుకునే అనేక కట్టడాల్ని కాలానికి అనుగుణంగా.. అప్పటి అవసరాలకు అనుగుణంగా కూల్చేస్తుంటారు. హైదరాబాద్ మహానగరం విషయానికి వస్తే ఫ్లైఓవర్లు.. అండర్ పాస్ లు.. మెట్రో.. ఇలా ఏదో ఒక పని కోసం పలు కట్టడాల్ని కూల్చేయటం తెలిసిందే. అందుకే పదేళ్ల క్రితం సిటీకి వచ్చినోళ్లు.. మళ్లీ వస్తే ఒక్కసారి అయోమయానికి గురవుతుంటారు. కొత్తవి రావటం.. పాతవి లేకపోవటం కన్ఫ్యూజన్ కు గురవుతారు. అదే సమయంలో కొత్త మార్పుల్ని ఓకే అనుకున్న.. పాత గురుతులు లేకపోవటం మనసుకు ఒకలాంటి వేదనకు గురి చేస్తూ ఉంటుంది.
ఇప్పుడు ఆ జాబితాలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిలిచింది. భారీ ఎత్తున మార్పులు చేయనున్న స్టేషన్ డెవలప్ మెంట్ లో భాగంగా స్టేషన్ భవనాన్ని తాజాగా కూల్చేశారు. హైదరాబాద్ రైలు మార్గంలో వచ్చే చాలా మంది వినియోగించేది సికింద్రాబాద్ రైల్వే స్టేషనే. ఆ పాతకాలం నాటి భవనం కళ్లలో మెదులుతూ ఉంటుంది. తాజాగా స్టేషన్ ఆధునీకీకరణలో భాగంగా ఈ స్టేషన్ ను పూర్తిగా మార్చేస్తున్నారు.
ఈ క్రమంలో గురువారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ భవనాన్ని కూల్చేశారు.అప్పటివరకు ఠీవీగా నిలిచి..ఎంతోమందికి సుపరిచితమైన సదరు ఐకానిక్ భవనం గంటల వ్యవధిలో రాళ్ల కుప్పలా మారింది. మరో ఏడాది వ్యవధిలో కొత్త భవనాలు రానున్నప్పటికి.. ఇప్పటికైతే అక్కడ ఏమీ లేదు. దశాబ్దాల తరబడి అనుబంధం ఉన్న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఐకానిక్ భవనం ఇప్పుడు మనోఫలకం మీదనే తప్పించి.. భౌతికంగా కనిపించదంతే.