బాబోయ్ ఎమ్మెల్యే టికెట్.. వద్దంటే వద్దు
ఇప్పుడున్న పరిస్థితుల్లో తాను పోటీ చేయలేనన్న విషయాన్ని ఒప్పించిన కిషన్ రెడ్డి మిగిలిన వారి కంటే ముందే బయటపడిపోయినట్లుగా చర్చ సాగుతోంది.
By: Tupaki Desk | 26 Oct 2023 5:06 AM GMTఎన్నికల వేళ పార్టీ టికెట్ కోసం పడే తాపత్రయం అంతా ఇంతా కాదు. అందుకు భిన్నమైన పరిస్థితి తెలంగాణ బీజేపీలో నెలకొంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై రెండు వారాలకు పైనే కావొస్తున్నా పరిమిత సంఖ్యలో మొదటి జాబితా మాత్రమే విడుదలైంది తప్పించి.. రెండో జాబితా విడుదల కాలేదు. నవంబరు ఒకటి వరకు రెండో జాబితా రాదని తేల్చేస్తున్నారు. ఎందుకిలా? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి.
ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో పార్టీ సీనియర్లు ఆసక్తి చూపకపోవటం.. తమ టార్గెట్ ఎంపీనే తప్పించి.. ఎమ్మెల్యే టికెట్ కాదంటే కాదని తేల్చేస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో.. పార్టీ అగ్రనాయకత్వానికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనట్లుగా తెలుస్తోంది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విషయాన్నే తీసుకుంటే.. గతంలో ఆయన ప్రాతినిధ్యం వహించి.. గత ఎన్నికల్లో ఓడిన అంబర్ పేట నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు నో అంటే నో అనటమే కాదు.. ఆ దిశగా పార్టీ అధినాయకత్వాన్ని ఒప్పించేందుకు కష్టపడాల్సి వచ్చిందని చెబుతున్నారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో తాను పోటీ చేయలేనన్న విషయాన్ని ఒప్పించిన కిషన్ రెడ్డి మిగిలిన వారి కంటే ముందే బయటపడిపోయినట్లుగా చర్చ సాగుతోంది. కిషన్ రెడ్డి బాటలోనే మరికొందరు ఉన్నప్పటికీ.. వారి రిక్వెస్టును ఏం చేయాలన్న దానిపై బీజేపీ అధినాయకత్వం కిందా మీదా పడుతున్నట్లు చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయటానికి టీబీజేపీ సీనియర్లు సుముఖంగా లేరని చెబుతున్నారు. అదే సమయంలో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీకి తాము సిద్ధమని చెప్పటం గమనార్హం.
అధికార బీఆర్ఎస్ తో బీజేపీ తెర వెనుక ఒప్పందాలు చేసుకున్నట్లుగా జరిగిన ప్రచారం పార్టీని భారీగా దెబ్బ తీసిందన్న మాట పార్టీ వర్గాల్లో స్పష్టంగా వినిపిస్తోంది. దీనికి తోడు ఇప్పుడున్న పరిస్థితుల్లో గెలుపు అవకాశాలు పెద్దగా లేవన్న సంకేతాలు కనిపిస్తున్న వేళ.. అనవసరమైన భారాన్ని మోయటం ఎందుకన్న భావన నేతల్లో కనిపిస్తోంది. ఇప్పుడు ఎన్నికల బరిలోకి దిగితే అయ్యే ఖర్చు.. వచ్చే లోక్ సభ ఎన్నికల వేళకు అయ్యే ఖర్చు భారం కంటే.. ఒక ఖర్చును తగ్గించుకోవాలన్న యోచనలో పలువురు ఉన్నట్లు చెబుతున్నారు.
దీనికి తోడు బీజేపీ అధినాయకత్వం ఐబీతో చేయించిన సర్వే రిపోర్టులు కూడా నెగిటివ్ గా ఉండటం.. దీని వివరాల్ని తెలుసుకున్న బీజేపీ నేతలు పోటీ విషయంలోవెనక్కి తగ్గినట్లుగాచెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర పార్టీ మాజీఅధ్యక్షుడు బండి సంజయ్ సైతం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఏ మాత్రం ఆసక్తి చూపటం లేదంటున్నారు. దీనికి తోడు తాను సూచించిన అభ్యర్థులకు టికెట్లను అధినాయకత్వం ఇవ్వకపోవటాన్ని బండి అవమానంగా భావిస్తున్నారని.. దీంతో ఈసారి పోటీకి దూరంగా ఉండటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. బండి బాటలోనే పలువురు సీనియర్లు అసెంబ్లీ బరి నుంచి దూరంగా ఉండేందుకు ఇష్టపడుతున్నట్లుగా చెబుతున్నారు.మరి.. అధినాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది