Begin typing your search above and press return to search.

ఎలాన్ మ‌స్క్‌, రౌలింగ్‌పై ఖ‌లీఫ్ ఫిర్యాదు.. క్రిమిన‌ల్ కేసు న‌మోదు.. విష‌యం సీరియ‌స్సే!

అంతేకాదు.. ఆమెను ఒలింపిక్స్‌కు ఎలా అనుమతి ఇస్తారని అనేక మంది ప్ర‌ముఖులు రంగంలోకి దిగి ట్విట్ట‌ర్ వేదిక‌గా విమ‌ర్శ‌లు గుప్పించారు.

By:  Tupaki Desk   |   15 Aug 2024 4:35 AM GMT
ఎలాన్ మ‌స్క్‌, రౌలింగ్‌పై ఖ‌లీఫ్ ఫిర్యాదు.. క్రిమిన‌ల్ కేసు న‌మోదు.. విష‌యం సీరియ‌స్సే!
X

బాక్సింగ్ దిగ్గ‌జం, అల్జీరియాకు చెందిన ఇమానే ఖ‌లీఫ్ పై టెస్లా దిగ్గ‌జం ఎలాన్ మ‌స్క్‌, హ్యారీ పోట్ట‌ర్ ర‌చ‌యిత జేకే రౌలింగ్ స‌హా ప‌లువురు చేసిన 'లింగ వివ‌క్ష‌' వ్యాఖ్య‌ల దుమారం ప‌తాక స్థాయికి చేరింది. వారిపై ఆమె చేసిన ఫిర్యాదు ఆధారంగా ఫ్రాన్స్ ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్ ఆన్‌లైన్‌లో కేసు న‌మోదు చేశారు. ఈ క్రిమిన‌ల్ కేసులో మ‌స్క్ స‌హా రౌలింగ్ ఇత‌రుల పేర్ల‌ను కూడా పేర్కొన్నారు. ప్యారిస్‌లో తాజాగా ముగిసిన ఒలింపిక్స్‌లో అల్జీరియా బాక్స‌ర్ ఇమానే ఖ‌లీఫ్ బంగారు ప‌తకాన్ని ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఖ‌లీఫా ప్యారిస్‌లో అడుగు పెట్టిన నాటి నుంచి ఆమెపై 'జండ‌ర్‌' విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

అస‌లేంటీ వివాదం?

ప్యారిస్‌లో జ‌రిగిన ఒలింపిక్స్‌లో అల్జీరియా క్రీడాకారిణి.. ఇమానే ఖలీఫ్‌ మహిళల 66 కేజీల విభాగంలో సత్తా చాటింది. అయితే.. ఆమె మ‌హిళ కాద‌ని, పురుషుడ‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. అంతేకాదు.. ఆమెను ఒలింపిక్స్‌కు ఎలా అనుమతి ఇస్తారని అనేక మంది ప్ర‌ముఖులు రంగంలోకి దిగి ట్విట్ట‌ర్ వేదిక‌గా విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇదే విష‌యంపై ఒలింపిక్స్‌ నిర్వహక కమిటీని ప్రశ్నించారు. లింగ నిర్ధార‌ణ‌లో ఒలింపిక్ క‌మిటీ విఫ‌ల‌మైంద‌ని కూడా వ్యాఖ్యానించారు. అయితే.. గ‌తంలో లింగ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లో ఖ‌లీఫా విఫ‌లం కావ‌డంతో ప్రపంచ ఛాంపియన్‌షిప్ నుంచి నిషేధించారు. అలాంటిది ఇప్పుడు ఖలీఫ్‌ను ఒలింపిక్స్‌కు అనుమతించడంపై ప‌లువురు ప్ర‌శ్నించారు.

ఈ క్ర‌మంలోనే ర‌చ‌యిత రౌలింగ్ తీవ్ర‌వ్యాఖ్య‌లు చేశారు. సోషల్ మీడియాలో బాక్సర్ ఖ‌లీఫ్ గురించి 10 రోజుల వ్యవధిలో మొత్తం 36 పోస్ట్‌లు, రీపోస్ట్‌లతో ఆమె అల్లాడించారు. ఖలీఫ్ గురించి పదేపదే ట్వీట్ చేశారు. ఖేలిఫ్ ను పురుషుడిగా పేర్కొన్నారు. ''ఆమె జీవిత ఆశయాన్ని అత‌ను నాశనం చేసాడు'' అని ఆరోపించారు. దీనిని మ‌స్క్ స‌మ‌ర్థించారు. ఈ ప‌రిణామాల‌పై ఖ‌లీఫ్ అప్ప‌ట్లో స‌హ‌నం చూపించినా.. ఒలింపిక్స్‌లో ప‌సిడి ప‌త‌కం అందుకున్నాక మాత్రం వారిపై లీగల్‌ చర్యలు తీసుకునేందుకు సిద్ధ‌మైంది. ఆన్‌లైన్‌లో తనకు వ్యతిరేకంగా పోస్ట్‌లు చేసిన వారిపై పరువు నష్టం దావా వేసింది. అదేవిధంగా క్రిమిన‌ల్ కేసులు కూడా పెట్టింది.

ఇటలీ ప్రధాని సహా చాలామంది ఇమానె ఖలీఫ్‌ను మహిళల విభాగంలో ఆడనివ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు పురుషుల జన్యు లక్షణాలు ఉన్న అథ్లెట్లను మహిళల పోటీల్లోకి ఎలా తీసుకున్నారంటూ ఇటలీ ప్రధాని జార్జియా మెలోని మండిపడ్డారు. మహిళా అథ్లెట్లు అందరూ ఒకే రకమైన నిబంధనలతో పోటీ పడే హక్కును కాపాడాలని అన్నారు. పురుష క్రోమోజోమ్‌లు ఉన్న అథ్లెట్లు మహిళల క్రీడలలో ఎలా పోటీ పడతారని, అది సరికాదని అన్నారు. మహిళల క్రీడల్లోకి పురుషులను అనుమతించకూడదని ఓ నెటిజన్‌ పోస్ట్‌ చేయగా దానికి ''కచ్చితంగా'' అని ఎలాన్‌ మస్క్‌ రిప్లై ఇచ్చారు. ఇక‌, అమెరికా మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ వివాదంలో వేలు పెట్టారు. దీంతో మొత్తంగా వీరిపై చ‌ర్య‌లు కోరుతూ ఖ‌లీఫ్ ఫిర్యాదు చేయ‌డం గ‌మ‌నార్హం.