ఏపీలో పట్టణ ఓట్లు, పల్లె ఓట్లు ఎవరికి.. ఎటువైపో...!
మరోవైపు.. మినీ మేనిఫెస్టోను పట్టుకుని ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు.
By: Tupaki Desk | 8 Jan 2024 11:30 AM GMTవచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని కృతనిశ్చయంగా పెట్టుకున్న ప్రధాన ప్రతిపక్షం టీడీపీ భారీ ఎత్తున కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. వాస్తవానికి ఒకటి రెండు కార్యక్రమాలతో ముందుకు సాగుతుందని అనుకున్న టీడీపీ.. గత ఏడాదిన్నర కాలంలో అనేక కార్యక్రమాలకు తెరదీసింది. యువగళం పేరుతో నారా లోకేష్ పాదయాత్ర నుంచి బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో చంద్రబాబు పర్యటనలు చేశారు. ఇక, బాదుడే బాదుడు కార్యక్రమం నిరంతరాయంగా సాగుతూనే ఉంది. మరోవైపు.. మినీ మేనిఫెస్టోను పట్టుకుని ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు.
ఇక, తాజాగా `రా.. కదలిరా` పేరుతో 22 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి చొప్పున భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేశారు. ప్రస్తుతం అవి సాగుతున్నాయి కూడా. కట్ చేస్తే.. ఇన్నికార్యక్రమాలు.. ఇన్ని సభలు కూడా.. ఎక్కడ జరుగుతున్నాయంటే..కేవలం నగరాలు.. పట్టణాల్లోనే. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఎక్కడ సభ పెట్టినా.. నియోజకవర్గా ల కేంద్రాల్లో మాత్రం పెట్టడం లేదు. ప్రస్తుతం పార్లమెంటు నియోజకవర్గ కేంద్రాల్లో సబలు నిర్వహించాలని నిర్ణయించారు. తాజాగా తిరువూరు, ఆచంటల్లో చంద్రబాబు సభలు పెట్టారు.
అయితే.. పట్టణాలు, నగరాల్లో వైసీపీకి సహజంగానే కొంత వ్యతిరేకత ఉంది. అభివృద్ధి లేదని.. ఉద్యోగాల కల్పన లేదని.. ఉద్యోగుల హక్కులు, డిమాండ్లు పరిష్కరించడం లేదని ఇలా వివిధ కారణాలతో వైసీపీపై ఆగ్రహంతో ఉన్నారు. సో.. నగరాలు పట్టణాల్లో ఆటోమేటిక్‌గానే వైసీపీ వ్యతిరేకత టీడీపీకి అనుకూలంగా మారనుందనే విశ్లేషణలు వస్తున్నాయి. దీనిని వైసీపీ కూడా అంచనా వేసింది. ఈ క్రమంలోనే గ్రామ గ్రామాన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఆరు మాసాల కిందట నుంచే వలంటీర్లు, గృహ సారథులను గ్రామాల్లో యాక్టివేట్ చేసింది. తద్వారా.. గ్రామీణ స్థాయిలో పట్టు జారకుండా చూసుకుంటోంది.
మరి ఇలాంటి వ్యూహాలు టీడీపీ ఎక్కడా వేస్తున్న జాడ కనిపించడం లేదు. పైగా.. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా టీడీపీ కార్యక్రమాలు కూడా సాగడం లేదు. ప్రధాన నాయకులను పక్కన పెడితే..కనీసం.. మండలస్థాయి నాయకులను కూడా టీడీపీ ఎంగేజ్ చేయడం లేదు. మరొవైపు.. ఓటు బ్యాంకు అంతా కూడా .. నగరాల్లోనే ఉందని అనుకున్నా.. తటస్థ ఓటుబ్యాంకు కూడా అంతే స్థాయిలో నగరాల్లోను, పట్టణాల్లోను ఉంది. ఎటొచ్చీ.. గ్రామీణ స్థాయిలో మాత్రం పూర్తిస్థాయి ఓటు బ్యాంకు పోలింగ్ బూత్ వరకు కదులుతుంది. ఇదే.. వైసీపీకి ఉన్న ధైర్యం. ఇంటింటికీ పింఛను, రేషన్, వైద్యం, వలంటీర్ వ్యవస్థ, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు వంటివి గ్రామీణ స్థాయిలో చెప్పుకోదగ్గవిగా ఉన్నాయని ఆ పార్టీ అంచనా వేస్తున్న నేపథ్యంలో టీడీపీ కూడా అదేస్థాయిలో పుంజుకోవాల్సిన అవసరం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.