ఇమ్రాన్ ఖాన్ 14, 10, 7 ఏళ్ల శిక్ష
వారం రోజుల వ్యవధిలోనే ఇమ్రాన్ ఖాన్ కు వేర్వేరు కేసుల్లో 14 ఏళ్ళు, 10 ఏళ్ళు శిక్ష పడడం సంచలనం రేపుతోంది. ఆ షాక్ నుంచి తేరుకోక ముందే ఇమ్రాన్ ఖాన్ కు పాక్ లోకి కోర్టు మరో షాకిచ్చింది.
By: Tupaki Desk | 3 Feb 2024 2:04 PMపాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే ఇమ్రాన్ ఖాన్ కు వేర్వేరు కేసుల్లో 14 ఏళ్ళు, 10 ఏళ్ళు శిక్ష పడడం సంచలనం రేపుతోంది. ఆ షాక్ నుంచి తేరుకోక ముందే ఇమ్రాన్ ఖాన్ కు పాక్ లోకి కోర్టు మరో షాకిచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా వివాహం చేసుకున్నారన్న ఆరోపణలతో ఇమ్రాన్ ఖాన్ తో పాటు ఆయన భార్య బుష్రా బీబీకి పాక్ కోర్టు తాజాగా ఏడేళ్ల జైలు శిక్ష విధించడం సంచలనం రేపుతోంది.
బుష్రా బీబీ మొదటి భర్త ఫరీద్ పెట్టిన కేసుపై పాకిస్థాన్ లోని కోర్టు విచారణ జరిపి ఈ తీర్పు వెలువరించింది. ఇస్లాం షరియత్ నిబంధనల ప్రకారం భర్త చనిపోయిన లేదా విడాకులు తీసుకున్న తర్వాత మాత్రమే మరో పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అలా పెళ్లి చేసుకునేందుకు ఇస్లాం షరియత్ ప్రకారం కొద్ది రోజులపాటు గ్యాప్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, ఆ నిబంధనలను తన మాజీ భార్య బుష్రా బీబీ ఉల్లంఘించిందని ఆమె మొదటి భర్త ఫరీద్ ...ఆమెపై కేసు పెట్టారు.
అంతేకాకుండా, పెళ్ళికి ముందే ఇమ్రాన్ ఖాన్ తో తన భార్య బుష్రా బీబీకి వివాహేతర సంబంధం ఉందని కూడా ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన న్యాయస్థానం ఇమ్రాన్ ఖాన్, బుష్రా బీబీ దంపతులకు ఏడేళ్ల శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. 2017 నవంబర్ లో ఫరీద్ నుంచి బుష్రా బీబీ విడాకులు తీసుకొని ఆ తర్వాత 2018 జనవరిలో ఇమ్రాన్ ఖాన్ ను పెళ్లి చేసుకున్నారు.
అంతకుముందు దోషా ఖానా కేసులో ఇమ్రాన్ ఖాన్, బుష్రా బీబీలకు 14 ఏళ్ల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. ఇక, అధికారిక రహస్య పత్రాల దుర్వినియోగం కేసులో ఇమ్రాన్ ఖాన్ కు పాకిస్తాన్ లోని కోర్టు 10 ఏళ్ల శిక్ష విధించింది. వారం రోజుల వ్యవధిలోనే ఇమ్రాన్ ఖాన్ కు 3 కేసులలో అన్నేసి ఏళ్లు శిక్ష పడడం సంచలనం రేపుతోంది. ఫిబ్రవరి 8వ తేదీన పాకిస్థాన్ లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ కు వరుస శిక్షలు పడటం విశేషం.