Begin typing your search above and press return to search.

ఆర్జీ కర్ లో విధ్వంసం వేళ ఆస్పత్రులకు ఆరోగ్యశాఖ కీలక ఆదేశాలు

పశ్చిమబెంగాల్ లో జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   16 Aug 2024 1:38 PM GMT
ఆర్జీ కర్ లో విధ్వంసం వేళ ఆస్పత్రులకు ఆరోగ్యశాఖ కీలక ఆదేశాలు
X

పశ్చిమబెంగాల్ లో జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. కోల్ కతా నగరంలో నిరసనలు మిన్నంటాయి. ఈ మేరకు శనివారం దేశవ్యాప్తంగా శనివారం ఉదయం 6 గంటల నుంచి దేశవ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లోనూ సేవలను నిలిపివేయనున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ప్రకటించింది.

మరోపక్క ఈ హత్యాచార ఘటనను నిరసిస్తూ చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఇందులో భాగంగా ఆర్జీ కర్ హాస్పిటల్ లో కొందరు దుండగులు చొరబడి విధ్వంసం సృష్టించారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై కేంద్ర ఆరోగ్య శాఖ స్పందించింది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే కీలక ఆదేశాలు జారీ చేసింది.

అవును... ఆర్జీ కర్ ఆస్పత్రిలో కొందరు దుండగులు విధ్వంసం సృష్టించడంపై కేంద్ర ఆరోగ్యశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా... ఆస్పత్రి క్యాంపస్, లేదా సిబ్బంది, హెల్త్ వాలంటీర్ లపై దాడి జరిగిన ఆరు గంటల్లోపు పోలీసులు కేసు పెట్టాలని చెప్పింది. నిర్ణీత గడువులోగా ఫిర్యాదు అందకపోతే.. సంబంధిత ఆసుపత్రి హెడ్ దానికి బాధ్యత వహించాలని స్పష్టం చేసింది.

కాగా... ఇటీవల ఆర్జీ కర్ ఆస్పత్రిలో ఓ జూనియర్ వైద్యురాలు హత్యాచారానికి గురయ్యారు. దానికి నిరసనగా జరిగిన ఆందోళనల్లో సదరు ఆస్పత్రిపై దాడి జరిగింది. ఇందులో భాగంగా ముసుగులు ధరించిన విధ్వంసకారులు రడ్లు, కర్రలు, రాళ్లతో ఆస్పత్రి అవరణలోకి దూసుకొచ్చి దాడులు చేశారు. ఎమర్జెన్సీ రూం, మెడికల్ స్టోర్, ఓపీ డిపార్ట్మెంట్ లను ధ్వంసం చేశారు.

ఇదే సమయంలో ఆస్పత్రిలోని సీసీ కెమెరాలనూ పగలగొట్టారు. దీంతో బీజేపీ స్పందిస్తూ మమతా బెనర్జీపై విమర్శలు చేసింది. సీబీఐకి సాక్ష్యాలు చిక్కకుండా ఉండేందుకే ఆస్పత్రిపైకి తృణముల్ గూండాలను పంపారని విమర్శించింది. ఈ సమయంలో బీజేపీ చేస్తున్న ఆరోపణలను మమత తిప్పికొట్టారు. దాడుల వెనుక పలు పొలిటికల్ పార్టీస్ హ్యాండ్ ఉందంటూ ప్రత్యారోపణలు చేశారు.

మరోవైపు ఆస్పత్రిపై జరిగిన దాడులను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐ.ఎం.ఏ) తీవ్రంగా ఖండించింది. ఈ విధ్వంసంపై పశ్చిమ బెంగాల్ హైకోర్టు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే కేంద్ర ఆరోగ్యశాఖ తాజాగా ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది.