Begin typing your search above and press return to search.

జమిలి వస్తే పవన్ సీఎం నా ?

చంద్రబాబు అనుభవాన్ని గౌరవిస్తామని ఆయనతో అందుకే పొత్తు పెట్టుకున్నామని పవన్ ఇప్పటికి చాలా సార్లు చెప్పారు.

By:  Tupaki Desk   |   28 Oct 2024 6:30 AM GMT
జమిలి వస్తే పవన్ సీఎం నా ?
X

ఏపీలో రాజకీయాలు ప్రస్తుతం ఆసక్తికరంగా ఉన్నాయి. టీడీపీ కూటమిలో జనసేన బీజేపీ ఉన్నాయి. అయితే టీడీపీ పెద్ద పార్టీగా కీలకంగా ఉంది. చంద్రబాబు తన అనుభవంతో ఏపీకి నాలుగవ సారి సీఎం అయ్యారు. చంద్రబాబు అనుభవాన్ని గౌరవిస్తామని ఆయనతో అందుకే పొత్తు పెట్టుకున్నామని పవన్ ఇప్పటికి చాలా సార్లు చెప్పారు.

అయితే టీడీపీ కూటమి ఇదే మాదిరిగా అయిదేళ్ళు సాగితే మాత్రం చంద్రబాబు విజయవంతంగా అయిదేళ్ల పాలనను ముఖ్యమంత్రిగా పూర్తి చేసుకుంటారు. అలా కాకుండా 2026 చివరలో కానీ 2027 మొదట్లో కానీ జమిలి ఎన్నికలు వస్తే కనుక చాలా రాజకీయ పరిణామాలు మారిపోతాయని అంటున్నారు

ఎందుకంటే ప్రస్తుతం కేంద్రంలో బీజేపీకి ఏపీలో టీడీపీతో చాలా పని ఉంది. టీడీపీ మద్దతు చాలా అవసరం. ఆ మద్దతుతోనే మోడీ మూడోసారి ప్రధాన మంత్రి అయ్యారు. అది కాదు అని టీడీపీ అనుకుంటే మాత్రం జాతీయ స్థాయిలో చాలా రాజకీయాలు అనూహ్యంగా మారిపోతాయి.

అందువల్లనే బీజేపీ చంద్రబాబుని అత్యంత గౌరవంగా చూసుకుంటోంది. ఇక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2029 దాకా అధికారాన్ని ఉంచుకోకుండా ఎందుకు జమిలి పాట పాడుతోంది అన్నది చూస్తే బీజేపీకి చాలా ఆలోచనలు ఉన్నాయని అంటున్నారు. ఊతకర్ర తో నడిచే ప్రభుత్వంలో ఇబ్బందికరంగా ఉంటుందని మోడీ షా భావిస్తున్నారు.

అందుకే వీలైనంతవరకూ జమిలి ఎన్నికలు పెట్టించి జాతీయ అజెండాతో దేశవ్యాప్తంగా ప్రజల మనసులను చూరగొంటే పూర్తి మెజారిటీ దక్కుతుందని అలా కాంగ్రెస్ ని పక్కన పెట్టేసి తాము మరింత కాలం అధికారంలో కొనసాగవచ్చు అన్నది ఒక పక్కా ప్లాన్ గా ఉంది అని అంటున్నారు

అపుడు నితీష్ కుమార్ చంద్రబాబుల మద్దతు అవసరం ఉండదని కూడా భావిస్తోంది. ఇక జమిలి ఎన్నికలు కనుక వస్తే ఏపీలో ఏమి జరుగుతుంది అన్నది కనుక చూస్తే ఏపీలో ఈసారి బీజేపీ జనసేన అత్యధిక సీట్లను డిమాండ్ చేస్తాయని అంటున్నారు. మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో 75 సీట్లు ఈ రెండు పార్టీలు కోరుతాయని అంటున్నారు. అంటే అపుడు టీడీపీ 100 సీట్లకు మాత్రమే పరిమితం అయి పోటీ చేయాల్సి ఉంటుందని అంటున్నారు.

2024 ఎన్నికల్లో టీడీపీ 144 సీట్లకు పోటీ చేస్తే బీజేపీ జనసేన కేవలం 31 సీట్లకే పోటీ చేశాయి. కానీ ఈసారి అలా కాకుండా జనసేన తన బలాన్ని విస్తరించుకుంటోంది.వైసీపీ నుంచి నేతలను గట్టిగా ఆయా చోట్ల ఉన్న వారిని తీసుకుంటోంది.తన బలాన్ని గోదావరి జిల్లాల నుంచే కాకుండా ఉత్తరాంధ్రాలో పాటు రాయలసీమ దాకా విస్తరించుకునే యోచనలో ఉంది అని అంటున్నారు.

అలాగే బీజేపీ కూడా తన బలాన్ని మధ్య కోస్తా ఉత్తరాంధ్రా జిల్లాలతో పాటు సీమలోనూ పెంచుకోవాలని చూస్తోంది. ఇక జమిలి ఎన్నికల తరువాత ఏపీలో ముఖ్యమంత్రి సీటు విషయంలో కచ్చితంగా షేరింగ్ ఉంటుందని అంటున్నారు. అపుడు వచ్చిన సీట్లను ఆధారం చేసుకుని జనసేన బీజెపీ ఒక వంతుగా, టీడీపీ మరో వంతుగా పాలన సాగించేలా ఒప్పందం కుదుర్చుకుంటారు అని ప్రచారం అయితే సాగుతోంది.

ఇందులో ఎంతవరకూ నిజం ఉందో తెలియదు కానీ జనసైనికులు పవన్ అభిమానులు మాత్రం ఈసారి ఎన్నికలు అంటూ వస్తే మాత్రం పవన్ కళ్యాణ్ కచ్చితంగా సీఎం అవుతారని అంటున్నారు. పవన్ ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారని ఆయన ఇక అయ్యేది సీఎం గానే అని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారాలు ఎంత వరకూ ఆచరణలోకి వస్తాయో అన్నది. జమిలి ఎన్నికలు మాత్రం బీజేపీకే మేలు అన్నది అందరికీ తెలిసిందే. మరి బీజేపీ ఏపీలో వేసే పాచికలు చేసే రాజకీయాలను బట్టే భవిష్యత్తుని ఊహించగలమని అంటున్నారు.