Begin typing your search above and press return to search.

తెలంగాణా కాంగ్రెస్ జాబితా తిరగతోడాలా.. ?

ఈ నేపధ్యంలోనే జాబితాలో అధికంగా అసంతృప్తి ఉన్న స్థానాల మీద రివ్యూ చేసి అవసరం అయిన చోట మార్చాలని ఆ లేఖలో వారు కోరుతున్నారు.

By:  Tupaki Desk   |   30 Oct 2023 4:01 AM GMT
తెలంగాణా కాంగ్రెస్ జాబితా తిరగతోడాలా.. ?
X

ఒకసారి అభ్యర్ధులను ప్రకటించాక మళ్ళీ తిరగతోడడం అంటే అయ్యే పనేనా. అలా చేయడం మంచిదేనా. అపుడు టికెట్ ముందు అందుకున్న వారి సంగతేంటి. ఇలాంటి డిమాండ్లు ఎందుకు వస్తున్నాయి. అంటే ఇదంతా తెలంగాణా కాంగ్రెస్ లోనే వస్తున్నాయని అంటున్నారు. తెలంగాణా సీనియర్ నేతలు కొందరు దీని మీద ఏకంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు

ఈ మేరకు టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జీ నిరంజన్‌, ఏఐసీసీ కిసాన్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు ఎం కోదండరెడ్డిలు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాస్తూ కాంగ్రెస్ మొదటి రెండు జాబితాలలో ప్రకటించిన మొత్తం వంద మంది అభ్యర్ధులలో అభ్యంతరాలు ఉన్న వాటిని మార్చాలని కోరారు. పార్టీలో దశాబ్దాలుగా ఉంటూ వచ్చిన నేతలను సీనియర్లను అనేక మందిని పక్కన పెట్టారని, రాత్రికి రాత్రి పార్టీలో చేరిన వారికి పారా చూట్ నేతలకు టికెట్లు ఇచ్చారని ఈ లేఖలో ఆక్షేపించారు.

ఇదెక్కడి న్యాయం అని వారు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే కాంగ్రెస్ లో టికెట్లు దక్కని వారు అంతా గోల పెడుతున్నారు. పలువురు సీనియర్లు అయితే మీడియా ముందుకు వస్తున్నారు. అలాగే కొందరు పార్టీకి గుడ్ బై కొట్టేస్తున్నారు. ఇది మంచి పరిణామం కాదని కూడా అంటున్నారు.

ఈ నేపధ్యంలోనే జాబితాలో అధికంగా అసంతృప్తి ఉన్న స్థానాల మీద రివ్యూ చేసి అవసరం అయిన చోట మార్చాలని ఆ లేఖలో వారు కోరుతున్నారు. పార్టీశ్రేణుల మనోభావాలు, అసంతృప్తిని దృష్టిలో ఉంచుకుని ప్రజల్లో విశ్వాసం నింపడానికి, పార్టీలో ఉన్న వాతావరణాన్ని చక్కదిద్దడానికి మొదటి రెండో జాబితాలలో ప్రకటించిన అభ్యర్థుల పేర్లను సమీక్షించి పునఃపరిశీలించాలని కోరుతున్నట్టుగా వారు తెలిపారు.

ఈ డిమాండ్ ఇపుడు అవసరమా అని కొంతమంది అంటున్నారు. అదే టైం లో అవసరమే అని సీనియర్లు అంటున్నారు. పార్టీలో లేని వారిని కొత్తగా వచ్చిన వారిని ఏరి కూర్చి టికెట్లు ఇస్తే దశాబ్దాలుగా ఉంటున్న వారి సంగతి ఏమి కావాలని కూడా ప్రశ్నిస్తున్న వారూ ఉన్నారు.

ఇక ఇంకో వైపు అయితే కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలపై కొన్నిచోట్ల అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. పలువురు సీనియర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది పార్టీలో చిచ్చు రేపేలా ఉందని అంటున్నారు.

అయితే అలక పానుపు ఎక్కిన వారిని, సీనియర్లను దారికి తెచ్చి నచ్చ చెప్పే ప్రయత్నం చేయడం మంచిది కానీ ఇప్పటికే ప్రకటించిన జాబితాను తిరగతోడాలని మొదలెడితే అది అక్కడితో ఆగదని, అసంతృప్తులు ఎపుడూ ఉంటాయని అలా కనుక చేసుకుంటూ పోతే అంతూ పొంతూ ఉండదని అంటున్న వారూ ఉన్నారు. మొత్తానికి సీనియర్లు రాసిన లేఖ మీద కాంగ్రెస్ హై కమాండ్ ఏ నిర్ణయం ప్రకటిస్తుందో చూడాల్సి ఉంది అంటున్నారు.