Begin typing your search above and press return to search.

క్రికెటర్ పెట్టిన రాజకీయ పార్టీ..క్రికెట్ టోర్నీకే ఎసరు పెట్టింది

ఇమ్రాన్ పార్టీ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ (పీటీఐ) కార్యకర్తలు తమ నాయకుడు విడుదల కోరుతూ ఇస్లామాబాద్‌ లో పెద్దఎత్తున ఆందోళనలకు దిగుతున్నారు.

By:  Tupaki Desk   |   29 Nov 2024 12:39 PM GMT
క్రికెటర్ పెట్టిన రాజకీయ పార్టీ..క్రికెట్ టోర్నీకే ఎసరు పెట్టింది
X

వన్డే క్రికెట్ లో ప్రపంచ కప్ తర్వాత అత్యంత పెద్ద టోర్నీ చాంపియన్స్ ట్రోఫీ. దీని నిర్వహణలోనూ ఓ ప్రత్యేకత ఉంది. ఆ ఏడాది వన్డే ప్రపంచ కప్ జరిగితే వన్డే తరహాలో.. టి20 ప్రపంచ కప్ జరిగితే టి20 పద్ధతిలోనూ చాంపియన్స్ ట్రోఫీ నిర్వహిస్తారు. కాగా, 2025 ఫిబ్రవరిలో జరిగే చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే, భద్రతా కారణాల రీత్యా పాకిస్థాన్ వెళ్లేందుకు భారత్ నిరాకరిస్తోంది. మరో మూడు నెలలు కూడా సమయం లేని వేళ.. ట్రోఫీ షెడ్యూల్‌ వెలువడలేదు. అయితే, శుక్రవారం ఐసీసీ దీనికి తెరదించనుంది. తమ మ్యాచ్‌లు తటస్థ వేదికపై నిర్వహించేలా హైబ్రిడ్‌ పద్ధతిని భారత్‌ కోరుతోంది. ఆతిథ్య పాక్‌ మాత్రం ససేమిరా అంటోంది. దీంతో బంతి ఐసీసీ కోర్టుకు చేరింది.

మూడు మార్గాలు..

పాకిస్థాన్ 1996 తర్వాత ఇంతవరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టోర్నీకి ఆతిథ్యం ఇవ్వలేదు. 1996లోనూ భారత్-శ్రీలంకతో కలిసి వన్డే ప్రపంచ కప్ నిర్వహించింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే ఐసీసీ టోర్నీ (చాంపియన్స్ ట్రోఫీ)కి ఆతిథ్యం ఇస్తోంది. కాకపోతే భారత్ రానంటుండడంతో ఐసీసీ మూడు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోంది. హైబ్రిడ్‌ విధానంలో మెజారిటీ మ్యాచ్‌ లను పాక్‌ లో.. భారత్‌ మ్యాచ్‌ లను తటస్థ వేదికకు తరలించనుంది. దీనికి పాకిస్థాన్‌ ఒప్పుకోకుంటే.. ట్రోఫీ మొత్తాన్ని పాక్‌ బయట నిర్వహించాలన్న ఆలోచనలో ఉంది. అయితే, ఆతిథ్య హక్కులు మాత్రం పాక్‌ దగ్గరే ఉంటాయి. భారత్‌ ను తప్పించి పాక్‌ లోనే టోర్నీ నిర్వహించాలన్నది మరో ఆలోచన. అయితే, ఇది ఆర్థికంగా భారీ నష్టం చేకూరుస్తుంది కాబట్టి ఐసీసీ ఆ ఆలోచనే చేయదు.

అవకాశం ఇచ్చిన ఇమ్రాన్ పార్టీ

పాకిస్థాన్ లో 2009లో శ్రీలంక జట్టుపై ఉగ్రవాదుల కాల్పులు జరిగాయి. సమరవీర వంటి క్రీడాకారులు గాయపడ్డారు. దీంతో కొన్నేళ్ల పాటు ఏ జట్టు కూడా ఆ దేశంలో పర్యటించలేదు. ఇలాంటి సమయంలో ఐదారేళ్లుగా సిరీస్ లు జరుగుతున్నాయి. కాగా భారత్ ముంబై దాడుల అనంతరం పాకిస్థాన్ తో ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలను నిలిపివేసింది. కేవలం ఐసీసీ టోర్నీల్లోనే ఆడుతోంది. ఇప్పుడు ఐసీసీ టోర్నీనే పాకిస్థాన్ లో జరుగుతోంది. దీనికి భారత్ అభ్యంతరాలు అలా ఉంటే.. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌ లో రాజకీయ ఆందోళనలు జరుగుతున్నాయి. పాక్ కు వన్డే ప్రపంచ కప్ అందించిన, ప్రపంచ క్రికెట్ లో ఉత్తమ ఆల్ రౌండర్, కెప్టెన్ అయిన మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీ ఈ ఆందోళనలు చేస్తుండడం గమనార్హం. ఇమ్రాన్ పార్టీ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ (పీటీఐ) కార్యకర్తలు తమ నాయకుడు విడుదల కోరుతూ ఇస్లామాబాద్‌ లో పెద్దఎత్తున ఆందోళనలకు దిగుతున్నారు. ఈ దెబ్బతో శ్రీలంక-ఎ జట్టు పాకిస్థాన్ పర్యటనను కుదించుకుంది. దీంతో ఐసీసీ భేటీలో మెజారిటీ సభ్యులు ఛాంపియన్స్‌ ట్రోఫీని తరలించాలని భావిస్తే పాక్‌ కు భంగపాటు తప్పకపోవచ్చు. మొదటి ప్రత్యామ్నాయానికి భారత్‌, ఐసీసీ మొగ్గు చూపుతుండగా.. పాక్‌ మాత్రం కుదరదంటోంది. రెండో ప్రత్యామ్నాయాన్ని ఐసీసీ తీవ్రంగా పరిశీలిస్తున్నది. అంటే.. ఒక క్రికెటర్ పెట్టిన పార్టీ.. క్రికెట్ టోర్నీ (పరోక్షంగా) తరలిపోవడానికి కారణం అవుతోంది అన్నమాట.