గోమూత్రం తాగితే జ్వరం నయం... తెరపైకి సూడో సైన్స్ ప్రచారం!!
ఈ నెల 15న కనుమ సందర్భంగా చెన్నై వెస్ట్ మాంబళంలోని గోశాలలో జరిగిన గోపూజ కార్యక్రమంలో కామకోటి పాల్గొన్నారు.
By: Tupaki Desk | 19 Jan 2025 8:14 AM GMTగోమూత్రం తాగితే జ్వరం నయమైపోతుందని.. అప్పుడప్పుడూ గోమూత్రం తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిదని ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ కామకోటి వ్యాఖ్యానించారు! ఈ వ్యాఖ్యలపై నెట్టింట తీవ్ర చర్చ మొదలయ్యింది. ఈ సమయంలో కామకోటి వ్యాఖ్యలను సూడో సైన్స్ ప్రచారం అంటూ విమర్శలు మొదలైపోయాయి.
అవును... ఈ నెల 15న కనుమ సందర్భంగా చెన్నై వెస్ట్ మాంబళంలోని గోశాలలో జరిగిన గోపూజ కార్యక్రమంలో కామకోటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తన తండ్రి.. జ్వరం ఉందని, వైద్యుడి వద్దకు వెళ్లమంటారా అని ఓ సన్యాసిని అడిగారని.. గోముత్రం తాగితే తగ్గిపోతుందని ఆ సన్యాసి చెప్పారని తెలిపారు.
ఆ సన్యాసి చెప్పినట్లు తన తండ్రి గోమూత్రం తీసుకున్న 15 నిమిషాల్లోపు జ్వరం తగ్గిపోయిందని కామకోటి చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా... గోమూత్రం అతిపెద్ద ఔషధమని, శరీరానికి హాని కలిగించే బాక్టీరియాలకు వ్యతిరేకంగా పోరాడే శక్తి ఉందని పేర్కొన్నారు. దీనిపై సోషల్ మీడియా వేదికగా బలమైన చర్చ మొదలైంది.
ఇలా ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ గోమూత్రం తాగితే జ్వరం తగ్గుతుందని వ్యాఖ్యానించడంపై నెట్టింట చర్చ జరుగుతున్న వేళ.. కాంగ్రెస్ నాయకుడు కార్తి పీ చిదంబరం స్పందించారు. ఈ సందర్భంగా కామకోటి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందిస్తూ.. ఇది సూడో సైన్స్ ప్రచారం అంటూ వ్యాఖ్యానించారు.