Begin typing your search above and press return to search.

ఒకవేళ కేంద్రంలో 'ఇండియా' సర్కారుకు టీడీపీ జై కొడితే..? జనసేన సంగతేంటో?

ఇలాంటివాటిలో ఏపీలో టీడీపీ ముందు వరుసలో ఉంటుందని చెప్పక తప్పదు.

By:  Tupaki Desk   |   17 May 2024 3:30 PM GMT
ఒకవేళ కేంద్రంలో ఇండియా సర్కారుకు టీడీపీ జై కొడితే..? జనసేన సంగతేంటో?
X

దేశంలో రాజకీయ గాలి మారుతోంది. కాస్త కాంగ్రెస్ వైపు మళ్లుతోంది. ఇండియా కూటమి పక్షాలూ ఎక్కడికక్కడ బీజేపీకి దీటుగా నిలుస్తున్నాయి. అటు పదేళ్ల మోదీ పాలనపై సానుకూలత ఏమీ లేదు. దీంతో కాషాయ పార్టీకి ఎదురీత తప్పడం లేదు. మొత్తమ్మీద బీజేపీకి 200 ఎంపీ సీట్లు కూడా సాధించకుంటే ఆ పార్టీ ఆధ్వర్యంలోని కూటమని ఎన్డీఏ నుంచి కొన్నిపార్టీలు బయటకు వస్తాయని చెప్పొచ్చు. ఇలాంటి పార్టీలు బీజేపీ మీద ప్రేమనో, నరేంద్ర మోదీ నాయకత్వం నచ్చడంతోనో పొత్తు పెట్టుకోలేదు. నయానో, భయానో, కేసుల బూచితోనో, హిందూత్వ ఆలోచనతోనో కేంద్రంలో అధికారంలో ఉన్నందున ఎన్నికల సమయంలో ఉపయోగం అని ఊహించో బీజేపీతో చేతులు కలిపి పోటీ చేసిన పార్టీలు చాలా ఉన్నాయి. ఇలాంటివాటిలో ఏపీలో టీడీపీ ముందు వరుసలో ఉంటుందని చెప్పక తప్పదు.

మెజారిటీ రాకుంటే తన దారి తనదే

ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని కట్టడి చేయాలంటే కేంద్రంలోని మోదీ సర్కారుకు అండ కీలకమని భావించే టీడీపీ పెద్దగా ఇష్టం లేకున్నా.. ఈ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుందనేది అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీలో టీడీపీ 144, జనసేన 21, బీజేపీ 10 అసెంబ్లీ స్థానాల్లో, ఎంపీ సీట్లలో టీడీపీ 17, బీజేపీ 6, జనసేన 2 చోట్ల పోటీ చేశాయి. ఇక కేంద్రంలో ఈసారి గాలి మారి కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి గనుక అధిక సంఖ్యలో సీట్లు సాధిస్తే.. చంద్రబాబు మద్దతు కీలకమైన పరిస్థితి తలెత్తితే ఏంటనేది ఊహించవచ్చు. ఇలాంటి సందర్భంలో బాబు రాష్ట్ర ప్రయోజనాల రీత్యా వ్యవహరించాల్సిన అవసరం వస్తుంది. కేంద్రంతో సఖ్యంగా ఉంటేనే అమరావతి రాజధాని పూర్తి సహా అనేక పనులు మంజూరుకు చాన్సుంటుంది. దీంతో చంద్రబాబు కనీసం ఇండియా కూటమికి బయటినుంచి అయినా మద్దతు ఇస్తారని అనుకోవచ్చు.

జన సేన సంగతి..?

టీడీపీ ఏపీలోనూ సొంతంగా మెజారిటీ సాధించే సంఖ్యలో పోటీ చేసింది. వందకు పైగా అసెంబ్లీ సీట్లు గెలిస్తే ఇది సాధ్యమే. ఇక కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితుల్లో జనసేనతో ఎలా వ్యవహరిస్తుందన్నది కీలకం. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎట్ పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ వాసన కూడా సహించని మనిషి. అయితే, ఎన్నికల తర్వాత వాతావరణం కాంగ్రెస్ కు అనుకూలంగా ఉండి.. టీడీపీ కూడా అటు వెళ్తే ఏం జరుగుతుందనేది ఆసక్తికరం. అప్పుడు జనసేనను అనివార్యంగానే అయినా వదులుకోవాల్సిన పరిస్థితి.