5 రోజులు, 18 ప్లేసులు, 55 మంది ఆఫీసర్లు... ఐటీ రైడ్స్ పై కీలక అప్ డేట్!
అవును... తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన నిర్మాతలు, నిర్మాణ సంస్థల్లో మంగళవారం నుంచి సాగిన ఆదాయపు పన్ను అధికారుల సోదాలు శనివారం తెల్లవారుజామున ముగిశాయని అంటున్నారు.
By: Tupaki Desk | 25 Jan 2025 5:29 AM GMTఐదు రోజుల పాటు 18 ప్లేసుల్లో దాదాపు 55 మంది అధికారుల బృందాలు టాలీవుడ్ లోని ప్రముఖుల ఇళ్లు, ఆఫీసులపై ఐటీ దాడులు నిర్వహించిన విషయం తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంచలనంగా మారిందనే చెప్పాలి. గతంలో ఎన్నడూ లేని విధంగా అన్నట్లుగా అదాయపు పన్ను శాఖ అధికారులు ఐదు రోజుల పాటు చేసిన సోదాలు తాజాగా ముగిశాయని అంటున్నారు.
అవును... తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన నిర్మాతలు, నిర్మాణ సంస్థల్లో మంగళవారం నుంచి సాగిన ఆదాయపు పన్ను అధికారుల సోదాలు శనివారం తెల్లవారుజామున ముగిశాయని అంటున్నారు. ఈ సోదాల్లో పలు నిర్మాణ సంస్థలకు, పలువురు నిర్మాతలకు చెందిన కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది.
ప్రధానంగా తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్, బడా నిర్మాత దిల్ రాజు ఇంట్లో శుక్రవారం ఉదయంతో సోదాలు ముగియడంతో.. శ్రీనగర్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఆఫీసుకు తీసుకెళ్లి, ఆయన సమక్షంలో సోదాలు నిర్వహించినట్లు చెబుతున్నారు. ఈ సమయంలో గత రెండేళ్ల ఆ సంస్థ నిర్మాణ చరిత్రను తవ్వినట్లు కథనాలొస్తున్నాయి.
ఈ సందర్భంగా ప్రముఖ తమిళ స్టార్ హీరో విజయ్ తో నిర్మించిన చిత్రం నుంచి తాజా 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా వరకూ పెట్టిన పెట్టుబడులు, వచ్చిన లాభాలు, కట్టిన టాక్సులపై సవివరంగా ఆరా తీసినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పలు కీలక డాక్యుమెంట్లు సీజ్ చేశారనే కథనాలు బలంగా వినిపించాయి.
ఇదే సమయంలో దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ ఆడిటర్, అకౌంటెట్ స్టేట్ మెంట్స్ ను ఐటీ అధికారులు రికార్డ్ చేసినట్లు చెబుతున్నారు. ఈ సమయంలో వారిచ్చిన స్టేట్ మెంట్స్ చాలా కీలకంగా మారే అవకాశం ఉందని అంటున్నారు! అంతకు ముందు దిల్ రాజు సోదరుడు, కుమార్తె నివాసాల్లోనూ ఐటీ అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఇదే క్రమంలో... మైత్రీ మూవీ మేకర్స్ నిర్వాహకులు నవీన్, రవిశంకర్ లతో పాటు సీఈఓ చెర్రీ ఇళ్లల్లోనూ, ఆఫీసుల్లోనూ అధికారులు సోదాలు చేపట్టారు. ప్రధానంగా "పుష్ప-2" సినిమా కలెక్షన్స్ కేంద్రంగా ఈ దాడులు నిర్వహించారని చెబుతున్నారు. కలెక్షన్స్ విషయంలో జరుగుతున్న ప్రచారానికి కట్టిన ట్యాక్సులకు వ్యత్యాసం ఉందా అనే విషయంపై చర్చ జరుగుతుంది!
ఇలా దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్, నిర్మాత శ్రీధర్, డైరెక్టర్ సుకుమార్, మ్యాగో మీడియా మొదలైన సంస్థలు, ఆ సంస్థల యజమానుల ఇళ్లపై జరిగిన ఐటీ దాడులు మంగళవారం మొదలై శనివారం తెల్లవారుజామున ముగిసినట్లు చెబుతున్నారు. ఈ సమయంలో ఐటీ అధికారులు ఏమి తేల్చారు అనేది ఇప్పుడు అత్యంత ఆసక్తిగా మారింది.
ఐదు రోజుల పాటు వివిధ ప్రదేశాల్లో, పదుల సంఖ్యలో అధికారులు నిర్వహించిన ఈ దాడుల్లో ఏమి తేల్చారు..? ఆల్ ఈజ్ వెల్ అని క్లారిటీకి వచ్చారా..? అంతా తెలుపే అని నిర్ధారించారా..? లేక.. ఏవైనా 'నల్ల' మచ్చలు గుర్తించారా..? తీవ్ర ఆసక్తిగా మారిన ఈ ప్రశ్నలకు ఐటీ అధికారులు ప్రెస్ మీట్ పెట్టి ఏవైనా విషయాలు వెల్లడిస్తారా.. లేదా అనేది వేచి చూడాలి!