టీడీపీ సర్కారు వస్తే.. పులివెందులకు మంత్రి పదవి ఖాయం
అప్పటివరకు ఇంకా తెలవారదేమి..? జూన్ 4 రాదేమీ అని పాడుకుంటూ ఉండాల్సిందే.
By: Tupaki Desk | 17 May 2024 5:30 PM GMTఏపీలో ఇప్పుడు అందరి మాట ఒక్కటే.. జూన్ 4 ఎప్పుడు వస్తుంది బాసూ? అని. రూ. వందల కోట్ల బెటింగ్ లు.. అంతకుమించిన వ్యక్తిగత పందేలు.. ఇక పార్టీల నాయకుల ఉత్కంఠ అయితే తారస్థాయికి చేరింది. ఏది ఏమైనా మరొక్క 17 రోజులు ఆగాల్సిందే. అప్పటివరకు ఇంకా తెలవారదేమి..? జూన్ 4 రాదేమీ అని పాడుకుంటూ ఉండాల్సిందే.
కూటమి గెలిస్తే మంత్రులెవరో?
ఆలూ లేదు చూలు లేదు.. కొడుకు పేరు అని సామెత చెప్పినట్లు ఏపీలో అనే కాదు.. ఏ రాష్ట్రంలో అయినా కొత్తగా ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయంటే మంత్రులు ఎవరు? అనే ఆసక్తి నెలకొంటుంది. ఇప్పుడు ఏపీలో టీడీపీ కూటమి విజయం సాధిస్తే మంత్రి పదవులు మూడు పార్టీల మధ్య పంచుకోవాల్సి ఉంటుంది. 175 మంది ఎమ్మెల్యేల్లో 15 శాతం పరిమితి దాటకుండా కేబినెట్ బెర్తులు ఇవ్వాల్సి ఉంటుంది. వీటిలోనే మూడు పార్టీలూ పంచుకోవాలి అన్నమాట. అదే వైసీపీ గెలిస్తే మాత్రం ఆ ఒక్క పార్టీకే పదవులు దక్కుతాయని, అదీ జగన్ అభీష్టం మేరకే అని చెప్పాల్సిన పనిలేదు.
అక్కడ మంత్రి పదవి ఖాయం
సీఎం జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల ఏపీలో అత్యంత కీలక నియోజకవర్గం. 1978 నుంచి వైఎస్ కుటుంబ ఆధీనంలోనే ఉందీ సీటు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన తమ్ముడు వివేకానంద రెడ్డి, ఆ తర్వాత వైఎస్ఆర్ భార్య విజయలక్ష్మి, రెండు టర్మ్ లుగా వైఎస్ జగన్ ఇక్కడినుంచి గెలుస్తూ వస్తున్నారు. కాగా, ఈసారీ జగన్ గెలుపుపై ఎవరికీ అనుమానం లేదు. అంతగా ఆ నియోజకవర్గంలో వైఎస్ కుటుంబ పట్టు ఉంటుంది. కాగా, ఈ ఎన్నికల్లో జగన్ కు ప్రత్యర్థిగా టీడీపీ నుంచి బీటెక్ రవి పోటీ చేసిన సంగతి తెలిసిందే.
ఓడినా పదవి ఖాయమా?
బీటెక్ రవి పులివెందులలో జగన్ పై నెగ్గడం కష్టమేనని చెప్పాలి. అయితే, ఆయన ఓడినా రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం వస్తే.. బీటెక్ రవికి మంచి ప్రాధాన్యం దక్కడం ఖాయం అనే చెప్పాలి. ఇప్పటికే వైఎస్ వివేకాను ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన రికార్డు ఆయన సొంతం. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఓడినా.. టీడీపీ సర్కారు ఏర్పడితే బీటెక్ రవికి మంత్రి పదవి ఇవ్వొచ్చేమో..?
పరిస్థితుల రీత్యా అవసరం కూడా
ఏపీలో 2019-24 మధ్య వైసీపీ సర్కారు ప్రతిపక్ష టీడీపీ మధ్య పెద్ద యుద్ధమే అన్నట్లు సాగింది రాజకీయం. దీనికి పరాకాష్ట టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు. ఇప్పుడు వైసీపీ మళ్లీ గెలిస్తే ప్రతిపక్షానికి ఇంకా కష్టాలే. అదే టీడీపీ అధికారంలో వస్తే వైసీపీకి ఎలాంటి గడ్డు కాలం ఉంటుందో ఊహించవచ్చు. వీటన్నిటి నేపథ్యంలో అయినా, బీటెక్ రవికి మంత్రి పదవి ఇస్తే కడప జిల్లాలో ఇంకా దీటుగా వైసీపీని ఎదుర్కొనేందుకు టీడీపీకి ఆయుధం చిక్కుతుంది. అందులోనూ బీటెక్ రవి ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవం ఉన్నవారు. రాజకీయంగా వైఎస్ కుటుంబాన్ని గతంలో టీడీపీ తరఫున ఢీకొట్టిన సతీష్ రెడ్డి, పార్థసారథిరెడ్డి కంటే బీటెక్ రవి ఇంకా మెరుగ్గా ఉన్నారు.
కొసమెరుపు: పోలింగ్ పూర్తయిన అనంతరం పులివెందులలో టీడీపీ కార్యాలయం కార్యకర్తలతో అత్యంత సందడిగా కనిపించింది. ఇటీవలి కాలంలో ఎన్నడూ చూడని వైభవం ఇది అనిపించింది. ఇక ఎన్నికల్లోనూ గెలిస్తే ఎలా ఉంటుందో..?