ఏపీ మీద విషం చిమ్మితేనే సీట్లొస్తాయా ?
ఒకవైపు కేసీయార్ బహిరంగసభల్లో మాట్లాడుతుంటే మరోవైపు మంత్రులు కేటీయార్, హరీష్ రావులు నియోజకవర్గాల్లో రోడ్డుషోలు, చిన్నపాటి సభల్లో మాట్లాడుతున్నారు.
By: Tupaki Desk | 9 Nov 2023 6:14 AM GMTరాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ సీట్లు గెలవాలంటే ఏపీపై విషం చిమ్మాల్సిందేనా ? ప్రత్యేక తెలంగాణా ఏర్పడి పదేళ్ళవుతున్నా ఇంకా ఏపీ మీద విధ్వేషాన్ని నింపాల్సిందేనా ? ఇవన్నీ కేసీయార్ మాటలు విన్న తర్వాత జనాల్లో మెదులుతున్న ప్రశ్నలు. ఎన్నికల బహిరంగసభల్లో కేసీయార్ రోజుకు మూడు, నాలుగు నియోజకవర్గాల్లో మాట్లాడుతున్నారు. ఒకవైపు కేసీయార్ బహిరంగసభల్లో మాట్లాడుతుంటే మరోవైపు మంత్రులు కేటీయార్, హరీష్ రావులు నియోజకవర్గాల్లో రోడ్డుషోలు, చిన్నపాటి సభల్లో మాట్లాడుతున్నారు.
ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే వీళ్ళ ముగ్గురి మాటల్లోను ఏపీ పైన విషం చిమ్మటమే కనబడుతోంది. ఏపీపైన తెలంగాణా జనాల్లో ఎంత విధ్వేషాన్ని నింపితే బీఆర్ఎస్ కు అన్ని ఓట్లు వస్తాయని, సీట్లు గెలుస్తామని అనుకుంటున్నారు. అందుకనే పదేపదే తెలంగాణా అద్భుతంగా అభివృద్ధి జరుగుతోందని, ఏపీలో అధ్వాన్న పాలన సాగుతోందని చెబుతున్నారు. డబుల్ రోడ్డుంటే తెలంగాణా అని సింగిల్ రోడ్డుంటే ఏపీ అని అర్ధమని కేసీయార్ ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పారో లెక్కలేదు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఏపీలో ఎవరూ తెలంగాణా గురించి మాట్లాడటంలేదు. కేసీయార్, మంత్రులు మాత్రమే ఏపీ గురించి పదేపదే అదీ అవమానకరంగా మాట్లాడుతున్నారు. దీనికి కారణం ఏమిటంటే జనాల్లో తెలంగాణా సెంటిమెంటును రాజేయటమే. ఎందుకంటే అభివృద్ధి, సంక్షేమపథకాలను ప్రస్తావిస్తే జనాలు నమ్మరని వీళ్ళకి అర్ధమవ్వబట్టే. రైతుబంధు, రుణమాఫీ, దళిత బంధు, బీసీ బంధు పథకాలు ఎంత సవ్యంగా అమలవుతున్నాయో అందరికీ తెలుసు. కేసీయార్ అమలుచేస్తున్న చాలా పథకాలు పక్క రాష్ట్రాల నుండి కాపీ చేసినవే. అవికూడా సక్రమంగా అమలు కావటంలేదు.
ఇక అభివృద్ధి అంటే వర్షాలు పడినపుడు హైదరాబాద్ రోడ్లను చూస్తే చాలు తెలంగాణా అభివృద్ధి ఏమిటో తెలుస్తుంది. అభివృద్ధి, సంక్షేమపథకాలపై మాట్లాడితే జనాలు ఓట్లేయరనే మళ్ళీ సెంటిమెంటును రాజేస్తున్నారు. సెంటిమెంటును రాజేయాలంటే ఏపీ పై విషం చిమ్మాల్సిందే. అందుకనే అవసరంలేకపోయినా పదేపదే ఏపీని కించపరుస్తు మాట్లాడుతున్నది. రాష్ట్రాలు విడిపోయి పదేళ్ళవుతున్నా ఇంకా ఏపీపైన విషం చిమ్ముతున్నారంటేనే కేసీయార్, మంత్రుల ఆలోచనలు ఏమిటో అర్ధమైపోతోంది.