సరిహద్దులు దాటి ఆంధ్రాకు మద్యం
రెండు రాష్ట్రాల పోలీసుల సహకారంతోనే మద్యం హద్దులు దాటినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
By: Tupaki Desk | 18 May 2024 12:30 AM GMTతెలంగాణ సరిహద్దున ఉన్న ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలలో ఇటీవల ఎన్నికలలో ఎక్కడ చూసినా ’ఓల్డ్ అడ్మిరల్‘ మద్యం సీసాలు దర్శనం ఇస్తున్నాయట. సరిహద్దున ఉన్న గోదావరి జిల్లాలు, కృష్ణా, రాయలసీమ జిల్లాలకు తెలంగాణ మద్యాన్ని తరలించినట్టు సమాచారం. రెండు రాష్ట్రాల పోలీసుల సహకారంతోనే మద్యం హద్దులు దాటినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు మాత్రమే జరగడంతో ఇక్కడ కార్యకర్తలు, నేతలకు తప్ప ఆయా పార్టీలు ఓటర్ల వరకు మద్యాన్ని తీసుకువెళ్లలేదు. ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ, లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగడంతో మద్యం విచ్చలవిడిగా ఏరులై పారింది. తెలంగాణ ప్రభుత్వంలోని కొందరి పెద్దల సహకారంతో ఈ మద్యం చెక్ పోస్టులు దాటినట్లు తెలుస్తున్నది.
ఏపీకి చెందిన ఎన్నారైలు ఆంధ్రాలో ఎన్నికల నేపథ్యంలో ముందస్తు పథకంలో భాగంగా తెలంగాణలో మద్యం షాపులు దక్కించుకున్నట్లు సమాచారం. ఇందులో ప్రధానంగా కొందరు ఎన్నారైలు కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తున్నది. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు ప్రచారం ముగిసిన వెంటనే తెలంగాణలోని ప్రభుత్వ పెద్దల సహకారంతో మద్యం తరలించినట్లు సమాచారం. ఏపీలో ఎన్నికల సందర్భంగా చెక్‌పోస్టుల వద్ద స్వాధీనం చేసుకున్న అక్రమ మద్యం కేసుల్లో తెలంగాణ మద్యం రెండో స్థానంలో ఉండడం గమనార్హం.