Begin typing your search above and press return to search.

మోడీ దయ చూపితే జగన్ కి ఓట్ల పంటే...!

ఇంతకీ ఏమిటి ఆ విషయం అంటే గత ఎనభై అయిదేళ్ల క్రితం నాటి పోలవరం ప్రాజెక్ట్ అని చెప్పాలి.

By:  Tupaki Desk   |   12 Feb 2024 5:30 AM GMT
మోడీ దయ చూపితే జగన్ కి ఓట్ల పంటే...!
X

కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ దయ చూపిస్తే చాలు ఏపీలో జగన్ కి ఓట్ల పంట పండుతుంది. అంతే కాదు ఆయన చరిత్ర పురుషుడుగా కూడా రికార్డులకు ఎక్కుతారు. ఇంతకీ ఏమిటి ఆ విషయం అంటే గత ఎనభై అయిదేళ్ల క్రితం నాటి పోలవరం ప్రాజెక్ట్ అని చెప్పాలి.

ఈ ప్రాజెక్ట్ విషయంలో ఇప్పటిదాకా అన్ని ప్రభుత్వాలు కృషి మాత్రమే చేస్తూ వచ్చాయి. దానిని పూర్తి చేయడానికి ప్రయత్నం అయితే చేయలేదు. పోలవరం ప్రాజెక్ట్ ని పశ్చిమ గోదావరి జిల్లా వద్ద నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగితే ఏకంగా డెబ్బై అయిదు వేల గ్రామాలు పూర్తిగా లేకుండా పోతాయి.

ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం ఇరవై వేల కోట్లు అయితే పునరావాస ప్యాకేజ్ కే దాదాపుగా 35 వేల కోట్లకు పైన ఖర్చు చేయాల్సి ఉంటుంది. చంద్రబాబు టైంలో మొదలైన ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పనులు ఒక కొలిక్కి వచ్చాయి. దాదాపుగా డెబ్బై అయిదు శాతం పైగా ప్రాజెక్ట్ పూర్తి అయింది. అయితే పునరావాస పనులు మాత్రం కేవలం 22 శాతం మాత్రమే జరుగుతూ నత్త నడకగా ఉన్నాయి. ఇక ప్రాజెక్ట్ ప్రోటోకాల్ ప్రకారం చూస్తే రెండు దశలుగా ప్రాజెక్ట్ పూర్తి చేయాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

తొలి దశలో 41.15 మీటర్ల ఎత్తులో నీటిని నిలవ చేయడం చేస్తారు. రెండవ దశలో 45 మీటర్ల వద్ద నీటిని నిల్వ చేస్తారు. ఇక ప్రాజెక్ట్ యొక్క మొదటి దశను త్వరగా పూర్తి చేయడానికి 12,911 కోట్లను విడుదల చేయడానికి కేంద్రం అంగీకరించింది అని చెబుతున్నారు.

అలాగే పోలవరం మొదటి దశ పూర్తి చేయడానికి సుమారు 17,144 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని లెక్క వేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదన ఇప్పటికే జలవిద్యుత్ శాఖలో పెండింగ్‌లో ఉంది. తొలిదశలో కనీసంగా పదిహేను వేల కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తే సగానికి సగం గ్రామాలకు చెందిన పునరావాస సాయం అందుతుంది.

అది కనుక జరిగితే పోలవరం తొలిదశ కింద నీటిని 41.5 అడుగులు ఎత్తులో నిల్వ చేయడానికి కూడా వీలుంటుంది అని అంటున్నారు. దీని మీదనే ఇటీవల ఢిల్లీ వెళ్ళి మరీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధానిని కలిశారు. నిధులు పోలవరం విషయంలో సత్వరం రిలీజ్ చేయాలని కోరారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోగా విడుదల చేస్తే బాగుంటుందని సూచించారు.

మరి కేంద్రం ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మోడీ కనుక దయ చూపితే ఏపీ సర్కార్ కి ఇది అతి పెద్ద విజయమే అవుతుంది. తొలిదశ పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయ్యేందుకు మార్గం సుగమం అవుతుంది. దానిని చూపించి వచ్చే ఎన్నికల్లో జనం వద్దకు మరింత ధీమాగా వెళ్లే అవకాశం ఉంటుంది. మరి కేంద్రం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది.