జగన్ సిక్కోలులో అడుగుపెట్టాలంటే టీడీపీ కండిషన్ అదే...!
దాదాపు వారంలో రెండు జిల్లా మీటింగ్ లు ఉండేలా చూసుకుంటున్నారు. అవి కూడా ఉత్తర దక్షిణ కోస్తాలు, రాయలసీమ అన్నట్లుగానే చేసుకుంటూ వెళ్తున్నారు.
By: Tupaki Desk | 15 Nov 2023 4:30 AM GMTముఖ్యమంత్రి జగన్ ఎక్కడికైనా వెళ్లవచ్చు. ఏ జిల్లలోనైనా ఆయన సభలూ సమావేశాలూ నిర్వహించవచ్చు. ఆయన ఏపీలోని అయిదు కోట్ల మంది ప్రజలకు పాలకుడు. జగన్ ఇటీవల జోరు పెంచారు. దాదాపు వారంలో రెండు జిల్లా మీటింగ్ లు ఉండేలా చూసుకుంటున్నారు. అవి కూడా ఉత్తర దక్షిణ కోస్తాలు, రాయలసీమ అన్నట్లుగానే చేసుకుంటూ వెళ్తున్నారు.
ఈ నేపధ్యంలో జగన్ చూపు మళ్ళీ ఉత్తరాంధ్రా మీద పడింది. ఉత్తరాంధ్రాలో ఆ చివరన ఉన్న శ్రీకాకుళానికి జగన్ ఈ నెల 23న వస్తున్నారు. ఆయన ప్రభుత్వ కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు వస్తున్నారు. అయితే జగన్ని జిల్లాకు రావద్దు అని శ్రీకాకుళం ఎంపీ టీడీపీ యువ నేత కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టంగా చెబుతున్నారు.
జగన్ శ్రీకాకుళం రావాలంటే ఒకే ఒక కండిషన్ అని ఆయన అంటున్నారు. కరవుతో పూర్తిగా అల్లాడుతున్న శ్రీకాకుళం జిల్లాను కరవు జిల్లాగా ప్రకటించాకే ముఖ్యమంత్రి సిక్కోలులో అడుగుపెట్టాలని టీడీపీ ఎంపీ అల్టిమేటం జారీ చేశారు.
కరవుతో జిల్లా అల్లాడిపోతూంటే సీఎం జగన్ ఏమి చేస్తున్నారు అని ఆయన నిలదీస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారని, స్పీకర్ కూడా జిల్లాకు చెందిన వారేనని అయినా కరవు సమస్యను ఒక్క మంత్రి ఎందుకు లేవనెత్తడం లేదని ఆయన ప్రశ్నించారు.
ఎంతసేపూ చంద్రబాబుని విమర్శించడం తప్ప మంత్రులకు ప్రజా సమస్యలు పట్టవా అని రామ్మోహన్ మండిపడుతున్నారు. ఇచ్చాపురం నుంచి హిందూపురం దాకా ఏపీ అంతా కరవుతో పెను సంక్షోభంలో ఉంది కానీ ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టడంలేదని రామ్మోహన్ ఫైర్ అయ్యారు.
రైతుల సమస్యలు ఏపీలో ప్రభుత్వానికి ముఖ్యం కావని రాజకీయాలేనా ముఖ్యమని చెబుతున్నారని ఆయన విమర్శించారు. ప్రజా సమస్యలు ప్రస్తావించనపుడు సామాజిక సాధికారిక బస్సు యాత్ర అని చెప్పుకోవడం ఎందుకు అని ఆయన నిలదీశారు.
రాష్ట్రంలో రైతాంగం గగ్గోలు పెడుతూంటే సీఎం కి చెవికెక్కడం లేదని రామ్మోహన్ నాయుడు అంటున్నారు. ఇప్పటికి అయిదేళ్ళ క్రితం శిక్కోలు తిత్లీ తుపానుకు అల్లల్లాడితే నాడు పాదయాత్ర చేస్తూ పక్క జిల్లాలో ఉన్న జగన్ కనీసం పరామర్శకు వెంటనే రాలేదని ఆయన మనస్తత్వం ఎలాంటిదో నాడే తమకు తెలుసు అని రామ్మోహన్ అంటున్నారు. మొత్తానికి 23న జిల్లాలో సీఎం ని అడుగు పెట్టనీయమని టీడీపీ అంటోంది. మరి జగన్ ఆ రోజున శ్రీకాకుళం వస్తున్నారు ఏమి జరుగుతుంది అన్నదే ఇపుడు చర్చగా ఉంది.