టీడీపీ గెలిస్తే లోకేష్ సీఎం కావడం పక్కా...!?
లోకేష్ నే చంద్రబాబు సీఎం చేస్తారు అది కూడా 2024 నుంచి 2029 టెర్మ్ మధ్యలోనే అని అంటున్నారు. దానికి బలమైన ప్రాతిపదిక కూడా ఉందని అంటున్నారు.
By: Tupaki Desk | 1 March 2024 1:39 PM GMTతెలుగుదేశం జనసేనతో జత కట్టింది. బీజేపీ కూడా ఈ జట్టులోకి వస్తుంది అని అంటున్నారు. ఈ కూటమి సీఎం అభ్యర్ధి ఎవరు అంటే అందరికీ తెలిసిన సంగతే. చంద్రబాబే సీఎం. ఆయనను చూసే ఓటు వేయాలి. బాబు మూడు సార్లు సీఎం అయ్యారు. 2-24 ఎన్నికల్లో పార్టీ గెలిస్తే మరోసారి కూడా అవుతారు.
అయితే బాబు సీఎం గా ఎంతకాలం ఆ పదవిలో ఉంటారు అన్నదే ఇక్కడ కీలక చర్చ. చంద్రబాబు తన కుమారుడి కోసమే ఈసారి ఎన్నికలను ఒక సవాల్ గా తీసుకున్నారు అని అంటున్నారు. తాజాగా చూస్తే రాజకీయంగా తలపండిన నేత చేగొండి హరిరామజోగయ్య వంటి వారు కూడా అదే అనుమానం వ్యక్తం చేశారు.
లోకేష్ నే చంద్రబాబు సీఎం చేస్తారు అది కూడా 2024 నుంచి 2029 టెర్మ్ మధ్యలోనే అని అంటున్నారు. దానికి బలమైన ప్రాతిపదిక కూడా ఉందని అంటున్నారు. నిజానికి చూస్తే 2019లో వరసగా మరోసారి టీడీపీ గెలిచి ఉంటే అప్పట్లోనే చంద్రబాబు తన ప్లేస్ లో లోకేష్ ని సీఎం చేసి ఉండేవారు అని కూడా చెప్పుకున్న నేపధ్యం ఉంది.
అయితే ఆ చాన్స్ తప్పింది. ఇపుడు మరో చాన్స్ ఇంకా చెప్పాలంటే రాజకీయంగా చివరి చాన్స్ గా కూడా టీడీపీకి ఇదే అని చెప్పుకోవాలని అంటున్నారు. చంద్రబాబు వయసు రిత్యా ఏపీలో రాజకీయ నేపధ్యం దృష్ట్యా చూసుకున్నా లోకేష్ ని ఈ టెర్మ్ లోనే సీఎం చేయడం అనివార్యం అని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారం లో ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి.
అధికారంలో ఉండగానే లోకేష్ ని సీఎం గా చేస్తే ఇక 2029 ఎన్నికల్లో పార్టీ గెలుపు బాధ్యతలు అన్నీ ఒక సీఎం హోదాలోనే లోకేష్ తీసుకుంటారు అన్నది కూడా బాబు ఆలోచన అయి ఉంటుందని అంటున్నారు. ఇంకో విషయం ఏమిటి అంటే వైఎస్సార్ చంద్రబాబుల మధ్యన ఒక వింత పోటీ ఉంది. చంద్రబాబు వైఎస్సార్ ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చి ఇద్దరూ ఒకేసారి మంత్రులు అయ్యారు
ఆ తరువాత సీఎం పదవి కోసం వైఎస్సార్ మూడు దశాబ్దాల కాలం వేచి చూడాల్సి వచ్చింది. కానీ చంద్రబాబు మాత్రం ఆయన కంటే దాదాపు తొమ్మిదేళ్ల ముందు సీఎం అయిపోయారు. ఇక వైఎస్సార్ వారసుడు జగన్ అయితే తండ్రి కంటే పదేళ్ల చిన్న వయసులో సీఎం అయ్యారు. చంద్రబాబు తనయుడు మాత్రం మంత్రిగానే ఉండిపోయారు.
అయితే జగన్ మంత్రి కాలేదు కానీ లోకేష్ మంత్రిగా రెండేళ్ల పాటు పనిచేశారు. అలా జగన్ మీద ఒక మెట్టు తన కుమారుడిని 2014-2019 టెర్మ్ లో ఎక్కించిన చంద్రబాబు 2019లో విజయం సాధించలేక చతికిలపడ్డారు. దాంతో లోకేష్ మాజీ మంత్రి గానే మిగిలిపోయారు. అదే జగన్ కి టర్నింగ్ పాయింట్ అయింది. ఆయన చంద్రబాబు కుమారుడి కంటే పది మెట్లు ముందు ఎక్కేశారు. సీఎం అయిపోయారు
ఈ విధంగా చూస్తే వైఎస్సార్ ని చంద్రబాబు సీఎం రేసులో దాటేస్తే వారసుల రేసులో జగన్ అగ్ర భాగాన నిలబడ్డారు. పైగా ముఖ్యమంత్రుల కుమారులు సీఎంలు కారు అన్న యాంటీ సెంటిమెంట్ ని కూడా తీసి అవతల పెట్టేశారు. జగన్ ఒక ఎస్టాబ్లిష్డ్ పొలిటీషియన్ గా మారిపోయారు.
అలా జగన్ విజేతగా నిలిచి ఉంటే చంద్రబాబు కూడా తన కుమారుడిని సీఎం గా చూడాలన్న తపనతోనే 2019 ఎన్నికల నుంచి పనిచేస్తున్నారు. అయిదేళ్ళు ఆలస్యం అయినా దాన్ని ఆయన నెరవేర్చుకోవాలని చూస్తున్నారు. అందువల్ల ఈసారి టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే తొలి నాళ్లలో బాబు సీఎం అయినా కొన్నాళ్ల తరువాత తప్పుకుని లోకేష్ ని సీఎం గా చేయడం ఖాయం. అంతకు మించిన గొల్డెన్ చాన్స్ కూడా రాదు.
మరి బాబు సీఎం కావడానికి ఓకే చెప్పే జనసేన అపుడు లోకేష్ కి సహకరిస్తుందా అంటే అందుకే 88 సీట్ల మ్యాజిక్ ఫిగర్ కి సరిపడా దక్కేలా చూసుకుంటూ టీడీపీ 145 సీట్లలో పోటీకి రెడీ అవడం అని అంటున్నారు. అందుకే జనసేనకు 24 సీట్లు పొత్తులో భాగంగా కేటాయించారు అని అంటున్నారు. ఇక కూటమి వచ్చిన తరువాత జనసేనకు ప్రాధాన్యత ఎలా ఉంటుంది అంటే జోగయ్య చెప్పినట్లుగా అనుమానించాల్సిందే. ఎందుకంటే ఒకసారి అధికారం దక్కితే టీడీపీదే పూర్తి ప్రభుత్వం అవుతుంది. అపుడు కచ్చితంగా లోకేష్ ని సీఎం చేయడం అనే అజెండాతోనే ఆ పార్టీ ఆలోచనలు సాగుతాయని అంటున్నారు.
ఆ దిశగానే టీడీపీలో అభ్యర్ధుల ఎంపిక కూడా సాగుతోంది అని అంటున్నారు. రేపటి రోజున బాబు ప్లేస్ లో లోకేష్ సీఎం అయినా కూడా అంతా ఓకే అనే విధంగానే టీడీపీ టీం ని రెడీ చేసేలా అభ్యర్ధుల సెలక్షన్ ఉంటోందని చెబుతున్నారు. మొత్తం మీద చూస్తే జోగయ్య అనుమానాలు అన్నీ నిజాలు అయ్యే అవకాశాలు ఉన్నాయా అంటే రాజకీయాలు ఎరిగిన వారు అదే నిజం అంటున్నారు. సో జనసేన టీడీపీ కూటమి అయిదేళ్ల కాలంలో ఇద్దరు సీఎం లు మారవచ్చు. కానీ ఆ రెండవ సీఎం లోకేష్ తప్ప పవన్ కారు అన్నది జోగయ్య చెప్పిన జోస్యం అదే రేపు జరగవచ్చు అన్నదే రాజకీయం ఎరిగిన వారి మాట. చూడాలి మరి ఏమి జరుగుతుందో.