Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ గెలిస్తే నిజంగా షర్మిలని సీఎం ని చేస్తారా ?

కాంగ్రెస్ పార్టీకి నాయకులు ఎవరు ఉన్నా పార్టీ కోసం పనిచేసేవారు ఎవరు ఉన్నా కూడా అధికారంలోకి వస్తే మాత్రం పోటీకి ఎంతోమంది సిద్ధంగా ఉంటారు.

By:  Tupaki Desk   |   9 July 2024 2:45 AM GMT
కాంగ్రెస్ గెలిస్తే నిజంగా షర్మిలని సీఎం ని చేస్తారా ?
X

కాంగ్రెస్ పార్టీలో ఎందరో యోధానుయోధులు ఉన్నారు. వారంతా ఎపుడూ తెర వెనక ఉంటారు. అలాగే వ్యూహాలతో ఉంటారు. కాంగ్రెస్ పార్టీకి నాయకులు ఎవరు ఉన్నా పార్టీ కోసం పనిచేసేవారు ఎవరు ఉన్నా కూడా అధికారంలోకి వస్తే మాత్రం పోటీకి ఎంతోమంది సిద్ధంగా ఉంటారు.

ఏపీలో ఈ రోజున కాంగ్రెస్ నథింగ్. నిజం చెప్పాలంటే గత మూడు ఎన్నికలుగా పెర్ఫార్మెన్స్ వెరీ పూర్. అసలు కాంగ్రెస్ గ్రౌండ్ లెవెల్ లో లేదు. ఆ పార్టీ పరిస్థితి అయితే తమిళనాడు బెంగాల్ కంటే కూడా దారుణం అని చెప్పాలి.

అలాంటి కాంగ్రెస్ ని లేపే ప్రయత్నం అయితే జరుగుతోంది. కాంగ్రెస్ జస్ట్ రెండు శాతం ఓట్లు మాత్రమే తాజా ఎన్నికల్లో సాధించింది. ఆ పార్టీ గెలవాలీ అంటే 45 శాతం ఓటు షేర్ ని కచ్చితంగా గెలుచుకోవాలి. అంటే 43 శాతం ఓటు బ్యాంక్ కచ్చితంగా రావాలి అన్న మాట. మరి అది ఎలా జత కూడుతుంది అంటే వైసీపీకి వచ్చిన ఓటు షేర్ 40 శాతం ఉంది కదా దాన్ని బాగా గుంజుకుంటే సరి అని అన్నదే అజెండా. అదే ఆలోచన కూడా.

వైసీపీ నుంచి తమ ఓటు బ్యాంక్ ని తెచ్చుకుంటే తిరిగి ఏపీలో బలోపేతం అవుతామని కాంగ్రెస్ లెక్కలు వేస్తోంది. అన్న దగ్గరకు పోయిన ఓటు షేర్ ని కాంగ్రెస్ గూటికి చేర్చే పనిని చెల్లెలు షర్మిలకు అప్పగించారు. ఈ కారణంగానే ఆమెకు కాంగ్రెస్ పీసీసీ చీఫ్ పదవిని అప్పగించారు.

నిజానికి ఈ రోజుకు చూసినా ఏపీ కాంగ్రెస్ లో ఎంతో మంది సీనియర్లు ఉన్నారు. కేంద్ర మాజీ మంత్రులు చింతా మోహన్, జేడీ శీలం, పల్లం రాజు, రాష్ట్ర మాజీ మంత్రి బాపిరాజు, శైలజా నాధ్, రఘువీరారెడ్డి ఇలా లిస్ట్ చాలానే ఉంది. మరి ఇంతమంది కాంగ్రెస్ లో పెద్దలు ఉంటే రేపటి రోజున కాంగ్రెస్ కి అధికార కళ ఏ మాత్రం కనిపించినా చాలా మంది నాయకులు వైసీపీ నుంచి కూడా వస్తారు కదా.

నిజంగా అలా జరగాలనే కదా షర్మిలను ముందు పెట్టి కాంగ్రెస్ వైఎస్సార్ వారసత్వం ఆయన ఆశయాలు అని చెబుతోంది అన్న చర్చ కూడా సాగుతోంది. ఇక అయిదేళ్ల పాటు నీవే సీఎం అంటూ షర్మిలను జనంలో ఉంచి పోరాటాలు చేయించి వైసీపీ ఓటు బ్యాంక్ ని కొల్లగొట్టాలన్నదే కాంగ్రెస్ ఆలోచన. ఆ మీదట 2029 ఎన్నికల వేళకు ఏపీలో పొత్తులకు వెళ్ళినా వెళ్ల వచ్చు.

ఇక అన్నీ కలసి కాంగ్రెస్ సుడి తిరిగి అధికారమే దక్కితే మాత్రం రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా ఏపీ సీఎం గా ఆమెకు చాన్స్ ఇస్తారా అన్నదే చర్చ. ఆనాటికి ఎంతో మంది ముందుకు వస్తారు. అలాగే ఎన్నో సామాజిక సమీకరణలు కూడా జత కూడుతాయి. ఆ రేసులో షర్మిల నిజంగా ఉంటారా ఆమెకే సీఎం అని హై కమాండ్ పట్టం కడుతుందా అన్నదే ప్రశ్న.

తెలంగాణాలో చూసుకుంటే ఏడేళ్ల పాటు ఎంతో కష్టపడిన రేవంత్ రెడ్డిని సీఎం చేసే ప్రక్రియలోనే ఎన్నో అడ్డంకులు అవాంతరాలు జరిగాయి. వాటిని ఆయన తన అనుభవంతో ఎదుర్కొన్నారు. కానీ షర్మిలకు ఆ చాతుర్యం ఉందా అంటే ఆలోచించాల్సిందే. ఈ రోజున వైఎస్సార్ ఫ్యామిలీని విభజించారు అని ఆయన అభిమానులు అంటున్నారు. వైఎస్సార్ జయంతి రోజున కుమార్తెని సీఎం అని చెప్పి మునగచెట్టు ఎక్కిస్తూ కుమారుడు జగన్ ని విమర్శిస్తూ చేస్తున్న ఈ కార్యక్రమాలు పెద్దాయనకు ఏ లోకంలో ఉన్నా శాంతిని కలిగిస్తాయా అన్నదే చర్చ.