ఎన్నికల నగారా మోగించి.. ఇమ్రాన్అరెస్టు.. ఇక పోటీ చేయలేనట్
కోశాగార అవినీతి కేసులో ఆయనకు కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. అంతేగాక ఐదేళ్లు ఎన్నికల్లో పాల్గొనకుండా అనర్హుడిగా ప్రకటించింది.
By: Tupaki Desk | 5 Aug 2023 9:55 AM GMTమన దగ్గర పార్లమెంటు ఎలాగో పాక్ లో జాతీయ అసెంబ్లీ అలాగ. 2018లో అక్కడ ఎన్నికలు జరగ్గా దిగ్గజ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ కు చెందిన తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ విజయం సాధించింది. నాలుగేళ్లలోపే ఆయన పదవి కోల్పోయారు. ఇక జాతీయ అసెంబ్లీ పదవీ కాలం మూడు రోజులు ముందే దాని ని రద్దుచేసి ఎన్నికలు జరిపించాలని ఈ నెల 9న సిఫార్సు చేస్తానని పాక్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ తెలిపారు. ఆ మేరకు సంకీర్ణ ప్రభుత్వ భాగస్వాములతో గురువారం ఆయన విందు సమావేశం నిర్ణయించారు. నోటిఫికేషన్ పై దేశాధ్యక్షుడు సంతకం చేయగానే జాతీయ అసెంబ్లీ రద్దవుతుంది. ఆయన సంతకం చేయకపోతే ప్రధాని నోటిఫికేషన్ జారీచేసిన 48 గంటల్లో సభ రద్దయిపోతుంది. ఆపైన 90 రోజుల్లో ఎన్నికలుంటాయి.
ఇమ్రాన్ లోపలేసి..
ఇమ్రాన్ ఏడాదిన్నర కిందట పదవి కోల్పోయారు. కోశాగార అవినీతి కేసులో ఆయనకు కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. అంతేగాక ఐదేళ్లు ఎన్నికల్లో పాల్గొనకుండా అనర్హుడిగా ప్రకటించింది. ఇస్లామాబాద్ లోని జిల్లా, సెషన్స్ కోర్టు శనివారం ఇచ్చిన ఈ తీర్పు పాక్ రాజకీయాల్లో పెద్ద కుదుపే. రూ.లక్ష జరిమానా కూడా ఇమ్రాన్ కట్టాల్సి ఉంది. లేదంటే ఇంకో ఆరు నెలల పాటు జైల్లో ఉండాలని తీర్పునిచ్చింది.
అలా తీర్పు.. ఇలా అరెస్టు
వాస్తవానికి ఇమ్రాన్ పై అవినీతి ఆరోపణలతో పాటు 150 కేసులున్నాయని అంటారు. గతం లో ఆయన కోర్టుకు హాజరైనప్పుడు పెద్ద హైడ్రామానే నడిచింది. ఓసారి కాల్పులు కూడా జరిగాయి. ఇమ్రాన్ కాలుకు గాయమైంది. అసలు ఆయనను ఎప్పుడైనా అరెస్టు చేయొచ్చనే వదంతులున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కోర్టు తీర్పు వచ్చింది. మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఇచ్చిన ఆ తీర్పు అనంతరం వారెంట్ కూడా జారీ చేసింది. దీంతో క్షణాల వ్యవధిలోనే ఇమ్రాన్ ను పోలీసులు అరెస్టు చేశారు. లాహోర్ లోని నివాసం లో అదుపులోకి తీసుకున్నారు.
ఎన్నికల్లో పాల్గొనే వీల్లేనట్టేనా?
ఇమ్రాన్ వయసు 70 ఏళ్లు. ఆయన ఐదేళ్లు ఎన్నికల్లో పాల్గొనకుండా కోర్టు తీర్పునిచ్చింది. త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఇమ్రాన్ పోటీ చేసే వీల్లేకుండా పోయింది. మాజీ క్రికెటర్ గా ఇమ్రాన్ కు దేశం లో ఇప్పటికీ మంచి ఆదరణ ఉంది. ఆయనను అనవసరంగా పదవి నుంచి దింపేశారనే సానుభూతీ కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో ఉద్దేశపూర్వకంగానే అనర్హత వేటు వేసినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది.
నిరుడు ఏప్రిల్ లో పదవి పోయి..
2022 ఏప్రిల్ లో అవిశ్వాస తీర్మానంతో ఇమ్రాన్ పదవి ని కోల్పోయారు. ఆ తర్వాత కేసులు చుట్టుముట్టాయి. ఇమ్రాన్ ప్రధాన మంత్రిగా ఉండగా.. విదేశీ పర్యటనల్లో వచ్చిన బహుమతుల ను విక్రయించారనే ఆరోపణలు వచ్చాయి. ఇదే తోషాఖానా (కోశాగారం) కేసు. ఇమ్రాన్ కు 58 ఖరీదైన బహుమతులు రాగా తోషాఖానాలో జమ చేయాలి. వాటిని సొంతం చేసుకోవాలనుకుంటే నిబంధనల ప్రకారం సగం ధరం చెల్లించాలి. రూ.38 లక్షల రొలెక్స్ గడియారాన్ని రూ.7,54,000 చెల్లించి, రూ.15 లక్షల విలువ చేసే మరో రొలెక్స్ గడియారానికి రూ.2,94,000 మాత్రమే చెల్లించారు. ఇంకో రూ.8 లక్షల కానుకల ను రూపాయి కూడా ఖజానాకు జమ చేయకుండానే తీసుకొన్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆ తర్వాత వాటిని దుబాయిలో అమ్ముకొన్నారని అభియోగం నమోదైంది.
మళ్లీ నవాజ్ పాలన..?
పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ త్వరలో లండన్ నుంచి తిరిగివస్తారని అతడి తమ్ముడు, పాక్ ప్రధాని షెహబాజ్ తెలిపారు. పాకిస్థాన్ ముస్లిం లీగ్ (నవాజ్) వచ్చే ఎన్నికల్లో గెలిస్తే నవాజ్ షరీఫే ప్రధానిగా పగ్గాలు చేపడతారని వివరించారు. అయితే, నవాజ్ పై పెద్ద ఎత్తున కేసులున్నాయి. మరి ఆయన తిరిగొస్తే ఏం జరుగుతుందో?