నాడు భారత్ సాయం చేయకపోయి ఉంటే... మాల్దీవుల పరిస్థితి ఏమిటి?
ఈ క్రమంలో తాజాగా రెచ్చిపోతున్నట్లు కనిపిస్తున్న మాల్దీవులకు గతం గుర్తు చేస్తున్నారు!
By: Tupaki Desk | 16 Jan 2024 2:45 AM GMTభారత ప్రధాని మోడీ పై మాల్దీవుల మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలతో "బాయ్ కాట్ మాల్దీవ్స్" ఇష్యూ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే భారతీయులు మాల్దీవుల పర్యటనలు విరమించుకోగా.. ఈస్ మై ట్రిప్ సంస్థ మాల్దీవులను బహిష్కరించింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య దౌత్య విభేదాలు మరింత ముదురుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా రెచ్చిపోతున్నట్లు కనిపిస్తున్న మాల్దీవులకు గతం గుర్తు చేస్తున్నారు!
అవును... ప్రస్తుతం భారత్ - మాల్దీవులమధ్య నెలకొన్న దౌత్యపరమైన విభేదాల నేపథ్యంలో... తమ గడ్డపై ఉన్న భారత సైన్యాన్ని మార్చి 15లోగా వెనక్కి పిలిపించుకోవాలని మాల్దీవుల ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం చైనా అండతో శృతిమించుతున్న ఈ మాల్దీవులను.. ఒకప్పుడు భీకర తిరుగుబాటు నుంచి భారతే రక్షించిందని గుర్తుచేస్తున్నారు. నాడు సాయంకోసం భారత్ వైపు చూసినప్పుడు.. మన సైన్యం మాల్దీవులపై దాడిచేస్తున్న శత్రుమూకలను తరిమికొట్టింది.
ప్రపంచ దేశాలు కొనియాడిన ఆ "ఆపరేషన్ కాక్టస్" గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గతంమరిచి శృతిమించి భారత్ పై వ్యాఖ్యానిస్తున్న మాల్దీవులకు నాడు రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో సాయం అంది ఉండకపోతే... ఇవాళ భారత్ కు డెడ్ లైన్ పెట్టే పరిస్థితి ఉండకపోయి ఉండేది! పైగా నాటి ఆ పరిస్థితికి కారణం మాల్దీవులకు చెందిన వ్యాపారవేత్తే కావడం గమనార్హం!
వివరాల్లోకి వెళ్తే... మౌమూన్ అబ్దుల్ గయూం దేశాధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన ప్రభుత్వంపై 1988 నవంబరులో మాల్దీవులకు చెందిన వ్యాపారవేత్త అబ్దుల్లా లుతుఫీ తిరుగుబాటు చేశారు. ఈ సమయంలో శ్రీలంకకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఆఫ్ తమిళ్ ఈలం గ్రూప్ ఆయనకు సాయం చేసింది. వీరు చేసిన దాడులతో మాల్దీవుల రాజధాని మాలె వణికిపోయింది!
నవంబరు 3 తెల్లవారుజామున ఈ గ్రూప్ నకు చెందిన 80 మందితో కూడిన కిరాయి సైన్యం.. మాలె చేరుకుంది. దీంతో చెలరేగిపోయిన ఆ కిరాయి సైన్యం... పోర్టులు, రేడియో స్టేషన్లను అధీనంలోకి తీసుకున్నారు. అనంతరం అధ్యక్షుడి భవనం దిశగా దూసుకెళ్లారు. ఈ తిరుగుబాటు గురించి తెలిసిన అనంతరం అధ్యక్షుడు గయాంను సురక్షిత ప్రాంతానికి తరలించారు అధికారులు.
ఈ సమయంలో వీధుల్లో విరుచుకుపడిన ఆ కిరాయి సైన్యం కొంతమంది మంత్రులు, పౌరులను బందీలుగా చేసుకుంది. దీంతో సాయం కోసం గయూం పొరుగు దేశాలను ఆశ్రయించారు. అయితే... శ్రీలంక, పాకిస్థాన్, సింగపూర్ లు మాల్దీవుల సహాయాన్ని నిరాకరించాయి. ఈ సమయంలో అగ్రరాజ్యం అమెరికా, బ్రిటన్ లు అందుకు అనుకూలంగా స్పందించినా.. వారి సహాయం అందడానికి రెండు మూడు రోజులు పడుతుందని తెలిసింది.
దీంతో భారత్ ను సాయం అడగాలని నాటి బ్రిటిష్ ప్రధాని మార్గరెట్ థాచర్ సూచించారు. దీంతో మరో ఆలోచన లేకుండా మాల్దీవుల అధ్యక్షుడు గయాం.. భారత్ ను అభ్యర్థించారు. దీంతో వెంటనే రియాక్ట్ అయిన నాటి భారత ప్రధాని రాజీవ్ గాంధీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి.. సైన్యాన్ని మాల్దీవులకు పంపించాలని నిర్ణయించారు. దీనికి "ఆపరేషన్ కాక్టస్" అని కోడ్ నేం పెట్టారు.
దీంతో బ్రిగేడియర్ ఫారూఖ్ బల్సారా నేతృత్వంలో మూడు పారాకమాండో బృందాలు ఆగ్రా నుంచి బయలుదేరి మాలె అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాయి. దిగీ దిగగానే ఎయిర్ పోర్టును తమ అధీనంలోకి తీసుకున్నాయి. అనంతరం అక్కడి నుంచి పడవల్లో మాలె నగరానికి చేరుకున్నాయి. ఈ క్రమంలో శ్రీలంక కిరాయి మూకలతో భారత సైన్యం భీకర పోరు సాగించడంతో... మన కమాండోల దెబ్బకు ఆ బ్యాచ్ తోకముడిచి, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయింది.
ఇలా "ఆపరేషన్ కాక్టస్" విజయవంతం అవ్వడంతో ప్రపంచ దేశాలు భారత్ ను ప్రశంసించాయి. నాటినుంచి భారత్, మాల్దీవుల మధ్య బంధం మరింత బలోపేతమైంది. ఈ క్రమంలోనే సుమారు 70 మందితో కూడిన మన సైన్యం అక్కడ విధులు నిర్వర్తిస్తూ... భారత్ సహకారంతో ఏర్పాటు చేసిన రాడార్ స్టేషన్లు, నిఘా విమానాల నిర్వహణ బాధ్యతలను చూస్తోంది.
ఈ క్రమంలో తాజాగా ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో... ఈ సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని మాల్దీవుల కొత్త అధ్యక్షుడు ముయిజ్జు కోరారు. దీంతో ఈ విషయం తీవ్ర వివాదాస్పదమైంది. ఇదే సమయంలో గతం మరిచిన ముయుజ్జు పశ్చాత్తపపడే రోజు తొందర్లోనే వచ్చే అవకాశం ఉందని పలువురు ఈ సందర్భంగా అభిప్రాయపడుతున్నారు.