కర్నూలు వైసీపీ : ఇద్దరూ కాడె వదిలేశారా ?
కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యేగా 2019లో హఫీజ్ ఖాన్ గెలిచారు.
By: Tupaki Desk | 24 Dec 2024 4:00 AM GMTవైసీపీకి అధికారం పోయింది. అంతే దాని మీద నాయకులకు ఆసక్తి కూడా పోయిందా అంటే చాలా కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గాల్లో చూస్తే అదే పరిస్థితి కనిపిస్తోంది. ఒకనాడు ఇన్చార్జి పదవి కోసం పైరవీలు చేస్తూ తెగ హడావుడి చేస్తూ ఉండేవారు. తీరా అంతా చేసి పదవులు తెచ్చుకుని ఎన్నికల్లో టికెట్లు దక్కించుకున్న వారు పార్టీ ఓడాక మాత్రం కనిపించడం లేదని అంటున్నారు.
దాంతో అయిదేళ్ల పాటు కర్నూలు ఎమ్మెల్యేగా వైసీపీకి పనిచేసిన ఎమ్మెల్యే కనిపించడం లేదు, కొత్తగా 2024లో టికెట్ సంపాదించుకుని పోటీ చేసిన ఆయన కూడా కాడె వదిలేశారు అని అంటున్నారు. దీంతో ఇద్దరికీ చెడిన చందంగా కర్నూలు వంటి చోట వైసీపీ స్థితి తయారైంది అని అంటున్నారు.
కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యేగా 2019లో హఫీజ్ ఖాన్ గెలిచారు. ఆయన అయిదేళ్ల పాటు ఎమ్మెల్యేగా రాజ్యం చేశారు. ఇక 2024లో ఆయనకు టికెట్ ని అధినాయకత్వం నిరాకరించింది. దాంతో అలిగి ఆయన పార్టీకి దూరం అయిపోయారు. కర్నూలు ఎమ్మెల్యే టికెట్ ని సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్న ఇంతియాజ్ అహ్మద్ తన పదవికి సైతం రాజీనామా చేసి దక్కించుకున్నారు
అయితే కూటమి ప్రభంజనంలో అక్కడ టీజీ భరత్ గెలిచారు. గెలవడమే కాదు మంత్రిగా కూడా అయిపోయారు. ఇపుడు అంతా కూటమి హవా ధూం ధాం గా సాగుతోంది. దీంతో అధికార కూటమిని తట్టుకుని గట్టిగా కార్యక్రమాలు నిర్వహించాల్సిన నేపధ్యంలో ఇంతియాజ్ అహ్మద్ అయితే మౌన ముద్ర దాల్చారు అని అంటున్నారు.
ఆయన కచ్చితంగా గెలుస్తాను అని అనుకున్నారు. గెలవకపోయేసరికి బాధపడిపోయారని అనవసరంగా ఉద్యోగం మానుకుని తప్పు చేశాను అన్న ఫీలింగ్ లోకి వెళ్ళిపోయారు అని అంటున్నారు. ఆయన విషయం ఎలా ఉంది అంటే గత ఆరు నెలలుగా పెద్దగా పార్టీ యాక్టివిటీలో అయితే లేరని అంటున్నారు. అధినేత జగన్ వచ్చినపుడు మాత్రమే కనిపిస్తున్నారు అని అంటున్నారు. మిగిలిన టైం అంతా సైలెంట్ గా ఉంటున్నారు అని చెబుతున్నారు.
కూటమి బలంగా ఉండడంతో ఎదురు నిలిచి పోరాడడం కష్టమన్న ఆలోచనతో ఉన్నారా అన్న చర్చ కూడా సాగుతోంది. దీంతో ఆయన ప్లేస్ లో కొత్త వారిని ఇంచార్జిగా పెట్టాలని అధినాయకత్వం విశ్వ ప్రయత్నం చేస్తోంది అని అంటున్నారు. 2019లో కర్నూలు జిల్లాలో ఉన్న మొత్తం 14 సీట్లను గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసిన వైసీపీకి ఇపుడు జిల్లా కేంద్ర స్థానంలోనే ఈ ఇబ్బందులు వస్తున్నాయి అంటేనే ఫ్యాన్ పార్టీ బాధ ఏంటో ఆలోచించాలని అంటున్నారు.
ఈ నేపధ్యంలో కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న ఎస్వీ మోహన్ రెడ్డి భార్య విజయ మనోహరిని ఇంచార్జిగా నియమిస్తారు అని అంటున్నారు. ఆమె కూడా 2024లో టికెట్ కోసం ప్రయత్నం చేశారు అని అంటున్నారు. అయితే ముస్లిం మైనారిటీలు ఎక్కువగా ఉన్నందువల్ల వారికే టికెట్ ఇవ్వాలని భావించి అధినాయకత్వం ఇంతియాజ్ అహ్మద్ కి టికెట్ ఇచ్చింది.
కానీ ఇపుడు కర్నూలులో వైసీపీ కాడె మోసే వారే కనిపించడం లేదని అందువల్ల ఆమెని ఏరి కోరి తెచ్చి పగ్గాలు అందిస్తున్నారు అని అంటున్నారు. దీంతో ఇంతియాజ్ అహ్మద్ కి వైసీపీ చెక్ చెప్పేసినట్లే అంటున్నారు. కేవలం ఆరు నెలల తేడాలోనే రాజకీయ ఎంట్రీ, ఎగ్జిట్ రెండూ ఆయనకు జరిగిపోయాయా అన్న చర్చ అయితే ఉంది మరి.